కూటముల కాలం | China try to alliance with India | Sakshi
Sakshi News home page

కూటముల కాలం

Jul 29 2020 12:26 AM | Updated on Jul 29 2020 11:06 AM

China try to alliance with India - Sakshi

తన దూకుడుపై వివిధ దేశాల్లో నెలకొనివున్న అసంతృప్తి క్రమేపీ చిక్కబడుతోందని, ఇది చివరకు ఘర్షణగా రూపుదిద్దుకునే అవకాశం వున్నదని ఎట్టకేలకు చైనా గుర్తించినట్టుంది. అందుకే స్వరం సవరించుకుని మన దేశానికి సుద్దులు చెప్పేందుకు సిద్ధపడింది. ‘వ్యూహాత్మకంగా స్వతంత్రంగా వ్యవహరించాలన్న మీ విధానాన్ని మరిచిపోకండి’ అంటూ సోమవారం హితవు పలికింది. ఇద్దరం కలిసి ‘పెత్తందారీ పోకడల’ను వ్యతిరేకిద్దామని కోరింది. చైనా దృష్టిలో ఆ పోకడలకు పోతున్నదెవరో చెప్పనవసరం లేదు. ఒకప్పుడు అమెరికా, సోవియెట్‌ యూనియన్‌ల మధ్య వున్న ప్రచ్ఛన్నయుద్ధం లాంటి పరిస్థితులే ఇప్పుడు అమెరికా, చైనాల మధ్య వున్నాయి. ఆ రెండింటిమధ్యా ఉద్రిక్తతలు చూస్తుండగానే పెరుగుతున్నాయి. 

చైనాకు వ్యతిరేకంగా ‘ప్రజాస్వామిక కూటమి’ ఏర్పాటు చేద్దా మంటూ అమెరికా విదేశాంగ మంత్రి మైక్‌ పాంపియో తాజాగా భారత్‌తో సహా ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చారు. కనుకనే చైనా మన దేశానికి చరిత్ర గుర్తుచేస్తోంది.  వాస్తవాధీన రేఖ(ఎల్‌ఏసీ) వద్ద మనతో అనవసర ఘర్షణకు దిగి ఉద్రిక్తతలు పెంచిన చైనా ఇప్పుడిలా ‘పెత్తందారీ పోకడల’ గురించి మాట్లాడటం వింతగానే అనిపిస్తుంది. భారత్, చైనాలు రెండూ ఆసియా ఖండంలో రెండు శక్తిమం తమైన దేశాలు. ఈ దేశాలు సమష్టిగా వ్యవహరిస్తే వాణిజ్య, వ్యాపార రంగాల్లో ప్రపంచమే పాదాక్రాంతమవుతుంది. అలాంటి దేశాలు రెండూ ఘర్షణ పడటం మంచిది కాదు.

కానీ ఆ పరిస్థితి తెచ్చిందెవరు? ఎల్‌ఏసీ ఘర్షణలకు చాలా ముందే భారత్‌–పాక్‌ వివాదాల విషయంలో అదెప్పుడూ పాకిస్తాన్‌ పక్షమే వహించింది. ఆఖరికి 2008లో ముంబైపై జరిగిన ఉగ్రదాడికి సూత్రధారి, జైషే మొహమ్మద్‌ చీఫ్‌ మసూద్‌ అజర్‌ను ‘అంతర్జాతీయ ఉగ్రవాది’గా ఐక్యరాజ్యసమితి ప్రకటించడానికి ప్రయత్నించిన ప్రతిసారీ చైనా అడ్డుతగిలింది. భద్రతా మండలికి అనుబంధంగా వుండే ఆంక్షల కమిటీలో అది అభ్యంతరం చెప్పింది. 2008 నుంచి మన దేశం చేసిన ప్రయత్నాలకు అడ్డుపడుతూ వచ్చి చివరకు నిరుడు మే నెలలో చైనా దారికొచ్చింది. ఇదొక్క అంశంలో మాత్రమే కాదు... అన్ని సందర్భాల్లోనూ అది పాకిస్తాన్‌నే సమర్థిస్తూ వస్తోంది. 

మరోపక్క మనతో సుదీర్ఘకాలం నుంచి సత్సంబంధాలు సాగిస్తున్న మన ఇరుగు పొరుగు దేశాలను మనకు వ్యతిరేకంగా మార్చడానికి అది శాయశక్తులా కృషి చేస్తోంది. ఇన్నేళ్లుగా మనతో ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలు నెరపుతూ, అందు వల్ల భారీగా లాభపడుతూ కూడా పలు సందర్భాల్లో మన ప్రయోజనాలను దెబ్బతీస్తూ వచ్చిన చైనాకు ఇప్పుడు హఠాత్తుగా ‘పెత్తందారీ పోకడలు’ గుర్తుకురావడం ఆశ్చర్యం కలుగుతుంది.

భారత్‌–చైనాల మధ్య వచ్చిన వివాదంలో ఇప్పుడు చైనాకు వ్యతిరేకంగా మాట్లాడుతూ, ‘ప్రజాస్వామిక కూటమి’కి పిలుపునిస్తున్న అమెరికా వైఖరి గురించి కూడా మన దేశం ఆలో చించుకోక తప్పదు. 2017లో చైనాతో మనకు డోక్లాం వివాదం తలెత్తినప్పుడు ఇంత స్పష్టమైన వైఖరి తీసుకునేందుకు అమెరికా సిద్ధపడలేదు. గత అయిదు దశాబ్దాలుగా చైనాతో సాగించిన సంబంధాలు ఇప్పుడు దాదాపు బెడిసికొట్టిన సూచనలు కనబడుతున్నాయి గనుక అది ఎల్‌ఏసీ వివాదంలో మనల్ని గట్టిగా సమర్థించింది. చైనాకు వ్యతిరేకంగా తాను మాత్రమే చర్య తీసుకోవడం అసాధ్యమని, ‘భావ సారూప్యత’గల అందరినీ కలుపుకొని వెళ్లడం ఒక్కటే మార్గమని అమెరికా భావిస్తోంది. 

పైగా సోవియెట్‌ యూనియన్‌తో తలపడటానికి, చైనాతో ఘర్షణ పడటానికి మధ్య చాలా వ్యత్యాసం వుంది. సోవియెట్‌కు అప్పట్లో ఒక్క అమెరికాతో మాత్రమే కాదు... పాశ్చాత్య దేశా లన్నిటితో స్పర్థలుండేవి. ఇందుకు భిన్నంగా చైనా ఇప్పుడు దాదాపు అన్ని దేశాల్లోనూ అల్లుకుపోయింది. దానిపై ఆధారపడక తప్పని దేశమంటూ ఏదీ లేదు. ఈ పరిస్థితుల్లో అమెరికా చైనాతో వైరం తెచ్చుకోవడం, అందుకు తన చిరకాల మిత్ర దేశాలను కలుపుకోవడం సులభమేమీ కాదు. ఇన్నేళ్లూ అది చైనాతో ఆర్థిక, వాణిజ్య బంధాన్ని కొనసాగిస్తూనే, అందువల్ల తగినంతగా ప్రయోజనం పొందుతూనే దాని విస్తరణవాద పోకడలను విమర్శిస్తూ వస్తోంది. 

కానీ ఆ విస్తరణవాదాన్ని ఇక నిలువరించకతప్పదని, అందుకోసం అవసరమైతే దాంతో ఆర్థిక, వాణిజ్య బంధాలను కూడా వదులుకోవాలని అమెరికా ఇటీవల కాలంలో నిర్ణయించుకున్నట్టు కన బడుతోంది. అయితే అమెరికా మన విషయంలో ఇతరత్రా అనుసరిస్తున్న విధానాలను కూడా మనం పరిగణనలోకి తీసుకోవాల్సి వుంటుంది. ఇరాన్‌పై ఏకపక్షంగా ఆంక్షలు తీసుకొచ్చి, ఆ దేశంతో ఆర్థిక, వాణిజ్య సంబంధాలు కొనసాగించరాదంటూ అమెరికా హుకుం జారీ చేయడం వల్ల ఇతర దేశాల మాటేమోగానీ మనం బాగా నష్టపోయాం. ఆ దేశం నుంచి చవగ్గా లభించే ముడి చమురు దిగుమతిని గత నెల నుంచి పూర్తిగా నిలిపేయాల్సి వచ్చింది. అలాగని అమెరికా అదే రేటుకు మనకు చమురు ఇవ్వడం లేదు. ఇక అఫ్ఘానిస్తాన్‌ నుంచి సైనిక దళాలను ఉపసంహరించుకోవాలని అది తీసుకున్న నిర్ణయం కూడా మన ప్రయోజనాలను దెబ్బతీసేదే. పాకిస్తాన్‌తో సత్సంబంధాలున్న తాలిబన్‌లతో అమెరికా చర్చలు జరిపి, దాని ఆధ్వర్యంలో అక్కడ ప్రభుత్వం ఏర్పడేందుకు సాయపడుతోంది.

ఎల్‌ఏసీ వివాదంలో మన ప్రయోజనాలను పరిరక్షించుకుంటూనే, అక్కడ మన భూభాగం నుంచి చైనా సైనికులు వైదొలగేందుకు ఒత్తిడి తెస్తూనే అంతర్జాతీయ కూటములు వగైరాల విషయంలో మన దేశం ఆచితూచి వ్యవహరించాలి. ట్రంప్‌ అనుసరిస్తున్న విదేశాంగ విధానంలో భారత్‌ పాత్ర కీలకమైనదని పాంపియో చెబుతున్నారు. మన భద్రతకు పూచీ పడతామంటున్నారు. అది స్వాగతించదగ్గదే. అయితే ఒక్క చైనా విషయంలో మాత్రమే కాదు... పాకిస్తాన్, అఫ్ఘానిస్తాన్‌ వగైరా అంశాల్లో కూడా అమెరికా ఆ దృష్టితో మెలగినప్పుడే మన ప్రయోజనాల పరిరక్షణ సాధ్యమవుతుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement