సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని, వల్నరబుల్ ఏరియాల్లో ప్రతిపాదించిన చర్యలను నిర్దిష్ట సమయంలో పూర్తి చేయాలని అధికారులను కలెక్టర్ కీర్తి ఆదేశించారు. రాజమహేంద్రవరంలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఆమె అధ్యక్షతన జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో మంగళవారం రహదారి భద్రత కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలోని ప్రధాన రహదారులపై జరుగుతున్న ప్రమాదాలపై సమీక్షించారు. రహదారి ప్రమాదాలు, పోలీస్ స్టేషన్ల వారీ వివరాలు, రహదారి భద్రత అమలు, ఐరాడ్ అప్లికేషన్‌లో ప్రమాదాల డేటా నమోదు, హిట్ అండ్ రన్ కేసులు, బ్లాక్ స్పాట్లు తదితర అంశాలపై జిల్లా పోలీస్, రవాణా అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. అనంతరం కలెక్టర్ కీర్తి మాట్లాడుతూ జిల్లాలో ప్రమాదాలు ఎక్కువగా జరిగే 31 బ్లాక్ స్పాట్లు, 12 అధిక ప్రమాద ప్రాంతాలను గుర్తించామని, ఈ ప్రాంతాల్లో ప్రమాదాలకు కారణాలను విశ్లేషించి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. జిల్లా ఎస్పీ డి.నరసింహ కిశోర్ మాట్లాడుతూ జాతీయ రహదారిపై బొమ్మూరు, రాజానగరం, దేవరపల్లి, కడియం, నల్లజర్ల, రంగంపేట మండలాల్లో ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయన్నారు. లైటింగ్ లోపం, సైన్ బోర్డుల కొరత, అప్రోచ్ రోడ్లలో స్పీడ్ బ్రేకర్లు లేకపోవడం వంటి కారణాలు ప్రమాదాలకు దారి తీస్తున్నాయన్నారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై జరిమానాలు విధిస్తున్నామన్నారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ మేఘ స్వరూప్, మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనా, జిల్లా రవాణా అధికారి ఆర్.సురేష్, కొవ్వూరు డీఎస్పీ దేవకుమార్, ఆర్‌అండ్‌బీ అధికారి ఎస్‌బీవీ రెడ్డి పాల్గొన్నారు.


