రాజానగరం: అప్పుల బాధ తాళలేక ఓ వ్యక్తి గడ్డి మందు తాగగా, చికిత్స పొందుతూ మృతి చెందాడని ఎస్సై నారాయణమ్మ శనివారం తెలిపారు. మండలంలోని శ్రీకృష్ణపట్నంకు చెందిన మండారపు వీరబాబు (38) ఫైనాన్స్‌లో ఆటోను కొనుగోలు చేశాడు. అయితే వాయిదాలను సకాలంలో చెల్లించలేక ఆర్థికంగా ఇబ్బందులకు గురవుతున్నాడు. ఈ క్రమంలో ఫైనాన్సర్ల నుంచి ఒత్తిడి అధికం కావడంతో ఈ నెల 16న గడ్డి మందు తాగాడు. వెంటనే అతన్ని రాజమహేంద్రవరంలో ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడని ఎస్సై తెలిపారు.
రైలు పట్టాలపై
వ్యక్తి మృతదేహం
కడియం: స్థానిక రైల్వే స్టేషన్ సమీపంలో పట్టాలపై ఓ వ్యక్తి (50) మృతదేహం లభ్యమైందని రైల్వే పోలీసులు తెలిపారు. నీలం రంగు లుంగీ, నీలం–గ్రీన్ గళ్ల షర్ట్ ఒంటిపై ఉన్నాయన్నారు. అతని వివరాలు తెలిస్తే 94407 79249 ఫోన్ నంబరుకు తెలపాలని కోరారు.
రోడ్డు ప్రమాదంలో
ఆరుగురికి గాయాలు
రాజానగరం: జాతీయ రహదారిపై రాజానగరంలోని ఏడీబీ రోడ్డు జంక్షన్ వద్ద శనివారం ఉదయం జరిగిన ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు గాయపడ్డారు. దీనిపై సీఐ వీరయ్యగౌడ్ కథనం ప్రకారం.. విశాఖపట్నానికి చెందిన డి.కృష్ణమూర్తి, డి.ఈశ్వరమ్మ, డి.మనోహర్, కొట్నాన కృష్ణమూర్తి, కె.లక్ష్మి, వేగిరెడ్డి అఖిల ఒకే కారులో వాడపల్లి వేంకటేశ్వరస్వామి ఆలయానికని బయలు దేరారు. పై జంక్షన్‌కు వచ్చేసరికి ఈ కారును కాకినాడ వైపు రోడ్డు మలుపు తిరుగుతున్న లారీ ఢీకొంది. కారు ముందు భాగం నుజ్జునుజ్జవడంతో పాటు అందులో ప్రయాణిస్తున్న పై ఆరుగురు గాయపడ్డారు. వెంటనే క్షతగాత్రులను రాజానగరంలోని జీఎస్‌ఎల్ ఆస్పత్రికి 108 వాహనంలో తరలించారు. అక్కడ చికిత్స అనంతరం విశాఖపట్నానికి తిరుగు ప్రయాణమయ్యారు. ఈ మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు.
పురుగు మందు తాగి
వ్యక్తి ఆత్మహత్యాయత్నం
కాట్రేనికోన: పోలీసులు వేధింపులకు గురిచేస్తున్నారంటూ ఓ వ్యక్తి సోషల్ మీడియాలో వీడియో పోస్టు చేసి పురుగు మందు తాగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. అతని కథనం ప్రకారం.. కాట్రేనికోనలోని రామస్వామితోటకు చెందిన మోకా శ్రీకాంత్ ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. శుక్రవారం వేట్లపాలెంలో ఓ ఇంటి బేస్‌మెంట్ కోసం అవసరమైన మట్టిని శ్రీకాంత్ తరలిస్తుండగా, పోలీసులు పట్టుకున్నారు. పది రోజులుగా లేఅవుట్‌లకు మట్టిని టిప్పర్లతో తరలిస్తున్నా పోలీసులు పట్టించుకోలేదని, ఇంటి బేస్‌మెంట్‌కు మట్టిని తరలిస్తుండగా తన ట్రాక్టర్‌ను పట్టుకున్నారంటూ 100కు అతను ఫోన్ చేశాడు. అనంతరం జిల్లేళ్లవారిపేట సమీపంలో వేట్లపాలెం నుంచి మట్టితో వస్తున్న మూడు లారీలను పోలీసులు పట్టుకున్నారన్నారు. కొంత సేపటికి లారీలను వదిలేశారన్నారు. తన ట్రాక్టర్ కోసం వెళ్తే కేసు కట్టేశామని పోలీసులు అంటున్నారని, దీనిపై సోషల్ మీడియాలో ఓ వీడియో పెట్టి శ్రీకాంత్ ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. అతనికి స్థానిక వైద్యుడిచే వైద్యం చేయించగా, ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడగా ఉంది. దీనిపై కాట్రేనికోన ఎస్సై అవినాష్‌ను వివరణ కోరగా స్థానికుల ఫిర్యాదుపై మట్టి ట్రాక్టరును పట్టుకున్నామని, పోలీసులు వేధింపులేవీ లేవన్నారు.


