కంబాలచెరువు (రాజమహేంద్రవరం): సెంట్రల్ జైలులో ఖైదీల మధ్య జరిగిన ఘర్షణ తీవ్ర కలకలం రేపింది. అత్యంత కట్టుదిట్టమైన భద్రతలో ఉండే కేంద్ర కారాగారంలోనే ఖైదీలు ఒకరిపై ఒకరు దాడులకు దిగడం పలు అనుమానాలకు తావిస్తోంది. జైలులో శిక్ష అనుభవిస్తున్న ఉత్తర ప్రదేశ్‌కు చెందిన ఖైదీలు యోగేంద్ర సింగ్, సాహుల మధ్య బుధవారం ఘర్షణ జరగడం.. వీరిలో సాహు తీవ్ర గాయాల పాలై ఆసుపత్రి పాలవడం విదితమే. ఓ కేసులో శిక్ష అనుభవిస్తున్న ఈ ఇద్దరు ఖైదీల మధ్య కొన్నాళ్లుగా అంతర్గత విభేదాలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఆ విభేదాలు తీవ్ర రూపం దాల్చడంతో ఒక్కసారిగా పరస్పర దాడులకు దిగినట్లు సమాచారం. సిబ్బంది అప్రమత్తమై పరిస్థితిని అదుపులోకి తీసుకుని వచ్చినా.. ఈ సంఘటన జైలులో భద్రతపై అనేక ప్రశ్నలు లేవనెత్తుతోంది. ముఖ్యంగా జైలులో ఉన్నప్పుడే ఖైదీల ప్రవర్తన అదుపు తప్పితే.. ఇక వారు విడుదలయ్యాక పరిస్థితి ఏవిధంగా ఉంటుందనే అనుమానాలు తలెత్తుతున్నాయి.
అనుమానాలెన్నో...
సిబ్బంది పర్యవేక్షణలో అదుపులో ఉండాల్సిన ఖైదీలు ఇలా ఘర్షణకు దిగడం వెనుక జైలు అంతర్గత వ్యవస్థ వైఫల్యం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలోని పలు జైళ్లలో ఖైదీల వద్ద మొబైల్ ఫోన్లు, గంజాయి, ఇతర మత్తు పదార్థాలు బయటపడిన ఘటనలు చోటు చేసుకున్నాయి. రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో కూడా కొందరు ఖైదీలు అక్రమ మార్గాల్లో ఫోన్లు, మత్తు పదార్థాలు వినియోగించిన సందర్భాలు గతంలో ఉన్నాయి. సిబ్బంది చేతులు తడిపితే జైలులో ఏదైనా సాధ్యమేననే ఆరోపణలున్నాయి. అటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న సిబ్బందిపై ఇప్పటి వరకూ ఎటువంటి చర్యలూ తీసుకోలేదని తెలుస్తోంది. మరోవైపు ఖైదీల సంస్కరణకు కేంద్రాలుగా ఉండాల్సిన జైళ్లు, వర్గ పోరాటాలకు వేదికలుగా మారుతున్నాయా అనే చర్చ కూడా జరుగుతోంది. ఖైదీల ఘర్షణకు కారణాలేమిటి.. ఎవరి నిర్లక్ష్యం వల్ల వారు కొట్టుకునే స్థాయికి వెళ్లారు.. ఖైదీల మధ్య పరస్పర సంబంధాలు.. పాత కక్షలు, ఆధిపత్య పోరు, బయట ఉన్న అనుచరులతో సంబంధాలు కొనసాగుతున్నాయా తదితర అన్ని అంశాలపై లోతైన విచారణ చేపట్టి, జైలులో శాంతియుత వాతావరణం నెలకొల్పాల్సిన అవసరాన్ని ఈ సంఘటన చెప్పకనే చెబుతోంది. తాజా ఘటన తర్వాత జైలు అధికారుల తనిఖీలు మరింత కఠినతరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ప్రభుత్వ నిర్లక్ష్యం
రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో 1,200 మంది ఖైదీలకు మాత్రమే అవకాశం ఉంది. కానీ, ఇక్కడ 1,300 మంది ఖైదీలున్నారు. వీరందరినీ పర్యవేక్షించేందుకు కేవలం 120 మంది సిబ్బందే ఉన్నారు. వాస్తవానికి జైలులో అన్ని క్యాడర్లూ కలిపి 212 మంది సిబ్బంది ఉండాలి. కానీ, 92 పోస్టులు ఖాళీగా ఉన్నా వాటిని భర్తీ చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతోంది. సిబ్బంది కొరత కారణంగా ఖైదీల కదలికలపై పూర్తి స్థాయిలో నిఘా సాధ్యం కావడం లేదని తెలుస్తోంది. జైలులోని సిబ్బంది మూడు షిఫ్టుల్లో విధులు నిర్వహించాలి. ఉన్న సిబ్బందే అరకొర కావడంతో ప్రతి షిఫ్టులో అందుబాటులో ఉండాల్సిన వారి సంఖ్య చాలడం లేదని సమాచారం. ఇప్పటికే ఉన్న సిబ్బంది తీవ్ర ఒత్తిళ్ల నడుమ పని చేస్తూండగా, ఖైదీల సంఖ్య పెరగడం వారిపై మరింత భారాన్ని పెంచుతోంది. హత్య కేసుల నిందితులు, రౌడీషీటర్లు, హైరిస్క్ ఖైదీలపై జైలు సిబ్బంది ప్రత్యేక నిఘా ఉంచాలి. కానీ, సిబ్బంది కొరతతో పూర్తి స్థాయి నిఘా పెద్ద సమస్యగా మారిందని తెలుస్తోంది.
ఫిర్యాదు చేశాం
సెంట్రల్ జైలులో ఇద్దరు ఖైదీలు కొట్లాడుకున్న సంఘటనపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాం. దీనిపై దర్యాప్తు జరుగుతోంది. సెంట్రల్ జైలులో సిబ్బంది కొరత ఉంది. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం. జైలులో శాంతిభద్రతలు చాలా బాగున్నాయి.
– ఎస్.రాహుల్, సెంట్రల్ జైలు
సూపరింటెండెంట్, రాజమహేంద్రవరం
ఖైదీల కొట్లాటతో కలకలం
సెంట్రల్ జైలులో భద్రతపై కలవరం
మొత్తం ఖైదీలు 1,300
ఉండాల్సిన సిబ్బంది 212
ఉన్నవారు 120 మంది
అరకొర సిబ్బందితో ఇబ్బందులు


