ఓర్వలేని కళ్లన్నీ నీ మీదే తల్లీ!

Sakshi Editorial On English Medium Education AP Govt Schools

జనతంత్రం

ఎదగాలి నాన్నా... నువ్వింకా ఇంకా పైపైకి... ఈ లోకం గుర్తించేంత పైకి ఎదగాలి తల్లీ! దిగువ కులాల వృత్తి చట్రాల్లో బందీలై వెనుకబాటుతనాన్ని వారసత్వంగా మోసుకొస్తున్న మీ అమ్మానాన్నల కలలు ఫలించేలా... మీకు అండగా నిలబడిన మీ జగన్‌ మామ ఆశీస్సులు సాకారమయ్యేలా ఎదగాలి తల్లీ! అసూయా దృక్కులు నిన్ను వెన్నాడుతాయ్‌. భయపడకు! ఓర్వలేని తనం శాపనార్థాలు పెడుతుంది. చలించకు! పెత్తందార్లు పగబడతారు. ప్రతిఘటించు! నీ వెనుక మీ మేనమామ ఉన్నాడు.

తరతరాలుగా మీ తాత ముత్తాతల దగ్గర్నుంచీ మీ అమ్మానాన్నల దాకా మిమ్మల్ని తొక్కిపెట్టి ఉంచిన పెత్తందార్లు ఇప్పుడు నీ చదువు మీద యుద్ధం ప్రకటించారు. భయం లేదులే! అభయం దొరికింది కదా... ఇక దృష్టి పెట్టి చదువు! చదువే నీ తిరుమంత్రం. చదువే నీ రణతంత్రం. అంబేడ్కర్, ఫూలే, సావిత్రీబాయి, నారాయణ గురులు ఉపదేశించిన విముక్తి మార్గం చదువు.

నువ్వు అమెరికాకు వెళ్లి ఐక్యరాజ్యసమితి వేదికపై ఇంగ్లీషులో ధారాళంగా మాట్లాడుతుంటే మన పెత్తందార్లు కళ్లల్లో నిప్పులు పోసుకున్నారు తెలుసా? నువ్వు అంతర్జాతీయ యూనివర్సిటీల్లో మాట్లాడుతుంటే ఈర్ష్యతో వాళ్ల కడుపులు కుతకుతలాడాయి తెలుసా? కానీలే, ‘రానీ, రానీ, వస్తే రానీ! కోపాల్, తాపాల్, శాపాల్‌ రానీ’ అన్నాడు కదా శ్రీశ్రీ. నిప్పులు పోసుకున్న వాళ్ల కళ్లు పేలిపోనీ, రగిలిన కడుపులు పగిలిపోనీ, ఇప్పుడా పెత్తందార్లు మీ అమ్మానాన్నలపైనే కాదు, అండగా నిలబడిన మీ జగన్‌ మామ మీద, చదువుకుంటున్న మీ మీద కూడా యుద్ధం ప్రకటించారు.

ఈ యుద్ధంలో గెలవాలంటే మీ కర్తవ్యం ఏమిటో తెలుసా? బాగా చదవాలి. పైపైకి ఎదగాలి. అడవులు కొండలు ఎడారులా మనకడ్డంకి అంటూ ముందుకు సాగాలి. సరిహద్దుల్నీ సముద్రాల్నీ దాటుకుంటూ వెళ్లాలి. ఆకాశాన్ని చీల్చుకుంటూ పైకెగరాలి. ఆరుద్ర పాట తెలుసుకదా! ‘‘గ్రహ రాశుల నధిగమించి, ఘనతారల పథము నుంచి, గగనాంతర రోదసిలో,గంధర్వ గోళ గతులు దాటి’’ అలా సాగిపోవాలి.

ఇంతకూ పెత్తందార్లంటే ఎవరో తెలుసా చిన్నా? వాళ్లూ అందరిలాగే ఉంటారు. కోరలూ కొమ్ములూ కనిపించవు. కాకపోతే డబ్బు ఉన్నదనే అహంకారంతో కనిపించని కొమ్ములు మొలుస్తాయి. ఈ సృష్టిలో ప్రతీదీ తమకే కావాలనుకుంటుంది పెత్తందార్ల వర్గం. భూమి, గాలి, నీరు, ఆకాశం మీద కూడా వాళ్లకే హక్కు ఉన్నట్టు భావిస్తారు. పొలాలు, ఫ్యాక్టరీలు, డబ్బు, అధికారం, హోదా అన్నీ వాళ్లకే ఉండాలి. మంచి చదువులు చదివితే తెలివి తేటలొస్తాయి.

కనుక మంచి చదువులు తమ పిల్లలకే ఉండాలి. పేద పిల్లలు కూడా మంచి చదువులు చదివితే తమ పిల్లలతో సమానంగా ఉంటారు. మంచి ఉద్యోగాలు సంపాదిస్తారు. తమకు నౌకర్లు, చాకర్లు, డ్రైవర్లు, వంట వాళ్లు దొరకరు. సినిమా వాళ్లకు ‘పవర్‌ స్టార్‌’.. ‘పంచర్‌స్టార్‌’ అని వెర్రికేకలు వేసే ఫ్యాన్స్‌ దొరకరు. ఈ కారణాల వల్ల ఇంగ్లీష్‌ మీడియంలో చదివితే చెడిపోతా రని వాళ్లు ప్రచారంలో పెడుతున్నారు.

మాతృభాషలో విద్యాబోధన ఆవశ్యక తను గురించి సుద్దులు చెప్పడానికి కొందరు పెద్దల్ని రంగంలోకి దించుతారు. ఇప్పటికే దించారు కూడా! మాతృభాష లోనే పాఠాలు నేర్చుకుంటే జ్ఞానం పెరుగు తుందనీ, సులభంగా అర్థమవుతాయనీ చెబుతారు. అంతేగాకుండా అంతా ఆంగ్ల  మీడియంలో చదివితే తెలుగు సంస్కృతి దెబ్బతింటుందని వాపోతారు. అలాంటి వాళ్లు మీకు తగిలినప్పుడు రెండు ప్రశ్నలు వేయండి. ఒకటి – ఇప్పుడు ఇంగ్లీషులో చదవకపోతే పై చదువులకు వెళ్లినకొద్దీ ఇంగ్లీషులోనే చదవాల్సిన పాఠాలకు ఎలా అలవాటు పడతామని అడగాలి.

జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో ఎలా నెగ్గుతామని అడగాలి. మీరు పై చదువులు పెద్దగా చద వొద్దని కదా వారి ఉద్దేశం. అందుకని మీరా ప్రశ్న అడగ్గానే గతుక్కుమంటారు. ఇక రెండో అంశం – ‘అయ్యా! గత యాభయ్యేళ్లుగా మా అమ్మానాన్నలు, తాతముత్తాతలు తెలుగులోనే చదివి, తెలుగు భాషకు సేవలు చేసి అలసిపోయారు. ఇప్పుడు కొంతకాలం మేము ఇంగ్లీషులో చదువుకుంటాము. మీ పెత్తందార్లంతా ఇంతకాలం ఇంగ్లీషు చదువులు చదివారు కదా! ఇప్పుడు పిల్లల్ని మనవల్నీ తెలుగు మీడియంలో చదివించండి. వారు తెలుగు భాషను రక్షిస్తారు. మేం ఇంగ్లీష్‌ చదువుకొని అంతర్జాతీయ స్థాయికి ఎదుగుతామ’ని చెప్పండి. ఏమంటారో చూద్దాం.

రాష్ట్రంలో వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే విద్యారంగానికి అత్యధిక ప్రాధాన్యాన్నిస్తూ ‘నాడు – నేడు’ కార్యక్రమాన్ని ప్రారంభించిన సంగతి మీకు తెలుసు. ఈ కార్యక్రమం ఫలితంగా శిథిలా వస్థకు చేరిన సర్కారు బళ్లు మళ్లీ చిగురించాయి. ప్రైవేట్‌ స్కూళ్లను మించి సకల హంగులు సంతరించుకున్నాయి. మీకిస్తున్న బూట్లు, బ్యాగ్, బెల్ట్, యూనిఫామ్‌ అన్నీ బెస్ట్‌గా ఉండాలని స్వయంగా సీఎం హోదాలో ఉన్న మీ మేనమామ స్వయంగా సెలెక్ట్‌ చేసి పంపిస్తున్నారు.

‘గోరుముద్ద’ మెనూ కూడా ఆయనే తయారు చేశారు. కూలినాలి చేసుకునే పేద తల్లులు వారి బిడ్డల్ని స్కూళ్లకు పంపించేలా ప్రోత్సహించడం కోసం ‘అమ్మ ఒడి’ పేరుతో నగదు అందజేస్తున్న సంగతి కూడా మీకు తెలిసిందే. ఈ మొత్తం కార్యక్రమాల్లో భాగంగా మూడేళ్ల కిందనే ఒకటి నుంచి ఆరో తరగతి వరకు ఇంగ్లిష్‌ మీడియం బోధనను ప్రారంభించారు. ఏటా ఒక్కో తరగతిని పెంచుకుంటూ వచ్చారు. ఇప్పుడు తొమ్మిదో తరగతి వరకు అంతా ఇంగ్లీష్‌ మీడియమే.

ఇంగ్లీష్‌ మీడియాన్ని ప్రారంభించిన ఆదిలోనే పెత్తందారీ ప్రతిఘటన మొదలైంది. తెలుగు భాషోద్యమం పేరుతో ఓ నకిలీ ఉద్యమాన్ని ప్రారంభించడానికి యెల్లో మీడియాతో కలిసి చంద్రబాబు ప్లాన్‌ చేశారు. కానీ, క్షేత్రస్థాయి నుంచి వ్యతిరేకత వస్తుందన్న సమాచారంతో కాస్త వెనక్కు తగ్గారు. కొద్దిరోజుల విరామం తర్వాత మళ్లీ చంద్రబాబు మొదలుపెట్టారు. ఈసారి ప్రత్యక్షంగా పేద తల్లితండ్రుల మెదళ్లలోకి దూరాలని ప్రయత్నించారు. శ్రీకాకుళం నుంచి రోడ్డు మార్గం ద్వారా వస్తున్న చంద్రబాబుకు విశాఖ సమీపంలో ఓ పదిమంది కూలీలు రోడ్డు పక్కన కనిపించారు.

వెంటనే వాహనాన్ని ఆపేసి వాళ్ల మధ్యన కూర్చున్నారు. ఆ మాట ఈ మాట మాట్లాడిన తర్వాత ‘‘ఆయనేదో (జగన్‌) ఇంగ్లీష్‌ మీడియం అంటున్నాడు. ఏమొస్తది ఇంగ్లీష్‌ మీడియంతో! కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిపోద్ది. మన పిల్లలు మొద్దబ్బాయి లుగా తయారవుతారు...’’ అంటూ ఇంకేదో చెప్పబోయారు. అక్కడున్న జనమంతా అసహ నంతో ‘జై జగన్‌’ అని నినాదాలు చేయడంతో చల్లగా జారుకున్నారు.

పెత్తందార్ల కూటమికి ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నాయకుడు. ఆయన సమన్వయంలోనే యెల్లో మీడియా పనిచేస్తున్నది. ఈ మీడియా సమూహంలో అతి ముఖ్యుడు రామోజీరావు. ఆయన చంద్రబాబుకు గురుపాదుల వంటివారు. చంద్రబాబు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండు వేల ఎకరాల విశాల సామ్రాజ్యాన్ని అక్రమ పద్ధతుల్లో విస్తరించారు.

ఈ విస్తరణలో భాగంగా ఆయన చట్టాలను కూడా యథేచ్ఛగా ఉల్లంఘించారు. ఆయనకు ‘ఈనాడు’ అనే పత్రిక, ‘ఈటీవీ’ పేరుతో చానళ్లున్నాయి. తాను తెలుగు కోసమే పుట్టినట్టు, తెలుగు భాషా సంస్కృతుల పరిరక్షణ కోసమే గాలి పీల్చుకుంటున్నట్టు ఆయన డప్పు వేయించుకుంటారు. ఆయన స్థాపించిన ఫిలిం సిటీ చేరువలో కొండల మీద రమాదేవి పబ్లిక్‌ స్కూల్‌ పేరుతో ఒక పాఠశాలను స్థాపించారు. అది మాత్రం పక్కా ఇంగ్లీష్‌ మీడియం, సెంట్రల్‌ సిలబస్‌.

తెలుగు మీడియం పాఠశాల పెడితే భారీగా ఫీజులు కట్టి ఎవరు చదు వుకుంటారు? కనక తనకు కలెక్షన్‌ కోసం సంపన్నులు చదువుకునే ఇంగ్లీష్‌ మీడియం స్కూల్‌ ఉండాలి. పేద బిడ్డలు మాత్రం కనీస వసతులు లేని ప్రభుత్వ బడుల్లో తెలుగు మీడియం చదవాలి. ఇదీ వారి నీతిసారం.

ఉమ్మడి రాష్ట్రానికి చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఈ గురుపాదులవారు రాజ గురువుగా చక్రం తిప్పిన రోజుల్లోనే ప్రభుత్వరంగంలోని విద్యా వ్యవస్థ శిథిలమైపోయి వీథికో ప్రైవేట్‌ స్కూల్, ఊరికో కార్పొరేట్‌ కాలేజీ బ్రాంచీలు విస్తరించాయి. చదువు అంగడి సరుకుగా రూపాంతరం చెందింది. పేదలు డ్రాపౌట్లుగా మిగిలి పోయారు. ఫలితంగా రెండు తరాల పేదలు నాణ్యమైన చదువుకు నోచుకోక జీవన ప్రమా ణాలను కోల్పోవలసి వచ్చింది. ఈ మానవ కల్పిత మహా సంక్షోభం మీద పరిశోధన జరగవలసిన అవసరం ఉన్నది.

ఇంగ్లీష్‌ మీడియం విద్యకు వ్యతిరేకంగా బహిరంగంగా మాట్లాడేందుకు చంద్రబాబు, ఆయన ముఠా వెనుకడుగు వేసినా పరోక్ష ప్రయత్నాలను మాత్రం ఆపలేదు. తెలుగు భాషా సంస్కృతుల ముసుగులో వివిధ వేదికల ద్వారా ఇంగ్లీష్‌ మీడియంపై విషం చల్లుతూనే వస్తున్నారు. రాజ్యాంగబద్ధ పద వుల్లో పనిచేసిన పెద్దమనుషుల సేవలను కూడా ఇందుకోసం విరివిగా వినియోగించు కున్నారు. అయినా ఫలితం కలుగలేదు.

ప్రజల సంపూర్ణ మద్దతుతో ఇంగ్లీషు మీడియంతో పాటు ఆనక విద్యాసంస్కర ణలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. విద్యార్థులకు ట్యాబ్‌లు అందజేసిన తర్వాత, ఐఎఫ్‌పీ స్క్రీన్లను అందుబాటులోకి తెచ్చిన తర్వాత ఆ యా విద్యా ర్థుల నాణ్యతా ప్రమాణాలు పెరిగినట్టుగా అసెస్‌మెంట్‌ పరీక్షల్లో ఉపాధ్యా యులు గుర్తించారు. ఈ స్ఫూర్తితో దశలవారీగా ఐబీ సిలబస్‌ను కూడా అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం నిశ్చయించింది.

ఇక లాభం లేదనుకున్న పెత్తందారీ ముఠా ఎన్నికలకు ఇంకో ఆరు నెలల సమయం ఉండగా ఆఖరు కృష్ణుడిని రంగంలోకి దించింది. పవన్‌ కల్యాణ్‌:ది లాస్ట్‌ కృష్ణా తన సహచరుడు నాదెండ్ల మనోహర్‌తో కలిసి శుక్రవారం నాడు ఇంగ్లీష్‌ మీడియంపై, విద్యాసంస్కరణలపై విరుచుకుపడ్డారు. తాము అధికారంలోకి రాగానే ఈ విద్యావిధానంపై కేసులు పెట్టి దీంతో సంబంధం ఉన్న వారందరినీ జైలుకు పంపుతారట! తమ పిల్లల్ని  ఏ స్కూల్లో, ఏ మీడి యంలో, ఏ సిలబస్‌తో చదివించారో కూడా పవన్, మనోహర్‌లు ఈ సమావే శంలో చెబితే బాగుండేది. కానీ చెప్పలేదు. పవన్‌ హెచ్‌ఎమ్‌వి రికార్డులాంటోడు.

అందులో రికార్డయిందే చెప్పగలడు. కానీ, పేద విద్యార్థుల ప్రగతికి ఉద్దేశించిన ఇంగ్లీష్‌ మీడియంపై యుద్ధం ప్రకటించి తాను ఏ వర్గం తరఫున పనిచేస్తున్నాడో చాటి చెప్పుకున్నాడు. లంకలో పుట్టిన ప్రతివాడూ రాక్షసుడే అన్నట్టు ఇంగ్లీష్‌ మీడియాన్ని వ్యతిరేకించే ప్రతివాడూ పెత్తందార్ల తాబేదారే! నీవారెవరో పరవారెవరో గుర్తించడానికి ఇది మాత్రమే లిట్మస్‌ టెస్ట్‌ తల్లీ!

వర్ధెల్లి మురళి 
vardhelli1959@gmail.com

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top