మార్పు మేలు చేస్తుందా? | Sakshi Editorial On Election Commission of India | Sakshi
Sakshi News home page

మార్పు మేలు చేస్తుందా?

Sep 3 2024 5:12 AM | Updated on Sep 3 2024 5:12 AM

Sakshi Editorial On Election Commission of India

కొన్ని నిర్ణయాలంతే! అధికారపక్షం స్వాగతిస్తుంటుంది, ప్రతిపక్షాలు విమర్శిస్తుంటాయి. హర్యానా అసెంబ్లీ ఎన్నికల తేదీని అక్టోబర్‌ 1 నుంచి 5కు మారుస్తూ  భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) తీసుకున్న నిర్ణయం విషయంలోనూ అదే జరిగింది. సెలవుల వల్ల ఓటింగ్‌ తగ్గకూడదనే భావనతో సరైన నిర్ణయం తీసుకున్నారంటూ అధికారంలో ఉన్న బీజేపీ, ఉనికి కోసం పోరాడుతున్న ప్రతిపక్షం ‘ఇండియన్‌ నేషనల్‌ లోక్‌దళ్‌’ హర్షం వ్యక్తం చేశాయి. 

ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌ మాత్రం ఇదంతా ఓటమి భయంతో ప్రచారం గడువు పెంచుకొనేందుకు బీజేపీ ఆడిస్తున్న తేదీ మార్పు నాటకం అంటోంది. ఈ నెల 18 నుంచి అక్టోబర్‌ మొదటి వారంలోగా సాగే ఈ విడత అసెంబ్లీ ఎన్నికల్లో హర్యానాతో పాటు జమ్మూ కశ్మీర్‌లోనూ పోలింగ్‌ జరగనుంది. ఒక్కో రాష్ట్రం ఒక్కోలా దృష్టిని ఆకర్షిస్తున్నా, హర్యానాలో అధికార బీజేపీకి ఎదురుగాలి వీస్తున్న నేపథ్యంలో తేదీ మార్పు కథ ఆసక్తి రేపుతోంది. 

వ్యవసాయ రంగంలో సంక్షోభం, రైతుల నిరసనలు – డిమాండ్లపై ప్రభుత్వ వ్యవహారశైలి, పారిశ్రామికీకరణలో హర్యానా వెనుకబాటు, అంతకంతకూ పెరుగుతున్న నిరుద్యోగం, మహిళా రెజ్లర్ల ఆందోళన, వివాదాస్పద అగ్నిపథ్‌ పథకం లాంటి అనేక అంశాలు హర్యానాలో బీజేపీకి ఎదురుగాలి వీచేలా చేస్తున్నాయి. వర్గపోరుతో సతమతమవుతున్నప్పటికీ కాంగ్రెస్‌ కొంత ముందంజలో ఉందని కథనం. ఈ పరిస్థితుల్లో పోలింగ్‌ తేదీ మార్పు ప్రశ్నలు లేవనెత్తింది. 

అసోజ్‌ అమావాస్య పుణ్యతిథి ఉన్నందున ఓటింగ్‌ తేదీని మార్చాలని ఆలిండియా బిష్ణోయ్‌ మహాసభ అభ్యర్థనలు చేసిందనీ, వాటిని దృష్టిలో ఉంచుకొనే ఈ మార్పు చేపట్టామనీ ఎన్నికల సంఘం చెబుతోంది. కేంద్రంలోని అధికార బీజేపీ చెప్పినట్టు ఎన్నికల సంఘం నడుచుకుంటోందనీ, హర్యానాలో విజయంపై అనుమానాలు ఉన్నందున పోలింగ్‌కు మరింత గడువు కోసమే బీజేపీ ఈ తేదీ మార్పు చేయించిందనీ ప్రతిపక్షాల ఆరోపణ. సహజంగానే కౌంటింగ్‌ తేదీ మారింది. ఇప్పుడు హర్యానాతో పాటు జమ్మూ – కశ్మీర్‌ అసెంబ్లీ ఓట్ల లెక్కింపు అక్టోబర్‌ 4న కాక 8న జరగనుంది. 

నిజానికి, సాంస్కృతిక, ధార్మిక ఉత్సవాలకు అడ్డు రాకుండా పోలింగ్‌ తేదీలను మార్చడమనేది కొత్తేమీ కాదు. ఎన్నికల సంఘం గతంలోనూ ఆ పని చేసింది. గురు రవిదాస్‌ జయంతికి భక్తులు వారణాసికి వెళతారనే కారణంతో 2022లో పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల్ని వారం పాటు వాయిదా వేశారు. అదే ఏడాది మణిపుర్‌లో సైతం క్రైస్తవుల ఆదివారం ప్రార్థనల రీత్యా ఎన్నికల తేదీని మార్చారు. 

ఇక, నిరుడు 2023లో దేవుథని ఏకాదశి రోజున రాష్ట్రంలో సామూహిక వివాహాలు జరుగుతాయి గనక రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలను ఆ రోజు నుంచి మార్చారు. ఇటీవలే కాదు... పుష్కరకాలం క్రితం 2012లోనూ బారావఫాత్‌ (మిలాద్‌ ఉన్‌ నబీ) కారణంగా ఉత్తరప్రదేశ్‌ శాసనసభ ఎన్నికల తేదీని మార్చారన్నది గమనార్హం. తాజాగా హర్యానాలో తేదీ మార్పునకు మరో కారణమూ ఉందని అధికార వర్గాలంటున్నాయి. 

ముందుగా ప్రకటించిన పోలింగ్‌ తేదీ ప్రకారమైతే... సెప్టెంబర్‌ 30వ తేదీ ఒక్క రోజు గనక సెలవు పెడితే, ఆ రాష్ట్రంలో వరుసగా ఆరు రోజులు సెలవులు వచ్చే పరిస్థితి. దానివల్ల పలువురు సెలవు పెట్టి, ఓటింగ్‌కు దూరంగా ఊళ్ళకు వెళ్ళే ప్రమాదం ఉంది. కొత్త పోలింగ్‌ తేదీతో ఆ అలసత్వాన్ని తప్పించి, ఓటింగ్‌ శాతాన్ని పెంచవచ్చనేది అధికారుల కథనం. 

మరీ ఇన్ని తెలిసిన ఎన్నికల సంఘం ముందుగానే ఈ అంశాలన్నీ ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదన్నది ప్రశ్న. ఎన్నికల తేదీలను ఖరారు చేస్తున్నప్పుడే ఇలాంటివన్నీ దృష్టిలో పెట్టుకొని కసరత్తు చేయాల్సిన బాధ్యత దానికి ఉంది. హర్యానాలో ఆ పని ఎందుకు చేయలేకపోయిందో ఈసీ జవాబు చెప్పాలి. అసలు రాజ్యాంగబద్ధ సంస్థ అయినప్పటికీ ఎన్నికల సంఘాన్ని తమ చేతిలో సాధనంగా కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీలు వాడుకుంటున్నాయన్న విమర్శ చాలా కాలంగా ఉన్నదే. 

ఆ ఆరోపణలు అంతకంతకూ పెరుగుతుండడమే విషాదం. పైగా, ఈ ఏడాది ప్రథమార్ధంలో జరిగిన సార్వత్రిక ఎన్నికలు, కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్నికల సంఘం వ్యవహారశైలి పైన, ఈవీఎంల పని తీరు పైన తీవ్రమైన ఆరోపణలు రావడం తెలిసిందే. ఇప్పటికీ వాటికి సంతృప్తికరమైన సమాధానం ఇవ్వని ఈసీ ఇప్పుడిలా వ్యవహరించడం లేనిపోని అనుమానాల్ని మరింత పెంచుతోంది. వ్యవస్థలు పారదర్శకంగా లేవని తేటతెల్లమవుతున్న పరిస్థితి ఆందోళన రేపుతోంది.

ఇలాంటి పరిస్థితుల్లో నరం లేని నాలుకతో మాట్లాడే పార్టీల పాపం కూడా లేకపోలేదు. ప్రస్తుతం హర్యానా విషయంలో చెరొకవైపు నిలబడ్డ బీజేపీ, కాంగ్రెస్‌లు రెండూ... రెండేళ్ళ క్రితం ‘ఆమ్‌ ఆద్మీ పార్టీ’ (ఆప్‌) నుంచి గట్టిపోటీ ఉన్న పంజాబ్‌ ఎన్నికల వేళ మాత్రం ఒకే తాటి మీద నిలవడం విచిత్రం. అప్పట్లో గురు రవిదాస్‌ జయంతి గనక పోలింగ్‌ తేదీని మార్చాలంటూ రెండు పార్టీలూ కోరాయి. 

ఎన్నికల సంఘం ఆ కోరికను మన్నించింది. కానీ, పోలింగ్‌ను వాయిదా వేయించినంత మాత్రాన ఫలితం మారలేదు. ఆ పార్టీలకేమీ కలసి రాలేదు. ఆప్‌ ప్రభంజనంలో అవి కొట్టుకుపోయాయి. ఎన్నికల బరిలో పరిస్థితులు పోటాపోటీగా ఉన్న సందర్భంలో నాలుగు రోజులు అదనంగా ప్రచారానికి లభించడం కీలకమే. కానీ, ఎవరిని గద్దె దింపాలి, ఎవరిని పీఠమెక్కించాలన్న అంశంపై ప్రజలు ముందే ఓ స్పష్టమైన నిర్ణయానికి వచ్చి ఉంటారు. 

ఒకవేళ ఉద్దేశపూర్వకంగా పోలింగ్‌ తేదీని నాలుగైదు రోజులు అటో ఇటో మార్చినా ఫలితం ఉంటుందనుకోవడం పిచ్చి భ్రమ. అప్పుడు పంజాబ్‌కైనా, ఇప్పుడు హర్యానాకైనా అదే వర్తిస్తుంది. ఈ తర్కాన్ని మార్చిపోయి దింపుడు కళ్ళం ఆశతో ఉంటే ఉపయోగం లేదని గుర్తించాలి. కారణమేమైనప్పటికీ తేదీ మార్పు వల్ల ఓటింగ్‌ శాతమంటూ పెరిగితే ప్రజాస్వామ్యానికి మంచిదే. కానీ, అది ఏ పార్టీకి ఉపకరిస్తుందన్నదే బేతాళప్రశ్న.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement