తాళ్లపూడి (కొవ్వూరు): డీజిల్ సక్రమంగా అందక రాష్ట్రంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడు తున్నారు. ఈ సమయంలో కూటమి నాయకుల ర్యాంపులో అక్రమంగా డీజిల్‌ను తరలిస్తున్న లారీని అధికారులు సీజ్ చేశారు. వివరాల్లోకి వెళితే.. కొవ్వూరు మండలం కుమారదేవం ఇసుక ర్యాంపులో మంగళవారం ఓ లారీ నుంచి ట్రాక్టర్‌లోని డ్రమ్ముల్లోని డీజిల్‌ను అక్రమంగా నింపుతున్నారు. విషయం తెలుసుకున్న తహసీల్దార్ దుర్గాప్రసాద్, సివిల్ సప్లయ్ డీటీ అక్కడకు చేరుకున్నారు. డీజిల్‌ను అక్రమంగా కలిగి ఉన్న లారీని, డ్రమ్ములు ఉన్న ట్రాక్టర్‌ను సీజ్ చేశారు. ఆ లారీ బిల్లులు చూడగా, తెలంగాణలోని నల్గొండ జిల్లా చిట్యాల నుంచి సామర్లకోటకు వెళుతున్న ఇండస్ట్రియల్ సాల్వెంట్‌గా ఉంది. అధికారులు పట్టుకున్న తర్వాత కుమారదేవం ఇసుక ర్యాంపునకు బిల్లు పుట్టించడం జరిగింది. బిల్లుపై తేదీ, టైము కూడా.. పట్టుకున్న తర్వాత ఉండటాన్ని చూసి అధికారులు విస్తుబోయారు. లారీలోని సుమారు 29 వేల లీటర్ల డీజిల్‌ను పట్టుకొని, శాంపిల్స్‌ను పరీక్ష కోసం పంపినట్టు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
చెరువులో చేపల మృతి
కొత్తపల్లి: వాకతిప్ప శివారు నాగులాపల్లి ఏరియా, పరిసర గ్రామాల రక్షిత తాగునీటి పథకం చెరువు (సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు)లో చేపలు మంగళవారం మృతి చెందాయి. పెరుతుగున్న ఉష్ణోగ్రతల కారణంగా చేపలు మృతి చెంది ఒడ్డుకు చేరాయి. దీనివల్ల నీరు కలుషితమయ్యే ప్రమాదం ఉందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వారం రోజులుగా చేపలు మృతి చెంది, ఒడ్డుకు చేరి, దుర్వాసన వెలువడుతున్నా సంబంధిత శాఖ అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపై ఆర్‌డబ్ల్యూఎస్ జేఈ రమణను వివరణ కోరగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్న కారణంగా, చెరువులో ఎక్కువ నీరు ఉండడం వల్ల అడుగు భాగానికి ఆక్సిజన్ అందకపోవడంతో చేపలు మృతి చెంది ఉండవచ్చన్నారు. మృతి చెందిన చేపలను తొలగించేలా చర్యలు తీసుకుంటామన్నారు.
వ్యక్తికి మూడేళ్ల జైలు
పిఠాపురం: పట్టణంలో 2020లో జరిగిన మూడు వేర్వేరు దొంగతనాల కేసుల్లో నిందితుడు ఎద్దు నరేంద్రసాయికి మూడేళ్ల జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు ఇచ్చినట్లు పిఠాపురం సీఐ జి.శ్రీనివాస్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. పట్టణ పరిధిలో తాళం వేసి ఉన్న ఇళ్లే లక్ష్యంగా నరేంద్రసాయి దొంగతనాలకు పాల్పడ్డాడన్నారు. ఒక కేసుకు ఒక్కో ఏడాది చొప్పున శిక్ష విధిస్తూ ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ ఎం.విజయ రామేశ్వరి తీర్పునిచ్చారన్నారు. ఈ కేసుల్లో ప్రభుత్వం తరఫున ఏసీపీ చక్కా జగదీష్ కుమార్ వాదనలు వినిపించారన్నారు. విచారణలో ప్రతిభ కనబరచిన సీఐ, ఎస్సై వి.మణికుమార్, కోర్టు కానిస్టేబుల్ వెంకట రమణలను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించినట్లు తెలిపారు.


