ఆత్రేయపురం: ఆ వాడపల్లి వాసుడిని చూసిన ప్రతి మది మురిసింది.. వెంకన్న క్షేత్రంలో గోవింద నామస్మరణ ప్రతిధ్వనించింది.. కోనసీమ తిరుమలగా ఖ్యాతికెక్కిన వాడపల్లి వేంకటేశ్వర స్వామివారి ఆలయం శనివారం భక్తులతో కిక్కిరిసింది. ఏడు ప్రదక్షిణలు చేసిన భక్తులతో సంద్రంగా మారింది. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వేలాది మంది రావడంతో కోలాహలంగా మారింది. ఆలయ అర్చకులు, వేద పండితులు వేకువజామునే స్వామివారికి సుప్రభాత సేవ, తొలి హారతి, నీరాజన మంత్రపుష్పం, ఐశ్వర్యలక్ష్మీ హోమం తదితర పూజలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం స్వామివారిని వివిధ రకాల ఫల పుష్పాలతో ప్రత్యేకంగా అలకరించారు. ఏడు వారాల నోము ఆచరిస్తున్న భక్తులు తిరు వీధుల్లో ఏడు ప్రదక్షిణలు చేసి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ ఒక్కరోజే సుమారు లక్ష మంది వచ్చినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. వేలాది మంది అన్నప్రసాదం స్వీకరించారు. గ్యాస్ కొరత ఉన్నప్పటికీ ఆలయ ఈఓ నల్లం సూర్యచక్రధరరావు పర్యవేక్షణలో సిబ్బంది భక్తులకు ఏవిధమైన అసౌకర్యం కలగకుండా కట్టెల పొయ్యిలపై అన్న ప్రసాదాన్ని తయారు చేయించారు. ఆలయ చైర్మన్ ముదునూరి వెంకటరాజు ఏర్పాట్లను పర్యవేక్షించారు. కొత్తపేట డీఎస్పీ సుంకర మురళీమోహన్ పర్యవేక్షణలో రావులపాలెం సీఐలు శేఖర్‌బాబు, ఉదయభాస్కర్, ఆత్రేయపురం ఎస్సై ఎస్.రాము ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది భక్తులకు ఇబ్బంది లేకుండా చూశారు. ఇదిలాఉంటే స్వామివారిని ప్రముఖ సినీ నటులు తనికెళ్ల భరణి, గౌతమ్‌రాజు తదితరులు దర్శించుకున్నారు. తనికెళ్ల భరణి మాట్లాడుతూ కోనసీమ తిరుమల దినదినాభివృద్ధి చెందుతుందన్నారు. రావులపాలెం సీఆర్సీ వ్యవస్థాపకుడు విక్టరీ వెంకట్‌రెడ్డి సారథ్యంలో స్వామివారిని దర్శించుకున్నట్లు తెలిపారు.
ఫ వాడపల్లి ఆలయంలో నిత్యాన్నదాన పథకానికి విజయవాడ, కానూరు వాస్తవ్యులు కాశి చొప్పరపు రమేష్‌బాబు, సునీత దంపతులు, వారి కుటుంబ సభ్యులు రూ.50,116 విరాళం సమర్పించారు. వీరికి స్వామివారి ఫొటోను ఆలయ సిబ్బంది వై.శ్రీనివాస్ అందించారు.
ఫ వాడపల్లికి పోటెత్తిన భక్తులు
ఫ మార్మోగిన గోవింద నామస్మరణ


