ఈడీ చెరలో కేజ్రీవాల్‌!

Arvind Kejriwal arrested under Delhi liquor policy - Sakshi

పీఠం ఎక్కింది మొదలు కేంద్రం కంట్లో నలుసులా మారిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ కటకటాల వెనక్కి వెళ్లక తప్పింది కాదు. గురువారం రోజంతా జరిగిన డ్రామాకు పతాకస్థాయిగా రాత్రి 9.45 గంటల ప్రాంతంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అధికారులు ఆయనను అదుపు లోకి తీసుకున్నారు. దర్యాప్తునకు హాజరు కావాలంటూ తొమ్మిది దఫాలు ఈడీ పంపిన సమన్లను ఆయన బేఖాతరు చేస్తూ రాగా, పదోసారి నేరుగా ఈడీ అధికారులే కేజ్రీవాల్‌ అధికార నివాసంలో సోదాలు నిర్వహించి అరెస్టు చేస్తున్నట్టు ప్రకటించటంతో దాదాపు రెండేళ్లుగా సాగుతున్న ఈ వ్యవ హారం కీలకమలుపు తిరిగింది.

మొన్న జనవరి 31న జార్ఖండ్‌ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌ను భూకుంభకోణంలో ఈడీ అరెస్టు చేయగా, ఆ వరసలో అరెస్టయిన రెండో ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌. అవినీతికి వ్యతిరేకంగా పుష్కరకాలం క్రితం అన్నా హజారే నాయకత్వాన ఢిల్లీలో రగిలిన నిరసనో ద్యమంలో కీలకపాత్ర పోషించిన నాయకుడు చివరకు అలాంటి ఆరోపణల్లోనే చిక్కుకుని అరెస్టు కావటం ఒక వైచిత్రి.

అప్పటి యూపీఏ ప్రభుత్వం 2జీ స్ప్రెక్ట్రమ్‌ కేటాయింపుల్లో రూ. 1.76 లక్షల కోట్ల అవినీతికి పాల్పడిందని అవినీతి వ్యతిరేక ఉద్యమ నాయకులు ఆరోపించారు. ఆ కేసులో సీబీఐ సరైన సాక్ష్యాధారాలు చూపలేకపోయిందని ప్రత్యేక కోర్టు అభిప్రాయపడి 2017లో నిందితులందరినీ నిర్దోషులుగా ప్రకటించింది. ఆ తీర్పుపై 2018 మార్చిలో సీబీఐ దాఖలు చేసిన అప్పీల్‌ను ఆరేళ్ల తర్వాత శుక్రవారం ఢిల్లీ హైకోర్టు విచారణకు స్వీకరించింది. 

ఐఆర్‌ఎస్‌ కొలువుకు రాజీనామా చేసి ఉద్యమంలోకొచ్చిన కేజ్రీవాల్‌ను ఆదినుంచీ  వివాదాలు చుట్టుముడుతూనే వున్నాయి. అవినీతి వ్యతిరేకోద్యమం చల్లారి దాన్లోని ప్రముఖులంతా తెరమరు గవుతున్న రోజుల్లో కేజ్రీవాల్‌ ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) స్థాపించటం ఆయన సహచరులకు మింగుడు పడలేదు. ఉద్యమాన్ని స్వలాభానికి వాడుకుంటున్నాడంటూ అనేకులు విరుచుకుపడ్డారు. తొలుత ఆయనతో చేతులు కలిపిన కేంద్ర మాజీ న్యాయ మంత్రి శాంతి భూషణ్, ఆయన కుమారుడు, సుప్రీంకోర్టు న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌ తదితరులు కొద్దికాలంలోనే కేజ్రీవాల్‌పై ఆరోపణలు చేస్తూ వైదొలిగారు. అధికారంలోకొచ్చాక ఆయనపై దాదాపు డజనుసార్లు దుండగులు దాడిచేశారు.

ఇంకుతో, కోడిగుడ్లతో, కర్రలతో, రాడ్లతో ఈ దాడులు జరిగాయి. ఒకసారైతే దుండగుడు పాదాభి వందనం చేస్తున్నట్టు నటించి ముఖంపై కారం జల్లాడు. అవినీతి వ్యతిరేకోద్యమంలో కీలక పాత్ర పోషించిన అనేకమంది మాదిరే కేజ్రీవాల్‌ కూడా సంఘ్‌ పరివార్‌ సంస్థలతో సన్నిహితంగా మెలిగిన వారే. అందుకే ఆప్‌ స్థాపన వారికి నచ్చలేదంటారు. 2013లో స్వల్ప ఆధిక్యతతో తొలిసారి అధికారం చేపట్టినప్పుడు నాటి యూపీఏ సర్కారుతో పేచీ తప్పలేదు. ఆ తర్వాత ఎన్‌డీఏ అధికారంలోకొ చ్చినా ఏదో ఒక అంశంపై ఘర్షణ కొనసాగుతూనేవుంది. లెఫ్టినెంట్‌ గవర్నర్లుగా వచ్చినవారు ప్రభుత్వ నిర్ణయాలకు అడ్డుపుల్లలేయటం, కొన్నిసార్లు న్యాయస్థానాల జోక్యంతో ఆయన విజయం సాధించటం రివాజైంది.

నిజానికి కేజ్రీవాల్‌ కార్యక్షేత్రం చిన్నది. ఆయన ప్రభావం ఢిల్లీకి పరిమితం. పంజాబ్‌లో సైతం ఆప్‌ ప్రభుత్వాన్ని స్థాపించగలిగినా అది నిలకడగా వుండగలదా అన్నది ప్రశ్నార్థకం. మతం, కశ్మీర్‌ తదితర అంశాల్లో కేజ్రీవాల్‌ వైఖరి బీజేపీకి భిన్నమేమీ కాదు. అందువల్ల ఆయనపై అస్త్రాలు సంధించి బలహీనపరచటం బీజేపీకి సాధ్యంకావటం లేదు. చిత్రమేమంటే అటు కాంగ్రెస్‌ సైతం ఆయన బలపడితే తమకే  ముప్పని భావించి కేజ్రీవాల్‌ను తగినంత దూరంలోవుంచింది. దేశవ్యాప్తంగా వేరే పార్టీలు పెద్ద బలంగా లేవు. ఏతావాతా తమ నేతల అరెస్టుపై ఆప్‌ది ఒంటరి పోరాటమే కావొచ్చు.  

ఇంతకూ కేజ్రీవాల్‌ అవినీతికి పాల్పడ్డారన్నది వాస్తవమేనా? అది ఎన్ని దశాబ్దాలకు తేలుతుందో ఎవరూ చెప్పలేరు. ఆయన సర్కారు ఢిల్లీ మద్యం విధానంలో మార్పులు చేయటం ద్వారా కొన్ని వర్గాలకు లాభం చేకూర్చి వందకోట్ల రూపాయల మేర ముడుపులు తీసుకుందన్నది ఈడీ ఆరోపణ. ఈ కేసులో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియా, ఆ పార్టీ ఎంపీ సంజయ్‌ సింగ్‌ ఏడాదిన్నరగా జైల్లో వున్నారు. బీఆర్‌ఎస్‌ నాయకురాలు, ఎమ్మెల్సీ కవితను ఇటీవలే అరెస్టు చేశారు. కొందరు అప్రూవర్లుగా మారారు. కేసులోని నిజానిజాలేమిటన్న సంగతలావుంచి సీబీఐ, ఈడీ వ్యవహార శైలిపై యూపీఏ సర్కారుకాలం నుంచీ అనుమానాలున్నాయి.

ఆ సంస్థల నిర్వాకాన్ని అడపా దడపా న్యాయస్థానాలు ప్రశ్నిస్తున్న ఉదంతాలు లేకపోలేదు. అయినా వాటి తీరుతెన్నులు మారిన దాఖలా లేదు. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జరిగిన ఈ అరెస్టుల వెనక రాజకీయప్రమేయం, ప్రయోజనం లేవని ఎవరూ అనుకోలేరు. నిజానికి సుప్రీంకోర్టు పుణ్యమా అని బయట పడిన ఎలక్టోరల్‌ బాండ్ల ఆనుపానులు, కార్యకారణ ప్రమేయాలు గమనిస్తే ఈ మద్యం కుంభకోణం పిపీలిక ప్రాయం అనిపిస్తుంది. అవినీతి కేసుల విషయంలో ఈమధ్య పార్టీల పరస్పర ఆరోపణలు వింతగా వుంటున్నాయి.

కవితను అరెస్టు చేయకపోవటంవల్లే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడామని బీజేపీ నేతలు ఖేదపడగా... బీజేపీ, బీఆర్‌ఎస్‌లు కుమ్మక్కు కావటంవల్లే ఆమె అరెస్టు జరగలేదని అప్పట్లో కాంగ్రెస్‌ నేతలు ఆరోపించారు. అదే కాంగ్రెస్‌ ఇప్పుడు ఆప్‌ తమ కూటమిలో వుంది గనుక కేజ్రీవాల్‌ అరెస్టును తప్పుబడుతున్నది. ఈ అష్టావక్ర రాజకీయాలవల్ల బీజేపీ ఎడాపెడా లాభపడుతోంది. ఏదేమైనా అగ్రనాయకత్వం అరెస్టుతో సైన్యాధిపతిలేని సేనలా తయరైన ఆప్‌ ఈ సార్వత్రిక ఎన్ని కలనూ, వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికలనూ ఎలా ఎదుర్కొంటుందో చూడాలి.  

Election 2024

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top