మళ్లీ యుద్ధ మేఘాలు! | Sakshi Editorial On America, Israel, Iran War | Sakshi
Sakshi News home page

మళ్లీ యుద్ధ మేఘాలు!

Apr 15 2026 12:19 AM | Updated on Apr 15 2026 12:19 AM

Sakshi Editorial On America, Israel, Iran War

చరిత్రాత్మకం అన్నారు. ఉన్నతస్థాయి చర్చలన్నారు. దౌత్యం పూర్తి స్థాయిలో పనిచేస్తోందన్నారు. శాంతికి పశ్చిమాసియా చేరువలో ఉందన్నారు. పాకిస్తాన్‌ రాజధాని ఇస్లామా బాద్‌లో 21 గంటలపాటు కొనసాగిన అమెరికా–ఇరాన్‌ ప్రతినిధి బృందాల చర్చలపై ఎప్పటికప్పుడు మీడియాలో వచ్చిన సమాచారం సారాంశమిది. తీరా బయటికొచ్చిన అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ చర్చలు విఫలమయ్యాయని ప్రకటించి నిష్క్రమించారు. ఆ వెంటనే ఆ దేశాధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ బెదిరింపు భాష మొదలైంది. అమెరికా ఏకపక్ష వైఖరివల్ల 47 సంవత్సరాల తర్వాత ఆ రెండు దేశాలమధ్యా నేరుగా సాగిన చర్చలు చివరికిలా నీరుగారాయి. వచ్చేవారం మరోసారి చర్చలుంటాయని చెబుతున్నారు. కానీ అమెరికా వైఖరి మారకపోతే ప్రయోజనం శూన్యం. ట్రంప్‌ వచ్చాక చర్చల అర్థమే మారిపోయింది. చర్చలంటే ఆయన శాసిస్తే ఎదుటిపక్షం శిరోధార్యంగా స్వీకరించటం తప్ప మరేంకాదు. అసలు ఈ యుద్ధంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న వాన్స్‌ నాయకత్వాన ప్రతినిధి బృందాన్ని పంపటంలోనే ఆయన నిజాయితీలేమి వెల్లడైంది. ఏ అధికారమూ లేని, సొంతంగా ఎలాంటి చొరవా తీసుకోలేని ఆ అశక్త బృందం చివరకు ఉత్త డొల్లగా మిగిలిపోయింది. 

ట్రంప్‌ తీరు 90వ దశకం మొదట్లో సోవియెట్‌ యూనియన్‌ కుప్పకూలిననాటి పరి స్థితుల్ని తలపిస్తోంది. అంతవరకూ సోవియెట్‌ భాగస్వామ్య రాష్ట్రాలుగా ఉన్న ప్రాంతాల్లో ఎక్కడికక్కడ సమావేశాలు జరగటం, దేశంనుంచి విడిపోతున్నట్టు ప్రకటించటం రివాజై పోయింది. నిజంగా అలా ప్రకటించేవారి బలాబలాలేమిటో, ఆ తీర్మానాలు అమలయ్యే అవకాశం ఉందో లేదో తెలియని స్థితి. ఇలాంటి అనిశ్చితే ఇప్పుడు అమె రికాను ఆవరించింది. నరమేథాన్ని సాగిస్తూ ఘనవిజయాలుగా ప్రకటించుకోవటం, ఇరాన్‌ నాగరికత ఈ రాత్రితో అంతం కాబోతున్నదని ప్రకటించటం, అంతలోనే చర్చలకు రావాలంటూ బెదిరించటం ట్రంప్‌ అలవాటు చేసుకున్నారు. ఇజ్రాయెల్‌తోపాటు ఈ యుద్ధానికి లోపాయికారీగా మద్దతిచ్చిన దేశాలన్నీ ఇరాన్‌నుంచి శరపరంపరగా వచ్చి పడుతున్న క్షిపణుల ధాటికి బెంబేలెత్తినా, అక్కడ పెనువిధ్వంసం చోటుచేసుకుంటున్నా ట్రంప్‌ బడాయి మాటలు ఆగలేదు. ఆయన ప్రకటనలకు భిన్నమైన స్థితిగతులున్నాయని సైనికా ధికారులే మీడియాకు రహస్యంగా చెప్పటం అమెరికాలో కుప్పకూలుతున్న వ్యవస్థలకు ఆనవాలు. సోవియెట్‌ కనుమరుగయ్యే ముందు కూడా ఇలాంటి ధోరణులే కనబడ్డాయి. 

ఇతర దేశాల సహకారంతో హార్మూజ్‌ జలసంధిని దిగ్బంధిస్తామని ట్రంప్‌ చెప్పిన కొన్ని గంటలకే, అందుకు తాము అంగీకరించబోమని నాటో భాగస్వామ్య దేశాలు బ్రిటన్, ఫ్రాన్స్‌లు ప్రకటించి గాలి తీశాయి. ‘హార్మూజ్‌ దిగ్బంధం’ అంటూ చేసిన ప్రకటనకు అర్థం ఇరాన్‌ నౌకాశ్రయాల దిగ్బంధమని అమెరికా సైన్యం ఆ వెంటనే తెలిపింది. సోమవారం నుంచి అమల్లోకి వచ్చిందని కూడా ప్రకటించారు. కానీ గల్ఫ్‌ దేశాలే దీన్ని నిరసిస్తున్నాయి. ట్రంప్‌ చర్య ఈ ప్రాంతం మొత్తాన్ని శాశ్వతంగా యుద్ధ ఊబిలోకి దించేస్తుందని సౌదీ అరేబియాతోసహా చాలా దేశాలు ఆందోళనపడుతున్నాయి. సౌదీ చమురు ఎగుమతులు యుద్ధానికి ముందు మాదిరే రోజుకు 70 లక్షల బ్యారెళ్లకు చేరు కున్నాయి. అవి ఎర్ర సముద్రం గుండా వెళ్తున్నాయి. కానీ అమెరికా దుందుడుకు చర్యకు దిగితే యెమెన్‌లోని హౌతీలు ఆ ఎగుమతుల్ని దెబ్బతీస్తారు. 

తన నాయకత్వాన ఇన్ని దశాబ్దాలుగా సాగిన ఏకధ్రువ ప్రపంచం కళ్లముందు కుప్పకూలుతున్న వైనాన్ని అమెరికా గ్రహించకపోతే పోయిందిగానీ... చైనా నాయకత్వంలో కొత్త అమరిక మొగ్గతొడుగుతోందన్న సంగతైనా అది తెలుసుకోవాలి. ఈ యుద్ధం తనకూ, ఇరాన్‌కూ మధ్య పంచాయతీ కాదు. అది పశ్చిమాసియాకు పరిమిత మైంది అంతకన్నా కాదు. ప్రపంచంలో తన ఆధిపత్యాన్ని క్రమేపీ బలహీనపరుస్తున్న ఒక నిరర్థక యుద్ధం. అది చైనా నాయకత్వాన కొత్త కూటమికి పురుడు పోస్తున్న ప్రమాదకర యుద్ధం. ఆర్థికంగా, సైనికంగా ప్రపంచంలోనే తాము సర్వశక్తిమంతులమని ఇరాన్‌తో చర్చలకు చాన్నాళ్లముందు జేడీ వాన్స్‌ అన్నారు. ట్రంప్‌ ప్రభావం ఆయనపై ఎక్కువే ఉన్నట్టుంది. ఆ దృశ్యం మారుతున్న సంగతిని అమెరికా నాయకత్వం ఎంత త్వరగా గ్రహిస్తే అంత మంచిది.  

Advertisement
 
Advertisement
Advertisement