అప్రమత్తతే ఆయుధం!

Editoral About Omicron Variant Cases Incresing Day By Day International - Sakshi

ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న కరోనా కేసులు మరోసారి పారాహుషార్‌ అంటున్నాయి. అమెరికా, ఫ్రాన్స్, ఇటలీ, స్పెయిన్, అర్జెంటీనా అధిక శాతం కేసులతో అతలాకుతలమవుతున్నాయి. మునుపటి కరోనా వేరియంట్ల కన్నా అనేక రెట్ల వేగంతో వ్యాపిస్తున్న ఒమిక్రాన్‌ దెబ్బతో ప్రపంచ వ్యాప్తంగా కేసులు వారం క్రితమే 30 కోట్లు దాటేశాయి. అన్ని దేశాల్లో కలిపి సగటున రోజూ 20 లక్షల పైగా కొత్త కేసులొస్తున్నాయి. అమెరికాలో ఒకే రోజు ప్రపంచ రికార్డు స్థాయిలో 13.5 – 15 లక్షల దాకా కేసులు రావడం అక్కడి తీవ్రతకు దర్పణం.

నూరేళ్ళ క్రితం 1918లో వచ్చిన స్పానిష్‌ ఫ్లూతో 5 కోట్ల మంది ప్రాణాలు కోల్పోగా, కరోనా ఈ రెండేళ్ళలో 55 లక్షల పైచిలుకు మందిని పొట్టనబెట్టుకుంది. ఒక్క భారత్‌లోనే మరణాలు 5 లక్షలకు చేరువవుతున్నాయని గణాంకాలు. పరీక్షలు అంతంత మాత్రంగా చేస్తున్నా, తాజా మూడో వేవ్‌లో మనదేశంలోనూ ఒకే రోజున కేసుల నమోదు 2.5 లక్షలకు ఎగబాకడం గమనార్హం. గత మే తర్వాత ఈ స్థాయిలో కేసులు రావడం ఇదే తొలిసారి. అందుకే, రానున్న పండుగలు, ఉత్సవాల నేపథ్యంలో అప్రమత్తత అవసరమని ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ గురువారం సమీక్షా సమావేశం గుర్తు చేసింది. డెల్టాతో పోలిస్తే ఒమిక్రాన్‌ వల్ల మరణాలు ప్రపంచవ్యాప్తంగా తక్కువే అంటున్నా, భారీ సంఖ్యలో కేసులు వస్తుండడంతో అమెరికా సహా అన్నిచోట్లా ఆరోగ్య వ్యవస్థలపై ఒత్తిడి పడుతోంది. 

మన దేశం మొత్తం మీద డిసెంబర్‌ ఆఖరులో 1.1 శాతమే ఉన్న పాజిటివిటీ రేటు ఇప్పుడు 11 శాతం దాటేసింది. 300 జిల్లాల్లో వారం వారీ పాజిటివిటీ రేటు పైపైకి పాకేస్తోంది. పార్లమెంటు సిబ్బంది కావచ్చు, పోలీసులు కావచ్చు, ఉస్మానియా – గాంధీ లాంటి ఆస్పత్రుల్లో డాక్టర్లు కావచ్చు, ఐఐటీ హైదరాబాద్‌లో విద్యార్థులు కావచ్చు – ఒక్కసారిగా పదులు, వందల సంఖ్యలో కరోనా బారిన పడుతున్నట్టు వస్తున్న వార్తలు ఆందోళనకరం. టీకా రెండు డోసులు వేసుకున్నా సరే, జన సమూహాలతో కలసి తిరగడం, అశ్రద్ధ వహించడం కారణాలవుతున్నాయి. అందుకే, కేంద్రం తాజా పరిస్థితిపై దృష్టి పెట్టింది. ఆస్పత్రుల్లో 2 రోజులకు సరిపడా ఆక్సిజన్‌ నిల్వలు ఉంచుకోమంది. రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ గురువారం సమీక్షా సమావేశం జరపాల్సి వచ్చింది. 

ఇప్పటికైతే మన దగ్గర ఆస్పత్రి పాలవుతున్న రోగులు, మరణాలు, ఆక్సిజన్‌ అవసరం అన్నీ తక్కువగానే ఉండడం ఓ శుభవార్త. అది చూసి, చాలామంది తాజా వేరియంట్‌ను సాధారణ జలుబుగా భావించి, అశ్రద్ధ చేస్తున్నారు. అదో ఇబ్బంది. ఒమిక్రాన్‌ను మామూలు జలుబు లాగా భావిస్తే తిరకాసేనని నీతి ఆయోగ్‌ సభ్యుడు డాక్టర్‌ వీకే పాల్‌ హెచ్చరించాల్సి వచ్చింది. కాగా, దేశంలో విజృంభిస్తున్న ఈ కరోనా మూడో వేవ్‌ మరో 2 నుంచి 8 వారాల్లో గరిష్ఠ స్థాయికి చేరుతుందని నీతి ఆయోగ్‌ అంచనా. అందరూ అప్రమత్తం కావాల్సిన మాట అది. పరిస్థితులు ఇలా ఉన్నా సరే, పార్టీలు పాదయాత్రలనూ, ప్రభుత్వాలు ధార్మిక ఉత్సవాలనూ కొనసాగిస్తూ, ప్రజల ప్రాణాల కన్నా ఓటు బ్యాంకు రాజకీయాలకే ప్రాధాన్యం ఇస్తుంటే ఏమనాలి? 44 శాతం మేర కేసులు పెరిగిన కర్ణాటకలో కాంగ్రెస్‌ నేతలు వేలాది జనంతో చేపట్టిన పాదయాత్ర ఇందుకు ఓ మచ్చుతునక. చివరకు అధిష్ఠానం జోక్యంతో గురువారం ఆ యాత్రకు బ్రేకు పడింది. 

భారత్‌లో కరోనాకు టీకా మొదలుపెట్టి, మరో మూడు రోజుల్లో ఏడాది పూర్తవుతోంది. ఇప్పటి వరకు దేశంలోని అర్హులలో 92 శాతానికి ఒక డోస్‌ వేయగలగడం సంతోషకరమే. కానీ, ఇప్పటికీ రెండో డోసు పూర్తి కాని వారి సంఖ్య గణనీయం. 15 నుంచి 18 ఏళ్ళ వారికి ఈ నెల 3న మొదలుపెట్టాక, 3 కోట్ల మందికి టీకాలేయడం బాగానే ఉంది. నిర్ణయం కాస్తంత ఆలస్యమైతేనేం... వృద్ధులకూ, ఇతర వ్యాధిపీడితులకూ ‘ముందు జాగ్రత్త’ మూడో డోసూ వేస్తున్నాం. కానీ, అనేక లోటుపాట్లున్నాయి. దేశంలోని 13.7 కోట్ల మంది సీనియర్‌ సిటిజన్లకు టీకాలేయాలనుకుంటే, ఇప్పటికీ 1.2 కోట్ల మందికి కనీసం ఒక డోసైనా పడలేదు. 15 ఏళ్ల లోపు పిల్లలకు ఇంకా టీకాల్లేవు. దేశంలో ఉండవలసిన దాని కన్నా 10 లక్షల మంది తక్కువ డాక్టర్లున్నారు. ఇలాంటి చోట ఆరోగ్య వ్యవస్థ కుప్పకూలితే అంతే సంగతులు. కాబట్టి, ఆ పరిస్థితి రాకుండా చూసుకోవడమే తెలివైన పని. 

ఆఫ్రికా లాంటి దేశాల్లో 20 శాతం జనాభాకే టీకాలందితే, అల్పాదాయ దేశాల్లో నేటికీ 10 శాతం కన్నా తక్కువ మందికే ఒక డోసు టీకా పడిందన్నది గమనార్హం. డెల్టా, ఒమిక్రాన్‌ల వెంట కొత్తగా డెల్టాక్రాన్‌ పేరు ప్రపంచంలో వినపడుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో అన్ని జాగ్రత్తలూ తీసుకోక తప్పదు. ముందు జాగ్రత్త, కరోనా నిరోధంలో క్రియాశీలత, సమష్టి పోరాటం ముఖ్యమన్న మోదీ మాటలు మదిలో నిలుపుకోవాల్సినవే. కోవిడ్‌తో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ దాదాపు 3 లక్షల కోట్ల డాలర్లు (రూ. 223 లక్షల కోట్లు) నష్టపోతుందని లెక్కిస్తున్న వేళ మన ఆర్థిక వ్యవస్థ పూర్తి లాక్డౌన్‌ను భరించే పరిస్థితి లేదు గనక, స్థానికంగా మైక్రో కంటైన్మెంట్‌ జోన్లతో వ్యాప్తిని అరికట్టడం ముఖ్యం. 

ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రిసెర్చ్‌లు ఘడియకో మాట, పూటకో ప్రోటోకాల్‌ చెబుతున్న వేళ మన చేతిలోనే ఉన్న అస్త్రాలైన మాస్కులు ధరించడం, టీకా వేయించుకోవడంలో అలక్ష్యం అసలే వద్దు. ఎందుకంటే, మనం ఊహించని రీతిలో ప్రవర్తిస్తూ, విరుచుకు పడడమే జిత్తులమారి వైరస్‌ల లక్షణం. నూరేళ్ళ క్రితంతో పోలిస్తే నాలుగు రెట్లు ఎక్కువ జనాభాతో, ప్రపంచమే ఓ కుగ్రామమైన వేళ జాగ్రత్తగా ఉండాల్సింది మనమే! 

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top