అనపర్తి: లక్ష్మీనరసాపురం గ్రామంలోని ఓ ఇంట్లో బంగారు ఆభరణాలను సోమవారం అర్ధరాత్రి దొంగలు దోచుకుపోయారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన సురకాసుల గోపి వ్యవసాయ కూలీగా పనిచేస్తుంటాడు. అతడికి వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్నారు. స్థానిక కనకదుర్గమ్మ గుడి పక్కనే రెండు అంతస్తుల భవనం నిర్మించుకున్నారు. పగలంతా కుటుంబ సభ్యులందరూ ఆ భవనంలోనే ఉంటారు. రాత్రి పడుకోవడానికి దాని వెనుక ఉన్న పాత బిల్డింగ్‌లోకి వెళతారు. గోపి తల్లిదండ్రులు కూడా కొత్త భవనం పైఅంతస్తులో ఉంటున్నారు. ప్రతి రోజూ మాదిరిగానే సోమవారం అర్ధరాత్రి పడుకోవడానికి పాత భవనానికి వెళ్లారు. మంగళవారం ఉదయం కొత్త ఇంటికి వచ్చేసరికీ తలుపు తాళాలు పగలగొట్టి ఉన్నాయి. లోపలకు వెళ్లి చూడగా బీరువాలోని 4 కాసుల బంగారు నల్లపూసలు, రెండు కాసుల జిగిని, 4 కాసుల చైను ఉంగరాలు, ఒక కాసు విలువైన చెవి రింగులు, మ్యాటీలు కలిపి.. మొత్తం 11 కాసుల బంగారు ఆభరణాలు మాయమయ్యాయి. బాధితుడి ఫిర్యాదు మేరకు అనపర్తి ఎస్సై ఎల్.శ్రీను నాయక్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. క్లూస్ టీం సభ్యులు ఆధారాలు సేకరించారు.


