‘సులభతర’ ర్యాంకులు! | Sakshi
Sakshi News home page

‘సులభతర’ ర్యాంకులు!

Published Tue, Mar 9 2021 12:55 AM

Sakshi Editorial On City Rankings

సమస్యల్లేకుండా, సజావుగా జీవనం సాగించడానికి అనువైన నగరాల/పట్టణాల జాబితాను ఏటా కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తుంటుంది. ఈసారి ఆ జాబితాలో బెంగళూరు ప్రథమ స్థానంలో వుండగా, శ్రీనగర్‌ అట్టడుగున వుంది. జాతీయ స్థాయి నేతలంతా కొలువుదీరే దేశ రాజధాని పదమూడో స్థానంతో సరిపెట్టుకుంది. హైదరాబాద్‌ నగరం 24వ స్థానంలో వుండగా, విశాఖపట్నం ర్యాంక్‌ 15.  పది లక్షలకు పైబడి జనాభా వున్న నగరాలు, పట్టణాలు... అంతకన్నా తక్కువ జనాభా గల నగరాలు, పట్టణాలు అనే వేర్వేరు కేటగిరీలుగా వీటిని విభజించారు. దేశంలో అత్యధిక జనాభా మూలాలు గ్రామసీమల్లోనే వుంటాయి. చదువులు, ఉపాధి అవకాశాలు, సదుపాయాలు, జీవన నాణ్యత వంటివి నగర జీవనంపై ఆకర్షణ పెంచుతున్నాయి. కానీ ఆ ఆకర్షణ పెరిగేకొద్దీ, అక్కడ జనం కేంద్రీకృతమవుతున్నకొద్దీ నగరాలపైనా, పట్టణాలపైనా ఒత్తిళ్లు పెరుగుతాయి. ప్రభుత్వాలు సకాలంలో సౌకర్యాలను విస్తరించకపోతే నగరాలు కిక్కిరిసి నరకాలుగా మారతాయి. అవకాశాలు కుంచించుకుపోయే కొద్దీ నేరాలు పెరుగుతాయి. సదుపాయాల లేమివల్ల వ్యాధులు ప్రబలుతాయి. పర్యవసానంగా అక్కడ బతకటం దుర్భరమవుతుంది. ఏయే నగరాల్లో, పట్టణాల్లో జీవన నాణ్యత ఎలావుందో, ఎక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చురుగ్గా అమలవుతూ ప్రజలకు సులభతరమైన జీవనం సాగించటానికి దోహదపడుతున్నాయో చూసి కేంద్రం ఈ ర్యాంకులిస్తోంది. మంచిదే. కానీ ప్రకటిస్తున్న జాబితాల ప్రకారమే ఆ నగరాల్లో ప్రమాణాలున్నాయా? అది ఖచ్చితంగా చెప్పలేని స్థితి. ఉదాహరణకు ఈసారి ప్రకటించిన ర్యాంకులు చూడగానే సామాజిక మాధ్యమాల్లో వ్యంగ్య బాణాలు విసిరినవారున్నారు. అగ్రభాగాన నిలిచేందుకు బెంగళూరుకున్న అర్హతల గురించి వారు ప్రశ్నించారు. జాబితా వివక్షాపూరితమైనదని ఆరోపించినవారున్నారు. తమ నగరం పరిస్థితేమిటని వెతికిన వారున్నారు.

 పట్టణీకరణ పెరగటం ప్రపంచవ్యాప్త ధోరణి. అది కేవలం మన దేశానికే పరిమితమైనది కాదు. అయితే నగరాల నిర్మాణంలో లేదా వాటి విస్తరణలో ప్రభుత్వాలు ఏమాత్రం ముందుచూపుతో వ్యవహరించటం లేదన్నది వాస్తవం. అమెరికన్‌ రచయిత అలెన్‌ లెకిన్‌ ప్రణాళికల గురించి ప్రస్తావిస్తూ ‘ప్రణాళిక అంటే వర్తమానాన్ని గమ్యరహితంగా చేయటం కాదు... భవిష్యత్తును వర్తమానంలోకి తీసుకురావటం’ అన్నారు. మన నగరాలు, పట్టణాలు సరిగ్గా ఇందుకు విరుద్ధమైన పోకడలకు పోతున్నాయని చెప్పాలి. నగర జీవనం రాను రాను కష్టమవుతోంది. అక్కడ ఖర్చు పెరగటం ఒక్కటే సమస్య కాదు. ఒకచోటు నుంచి మరో చోటికి పోవాలంటే పద్మవ్యూహంలాంటి ట్రాఫిక్‌ను అధిగమించటం పెద్ద తలనొప్పి అవుతోంది. మంచినీటి సదుపాయం, రోడ్లు, డ్రయి నేజ్‌లు వంటివి ప్రధాన సమస్యలు. సాధారణ ప్రజానీకం కూడా బతకలిగే ఆవాసం దొరకటమైనా, చదువులు అందుబాటులో వుండటమైనా, జీవన వ్యయం తగుమాత్రంగా వుండటమైనా మంచి నగరానికీ లేదా పట్టణానికీ కనీస ప్రాతిపదికలు. ఇప్పుడు విడుదల చేసిన జాబితాలో ఇలాంటి గీటురాళ్లు లేకపోలేదు. జీవన నాణ్యత, ఆర్థిక సామర్థ్యం, సుస్థిరత, విద్య తదితర అంశాల ఆధారంగా ఏ నగరం/ పట్టణం మెరుగ్గా వుందో లెక్కేశారు. అలాగే అభివృద్ధి కోణంలో ముందుకు దూసుకుపోతున్నవేవో, వెనకబడుతున్నవేవో తేల్చారు. సేవల బట్వాడా, ప్రణాళిక, పకడ్బందీ పరిపాలనవంటివి సైతం లెక్కకొచ్చాయి. అయితే జాబితా గుర్తించని అంశాలు, గుర్తించినా ఉదా రంగా ర్యాంకులిచ్చిన వైనం కూడా కనబడుతుంది. బెంగళూరు నగరం ప్రణాళికాబద్ధంగా లేదని, ఇష్టానుసారం భవంతుల నిర్మాణానికి అనుమతులివ్వటం రివాజైందని ఆ నగరవాసుల ఆరోపణ. చాలామంది ట్రాఫిక్‌ను ప్రధానంగా ప్రస్తావించారు. నిత్యం నీళ్ల ట్యాంకులు వస్తే తప్ప గడవని కాలనీలు వున్నాయని ఎత్తిచూపారు. ఇన్ని సమస్యలున్నా ఆ నగరం ఇంకా ఇంకా విస్తరిస్తూనే వుంది. అందుకు కారణం అక్కడ మెరుగైన ఉపాధి అవకాశాలుండటం. అక్కడి భూములపైనో, ఫ్లాట్లపైనో వెచ్చిస్తే స్వల్పకాలంలో మంచి లాభాలు రాబట్టవచ్చునని ఎగువ మధ్యతరగతి, సంపన్నవర్గాలవారు భావించటం. ఇంచుమించు ఇలాంటి భావనే హైదరాబాద్‌పైనా, మరికొన్ని ఇతర నగరాలపైనా కూడా వుంది. ఇది అభివృద్ధికి చిహ్నంగా భావించటంలో తప్పులేదుగానీ... ఇదొక్కటే అభివృద్ధి అనుకుంటే సమస్యలు తలెత్తుతాయి.

స్వాతంత్య్రానంతరం మన దేశంలో నిర్మించిన మెరుగైన, ప్రణాళికాబద్ధమైన నగరం చండీగఢ్‌. కానీ ఆ తర్వాత దాన్ని నమూనాగా తీసుకుని కొత్త నగరాలు నిర్మించటం, వున్నవాటికి తగిన వ్యూహాలు రూపొందించుకోవటం ఎక్కడా కనబడదు. జాబితాలో అగ్రభాగాన వున్న నగరాలు, పట్టణాల స్ఫూర్తితో ఇతరులు కూడా మెరుగైన విధానాలు రూపొందించుకోవటానికి ఈ ర్యాంకులు నిర్ణయిస్తారు. కానీ జరుగుతున్నది అదేనా? నగరాలు హరితవనాలుగా వుండాలని, కాంక్రీటు నిర్మాణాలు వాటిని మింగేయకూడదని, పౌరజీవనంపై ఒత్తిళ్లు లేనివిధంగా శివారు ప్రాంతాలకు సైతం అభివృద్ధి సమంగా విస్తరించాలని కోరుకుని అందుకు అనుగుణమైన ప్రణాళికలు అమలు చేస్తున్నవారెందరు? కేంద్రం ఏటా ప్రకటించే ర్యాంకులు ఆయా ప్రాంతాల్లోవుండే పౌరులకు సైతం సహేతుకమనిపించే విధంగా వుంటేనే... ఇతర నగరాలకు కూడా స్ఫూర్తిదాయకంగా మారితేనే ఆశిం చిన లక్ష్యం నెరవేరుతుంది. 

Advertisement

తప్పక చదవండి

Advertisement