సాక్షి, రాజమహేంద్రవరం/ కంబాలచెరువు: ఇంట్లోనే ఉపాధి కల్పిస్తామంటూ సత్యసాయి ఎంటర్ ప్రైజస్ సంస్థ చేసిన ప్రచారాన్ని నమ్మి చాలా మంది రూ.కోట్లలో నష్టపోయారు. అగరబత్తీలు ప్యాకింగ్ చేస్తే నెలవారీ వేతనం ఇస్తామన్న మాటలను నమ్మి దానికి సెక్యూరిటీ డిపాజిట్‌గా రూ.10 వేల నుంచి రూ.10 లక్షల వరకు చెల్లించారు. రెండు, మూడు నెలలు వ్యవహారం బాగానే నడిచిన తర్వాత నిర్వాహకుడు బోర్డు తిప్పేయడంతో తామ మోసపోయామని గ్రహించి లబోదిబోమంటున్నారు. తమకు న్యాయం చేయాలంటూ అధికారులు, పోలీసుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. అయినా ఎవరూ పట్టించుకున్న దాఖలాలు లేవు. పైగా నిర్వాహకుడి సాయంగా టీడీపీ నాయకులు పోలీస్ స్టేషన్‌కు వచ్చారంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఏం జరిగిందంటే...
అనకాపల్లికి చెందిన జి.మోహన్ కృష్ణ ఏడాది క్రితం సత్యసాయి ఎంటర్ ప్రైజస్ పేరుతో స్వయం ఉపాధి శిక్షణ కార్యాలయాలను ప్రారంభించాడు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో 29 బ్రాంచ్‌లు ప్రారంభించాడు. అగరబత్తీల ప్యాకింగ్ చేస్తూ ఇంట్లోనే ఉంటూ.. ప్రతి నెలా రూ.12 నుంచి రూ.15 వేల వరకు సంపాదించవచ్చని నమ్మబలికాడు. అందుకు ముందుగా సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించాలని ఒక్కొక్కరి నుంచి దాదాపు రూ.2 లక్షల వరకు, అలాగే మేనేజర్ పోస్టులకు రూ.10 లక్షల వరకూ వసూలు చేశాడు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 3,000 మందికి పైగా ప్రజలు సత్యసాయి ఎంటర్ ప్రైజస్‌కు వచ్చి రూ.లక్షల్లో సొమ్ములు చెల్లించి పెద్ద మొత్తంలో అగరబత్తీలను తీసుకెళ్లి ప్యాకింగ్ చేసి తెచ్చి ఇచ్చేవారు. ఈ విధంగా నిర్వాహకులు మూడు నెలల పాటు సొమ్మును సక్రమంగానే ఇచ్చారు. తర్వాత అగరబత్తీల ప్రొడక్ట్ రాలేదంటూ కాలయాపన చేస్తూ వచ్చారు. కొద్దిరోజులకు ఏకంగా సత్యసాయి ఎంటర్ ప్రైజస్ బోర్డు తిప్పేశారు.
ఫిర్యాదు చేసినా చర్యలు శూన్యం!
అగర్‌బత్తీల ప్యాకింగ్ స్కామ్ దివిలి గ్రామంలో బయటపడింది. ఆ గ్రామానికి చెందిన ఓ మహిళ తాను మోసపోయానంటూ గ్రీవెన్స్‌లో కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. అక్కడి నుంచి ఆ ఫిర్యాదు పెద్దాపురం పోలీస్ స్టేషన్‌కు చేరింది. ఫిర్యాదు పరిశీలించిన అక్కడి పోలీసులు రాజమహేంద్రవరంలో బ్రాంచ్ కార్యాలయం ఉందని, అక్కడి సమీపంలోని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని పంపేశారు. బ్రాంచ్ సమీపంలోని త్రీటౌన్ పోలీసులను ఆశ్రయించగా పట్టించుకోలేదు. దీంతో బాధితులు రాజమహేంద్రవరంలోని బ్రాంచ్ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. ఈ విషయమై ‘స్వయం ఉపాధి పేరుతో రూ.25 కోట్లకు టోకరా’ అనే శీర్షికన ‘సాక్షి’లో కథనం ప్రచురితం కావడంతో పోలీసులు కేసు నమోదుపై మల్లగుల్లాలు పడుతున్నారు.
త్రీటౌన్‌కు టీడీపీ నేతలు!
అగరబత్తీల ప్యాకింగ్ కంపెనీ నిర్వాహకుడు అనకాపల్లికి చెందిన టీడీపీ సానుభూతిపరుడు కావడంతోనే అతనిపై చర్యలకు వెనకాడుతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రాజమహేంద్రవరానికి చెందిన టీడీపీ నేతలు యాళ్ల ప్రదీప్, మజ్జి రాంబాబు బుధవారం త్రీటౌన్ పోలీస్ స్టేషన్‌కు రావడం అనుమానాలకు తావిస్తోంది. బాధితులు పోలీస్ స్టేషన్‌కు వస్తున్న విషయం సదరు టీడీపీ నేతలకు చెప్పకపోయినా, స్టేషన్‌లో ప్రత్యక్షం కావడం, కేసు పెట్టేందుకు వెళుతున్న బాధితులను నిలువరించి పక్కకు తీసుకెళ్లి మాట్లాడటం, తాము న్యాయం చేస్తామని చెప్పడాన్ని బట్టి చూస్తే కంపెనీ నిర్వాహకుడిని కేసు నుంచి బయటపడేసే ప్రయత్నం జరుగుతోందన్న ఆరోపణలున్నాయి. స్కామ్ వెనుక టీడీపీ నేతల హస్తం ఉందా అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపై ఇప్పటికీ పోలీసులు కేసు నమోదు చేయకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయమై త్రీటౌన్ సీఐ అప్పారావును వివరణ కోరగా ‘ఫిర్యాదు తీసుకున్నాం, కేసు నమోదు చేస్తాం’ అని తెలిపారు. ఇదిలా ఉంటే డబ్బులు కట్టి మోసపోయిన బాధితుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. గురువారం జిల్లా ఎస్పీని సంప్రదించి ఫిర్యాదు చేసేందుకు బాధితులు సన్నద్ధం అవుతున్నారు.
ఫ సత్యసాయి ఎంటర్‌ప్రైజెస్ భారీ మోసం
ఫ అగరబత్తీల ప్యాకింగ్ పేరుతో
నట్టేట ముంచిన వైనం
ఫ బాధితుల నుంచి రూ.10 వేల నుంచి రూ.10 లక్షల వరకూ వసూలు
ఫ సుమారు రూ.25 కోట్లకు టోకరా
ఫ కేసు నమోదుకు పోలీసుల చుట్టూ ప్రదక్షిణలు
ఫ నిర్వాహకుడికి సాయంగా టీడీపీ నేతలు!


