కట్నం వేధింపులపై ఫిర్యాదు | - | Sakshi
Sakshi News home page

కట్నం వేధింపులపై ఫిర్యాదు

Apr 2 2026 7:47 AM | Updated on Apr 2 2026 7:47 AM

అనపర్తి: అదనపు కట్నం కోరుతూ తన కుమార్తెను అల్లుడు చిత్ర హింసలకు గురి చేస్తున్నాడంటూ బిక్కవోలు మండలం బలభద్రపురం గ్రామానికి చెందిన మారుబోయిన వరలక్ష్మి బుధవారం ఫిర్యాదు చేసినట్టు ఎస్సై రవిచంద్ర తెలిపారు. పోలీసుల కథనం మేరకు వరలక్ష్మికి కుమారుడు, కుమార్తె సంతానం కాగా ఆమె భర్త, కుమారుడు ఏడాది క్రితం మరణించారు. కుమార్తె, 19 ఏళ్ల చిన్నతల్లికి ఊలపల్లి గ్రామానికి చెందిన బిర్లంకి తరుణ్‌కుమార్‌తో ప్రేమ వివాహం జరిగిందని వారిద్దరూ వరలక్ష్మి ఇంటి వద్దే బలభద్రపురంలో కాపురం ఉంటున్నారు. వారికి ఒక కుమార్తె ఉంది. తరుణ్‌కుమార్‌ ఇటీవల మద్యానికి బానిసై కట్నం కోసం డిమాండ్‌ చేస్తూ చిన్నతల్లిపై దాడి చేయడం, దూషించడం చేస్తున్నాడు. దీనితో వరలక్ష్మి అతనిని నిలదీయగా ఆమెను చంపేస్తానని బెదిరించాడు. ఈ విషయాన్ని తరుణ్‌కుమార్‌ తల్లి బిర్లంకి వరలక్ష్మికి చెప్పగా, ఆమె కూడా తన కొడుకుకు మద్దతు ఇస్తూ, రూ.రెండు లక్షల కట్నం డిమాండ్‌ చేసింది. అలాగే గత నెల 30వ తేదీ రాత్రి సుమారు 9:30 గంటలకు తరుణ్‌కుమార్‌ తన అత్త వరలక్ష్మితో గొడవపడి దాడి చేసి గాయపరిచాడు. వెంటనే ఆమెను చికిత్స కోసం అనపర్తిలోని ఏరియా ఆసుపత్రికి తీసుకువెళ్లినట్టు ఎస్సై తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు.

విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి

సీతానగరం: మండలంలోని పురుషోత్తపట్నం పంచాయతీ పరిధిలోని రామచంద్రపురానికి చెందిన పిర్ల పోశయ్య (33) విద్యుదాఘాతానికి గురై మృతి చెందినట్టు ఎస్సై బి.వినయ్‌ ప్రతాప్‌ బుధవారం తెలిపారు. ఆయన తెలిపిన వివరాలిలా ఉన్నాయి. వ్యవసాయ కూలి అయిన పోశయ్య మంగళవారం సాయంత్రం 4 గంటలకు పశువులకు పచ్చగడ్డి కోసేందుకు పొలాల్లోకి వెళ్లాడు. కోసిన పచ్చగడ్డి మోపు తలపై పెట్టుకుని వస్తుండగా విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ వైర్లకు తడిగా ఉన్న పచ్చగడ్డి మోపు తగిలి షాక్‌కు గురై అక్కడికక్కడే మరణించారు. రాత్రయినా అతడు ఇంటికి తిరిగి రాకపోవడంతో ఎక్కడికై నా వెళ్లి ఉంటాడని వెళ్లాడని ఇంటివారు భావించారు. బుధవారం ఉదయం పోశయ్య అన్నతో పాటు మరికొందరు అతడి కోసం పంట పొలాల్లో గాలించగా విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ వద్ద మృత దేహాన్ని గుర్తించారు. సమాచారం అందుకున్న స్థానిక ఎస్సై వినయ్‌ ప్రతాప్‌ సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడి భార్య కృష్ణవేణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై వినయ్‌ప్రతాప్‌ తెలిపారు. మృతునికి ఎనిమిదేళ్ల కుమార్తె, ఆరేళ్ల కుమారుడు ఉన్నారు.

గుప్త నిధుల తవ్వకాలపై

విచారణ

గంగవరం: గుప్త నిధుల కోసం కొందరు క్షుద్ర పూజలు నిర్వహించి తవ్వకాలు జరుపుతున్నారని వచ్చిన ఫిర్యాదుపై పోలీసులు బుధవారం విచారణ చేపట్టారు. ఎస్సై వెంకయ్య తెలిపిన వివరాల మేరకు, మండలం ఎండపల్లి రామవరం గ్రామంలో రెండు రోజుల క్రితం కొందరు గుప్తనిధులు కోసం తవ్వకాలు జరపుతున్నట్లు గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు అడ్డతీగల సీఐ నరసింహమూర్తి ఆధ్వర్యంలో విచారణ నిర్వహిస్తున్నామన్నారు. బుధవారం ఎండపల్లి రామవరంలో గుప్త నిధుల కోసం జరిగిన తవ్వకాలను సర్పంచ్‌ రామలక్ష్మి, గ్రామస్తులతో వెళ్లి పరిశీలించినట్టు ఎస్సై వెంకయ్య వివరించారు. అనంతరం ఎండపల్లి రామవరం చేరుకున్న సీఐ నరసింహమూర్తి గ్రామంలో పర్యటించి మాట్లాడుతూ మూఢ నమ్మకాలు నమ్మొద్దని, క్షుద్ర పూజల వదంతులు నమ్మెద్దన్నారు. బాల్య వివాహాలు, మహిళా చట్టాలు, సైబర్‌ నేరాలపై యువతకు, ప్రజలకు ప్రజలకు అవగాహన కల్పించారు.

ఉద్యోగం ఇప్పిస్తానని

రూ.5.2 లక్షలకు టోకరా

కంబాలచెరువు (రాజమహేంద్రవరం): ఉద్యోగం వేయిస్తానని చెప్పి రూ.5.2 లక్షలకు టోకరా వేసిన వ్యక్తిపై రెండో పట్టణ పోలీసులు బుధవారం కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు రాజమహేంద్రవరానికి చెందిన బొండా రమేష్‌ న్యాయవాదిగా పనిచేస్తున్నాడు. ఆయనకు గుంటూరుకు చెందిన దేవదాయశాఖలో పనిచేసే చింతపల్లి శ్రీనివాస్‌ పరిచయమయ్యాడు. తనకు రాజకీయ నాయకులు, పెద్ద స్థాయి అధికారులు తెలుసునని రమేష్‌ కుమారునికి ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పాడు. ఈ క్రమంలో రమేష్‌ నుంచి రూ.5.2 లక్షలు వసూలు చేశాడు. ఉద్యోగంపై ఎటువంటి సమాచారం ఇవ్వకపోవడంతో శ్రీనివాస్‌పై అనుమానం వచ్చిన రమేష్‌ పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement