కాట్రేనికోన: కుండలేశ్వర స్వామి దేవస్థానంలో అర్చకుల కుటుంబాల మధ్య చెలరేగిన వివాదాన్ని సర్థి చెప్పేందుకు వచ్చిన అర్చక సంఘం నాయకులు, బ్రాహ్మణ మహిళలపై ఓ వర్గం దాడి చేసింది. కుండలేశ్వరం దేవస్థానంలో కాళ్లకూరి బాపన్న, మల్లన్న, సాంబయ్య కుటుంబాలకు చెందిన అర్చకులు దశాబ్దాలుగా వంతుల వారీగా స్వామికి సేవలు అందిస్తున్నారు. ఆలయం ప్రాచుర్యంలోకి రావడంతో భక్తుల రద్దీతో పాటు ఆదాయం పెరిగింది. ఉగాదితో గత అర్చకుల వంతు పూర్తి కావడంతో కొత్తవారికి అవకాశం ఇవాల్సి ఉండటంతో, ఒప్పందం కుదరక అర్చక కుటుంబాల మధ్య వివాదం తలెత్తింది. దీనిపై ఆంఽధ్ర రాష్ట్రీయ అర్చక సంఘ రాష్ట్ర అధ్యక్షుడు యనమండ్ర సత్య సీతారామశర్మ (మురమళ్ల రాంబాబు) ఆధ్వర్యంలో అర్చక సంఘం నాయకులు పలు దఫాలు చర్చలు జరిపినా ఫలితం లేకుండా పోయింది. అధికార పార్టీకి చెందిన వర్గం ప్రస్తుత అర్చకుడిని కొనసాగించాలని, పూర్వం నుంచి అనుసరిస్తున్న ఒప్పందంతో కాళ్లకూరి మల్లేశ్వరరావుకు ఇవ్వాలని అర్చక సంఘం నాయకులతో పాటు ఓ వర్గం పట్టుబట్టింది. దీనికి అధికార పార్టీ నాయకులు ఏకీభవించకుండా అర్చక సంఘం నాయకులు, అర్చకులతో పాటు మహిళలపై దాడికి తెగబడ్డారు. దీంతో ఆగ్రహించిన బాధితులు ఆలయం ముందు బైఠాయించారు. అనంతరం రాష్ట్రీయ అర్చక సంఘం అధ్యక్షుడు యనమండ్ర సత్య సీతారామశర్మ ఇరువర్గాలతో చర్చలు జరిపి వివాదానికి తెరదించారు. కుండలేశ్వరం ఆలయ ప్రధాన అర్చకులుగా కాళ్లకూరి మల్లేశ్వరశర్మ ఏడాది పాటు ఉండేందుకు అంగీకరించడంతో ఈఓ వెంకట సత్యదుర్గ సమక్షంలో బాధ్యతలను అప్పగించారు.


