కంబాలచెరువు(రాజమహేంద్రవరం): రానున్న గోదావరి పుష్కరాల్లో భక్తుల భద్రతకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్ కుమార్ తెలిపారు. ఆయన బుధవారం ఎస్పీ డి.నరసింహ కిశోర్‌తో కలిసి జిల్లాలోని ప్రధాన గోదావరి ఘాట్లను పరిశీలించారు. కోటిలింగాల రేవు, పుష్కర ఘాట్, గౌతమి ఘాట్, కొవ్వూరులోని గోష్పాద క్షేత్రం, దండగండ రేవులను క్షేత్రస్థాయిలో పరిశీలించి పలు సూచనలు చేశారు. అనంతరం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ ప్రతి ఘాట్ వద్ద భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయనున్నామన్నారు. ప్రవేశ, నిష్క్రమణ మార్గాలు, బ్యారికేడింగ్, వాహనాల పార్కింగ్, బస్ బేలు, ట్రాఫిక్ నిర్వహణ, సీసీ కెమెరాల ఏర్పాటు, డ్రోన్ నిఘా, వాచ్ టవర్లు, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్, కంట్రోల్ పాయింట్లు, అత్యవసర స్పందన బృందాల ఏర్పాటు వంటి అంశాలపై అధికారులకు సూచనలు చేశారు.


