రాజమహేంద్రవరం టు అరకు వ్యాలీ | - | Sakshi
Sakshi News home page

రాజమహేంద్రవరం టు అరకు వ్యాలీ

May 25 2026 3:28 AM | Updated on May 25 2026 3:28 AM

సూపర్‌ లగ్జరీ బస్సు సర్వీసు ప్రారంభం

రాజమహేంద్రవరం సిటీ: ప్రయాణికుల సౌకర్యార్థం రాజమహేంద్రవరం నుంచి అరకువ్యాలీకి సూపర్‌ లగ్జరీ బస్సు సర్వీసును ప్రారంభించినట్లు ఏపీఎస్‌ ఆర్టీసీ రాజమహేంద్రవరం డిపో మేనేజర్‌ కె.మాధవ్‌ తెలిపారు. ఈ సర్వీసును ఆదివారం ప్రారంభించారు. ఈ బస్సు ప్రతి రోజూ ఉదయం 5 గంటలకు రాజమహేంద్రవరంలో బయలుదేరి గోకవరం, రంపచోడవరం, అడ్డతీగల, రాజవొమ్మంగి, కేడీ పేట, చింతపల్లి, జి.మాడుగుల, పాడేరు మీదుగా మధ్యాహ్నం 12 గంటలకు అరకువ్యాలీ చేరుకుంటుందని వివరించారు. తిరిగి మధ్యాహ్నం 2 గంటలకు అరకువ్యాలీలో బయలుదేరి, అదే మార్గంలో రాత్రి 9 గంటలకు రాజమహేంద్రవరం చేరుకుంటుందని తెలిపారు. ఈ సర్వీసుకు ముందస్తు రిజర్వేషన్‌ సౌకర్యం కల్పించామన్నారు. టికెట్టు ధర రూ.580గా నిర్ణయించామని చెప్పారు.

20.75 లక్షల కిలోల

పొగాకు విక్రయాలు

దేవరపల్లి: టొబాకో బోర్డు రాజమహేంద్రవరం రీజియన్‌ పరిధిలోని ఐదు వేలం కేంద్రాల్లో శనివారం నాటికి 20,75,720 కిలోల పొగాకు విక్రయాలు జరిగినట్టు రీజినల్‌ మేనేజర్‌ జె.సురేంద్ర కుమార్‌ తెలిపారు. దీని విలువ రూ.53.96 కోట్లని చెప్పారు. పొగాకు కొనుగోళ్లు ప్రారంభించి రెండు నెలలైందని, మార్కెట్లో సరైన ధర పలకకపోవడంతో రైతులు వేలానికి బేళ్లు తీసుకు రావడం లేదని అన్నారు. రోజుకు ఐదు వేలం కేంద్రాల్లో దాదాపు 5 వేల బేళ్లు వేలానికి రావాల్సి ఉండగా, 400 నుంచి 500 మాత్రమే వస్తున్నాయని, వీటిలో సగం బేళ్లను కొనుగోలుదారులు తిరస్కరిస్తున్నారని ఆయన తెలిపారు. దేవరపల్లి వేలం కేంద్రానికి శుక్రవారం కేవలం 7 బేళ్లు మా త్రమే వేలానికి రాగా, కిలో గరిష్ట ధర రూ.236 పలికిందన్నారు. ఐదు వేలం కేంద్రాల్లో 493 బేళ్లు వేలానికి రాగా, 223 తిరస్కరించగా, 270 కొనుగోలు చేశారని పేర్కొన్నారు. కిలోకు గరిష్టంగా రూ.265, కనిష్టంగా రూ.210, సగటున రూ.260.72 చొప్పున ధర పలికిందని తెలిపారు. దేవరపల్లి వేలం కేంద్రంలో 2,96,035 కిలోలు, జంగారెడ్డిగూడెం–1లో 5,63,013 కిలోలు, జంగారెడ్డిగూడెం–2లో 4,31,649 కిలోలు, కొయ్యలగూడెంలో 3,54,660 కిలోలు, గోపాలపురంలో 4,30,362 కిలోల మేర విక్రయాలు జరిగాయని సురేంద్ర కుమార్‌ తెలిపారు.

తప్పిన ప్రమాదం

దేవీపట్నం: పాపికొండలు పర్యాటకులకు పెను ప్రమాదం తప్పింది. దేవీపట్నం మండలం గండిపోశమ్మ ఆలయం వద్ద పర్యాటక అభివృద్ధి సంస్థ బోటు ముందు భాగంలో పగులు ఏర్పడటంతో నీరు లోపలకు చేరింది. 40 మంది సామర్థ్యం ఉన్న ఈ బోటు పర్యాటకులతో తిరుగుతుంటుంది. ఈ బోటులో వెళ్లేందుకు 38 మంది ఆన్‌లైన్‌లో టిక్కెట్లు బుక్‌ చేసుకున్నారు. వారంతా ఆదివారం ఉదయం గండిపోశమ్మ ఆలయం వద్ద బోట్‌ పాయింట్‌ వద్దకు చేరుకున్నారు. అయితే బోటులోకి నీరు చేరడాన్ని సిబ్బంది గుర్తించి ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో, వారు వేరే బోటులో పర్యాటకులను పంపించారు.

Advertisement
 
Advertisement
Advertisement