వనదుర్గ అమ్మవారి ఆలయం
అన్నవరం: సత్యదేవుని సన్నిధిలో.. రత్నగిరి వనదేవతగా పూజలందుకుంటున్న వనదుర్గ అమ్మవారి ఆలయంలో నెల రోజుల కిందట ఖడ్గమాల పూజకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు సమక్షంలో ఈ పూజలను గత నెల 20న ప్రారంభించారు. అప్పటి నుంచి ప్రతి శుక్రవారం ఉదయం 7.30 నుంచి 8.30 గంటల వరకూ ఈ పూజలు నిర్వహిస్తున్నారు. దుర్గా మాతకు చేసే ఖడ్గమాల పూజ చాలా విశిష్టమైనది. విజయవాడ దుర్గ గుడిలో ఈ పూజను చాలా విశేషమైనదిగా భావిస్తారు. అదే స్ఫూర్తితో అన్నవరం దేవస్థానంలో వనదుర్గ అమ్మవారి ఆలయంలో దీనిని ప్రవేశపెట్టారు. అయితే ఈ పూజ గురించి చేస్తున్న ప్రచారానికి తగిన రీతిలో దేవస్థానంలో ఏర్పాట్లు లేవన్న విమర్శలు భక్తుల నుంచి వస్తున్నాయి.
ఇవీ విమర్శలు
సాధారణంగా ప్రతి పూజలోనూ భక్తులను స్వామి, అమ్మవార్లకు ఎదురుగా కాకుండా పక్కగా కూర్చోబెడతారు. కానీ, ఇక్కడ భక్తులను ఒకరి వెనుక ఒకరిని అమ్మవారికి ఎదురుగా కూర్చోబెట్టి పూజ చేయిస్తున్నారు. దీనివలన ముందున్న వారి పృష్ట భాగం వెనుక కూర్చున్న వారికి కనిపిస్తోంది. వారి వెనుక అమ్మవారి యంత్రానికి పూజ చేస్తూండటం భక్తులను అసంతృప్తికి గురి చేస్తోంది. ఇది సరైన విధానం కాదని భక్తులు అంటున్నారు. సత్యదేవుని వ్రతాలాచరించేటపుడు కూడా స్వామివారి చిత్రపటానికి ఎదురుగా కాకుండా పక్కగా భక్తులను వరుసలో కూర్చోబెడతారు. స్వామివారి నిత్య కల్యాణంలో కేవలం విఘ్నేశ్వర పూజ తప్ప మరే పూజా ఉండదు. అర్చకులు చేసే కల్యాణం తిలకించడమే. అందువలన అక్కడ భక్తులను ఎదురుగా కూర్చోబెడతారు. ఖడ్గమాల పూజలో మాత్రం యంత్రానికి సుమారు 45 నిమిషాల పాటు కుంకుమ పూజ చేయిస్తారు.
ఖడ్గమాల పూజ టికెట్టు రూ.1,116. ఇంత మొత్తం తీసుకుంటున్న దేవస్థానం భక్తులు కూర్చునేందుకు కనీసం సరైన చాపలు కూడా వేయడం లేదు. చిరిగిన చాపలు వేస్తున్నారు. దీనికి బదులు దంపతులు కూర్చునేందుకు చిన్న తివాచీలు వే యొచ్చు. ఒక తివాచీ ఖరీదు సుమారు రూ.వెయ్యి ఉంటుంది. ఒకసారి కొంటే కనీసం నాలుగేళ్లు ఉపయోగపడుతుంది. కానీ, ఎందుకనో ఆ చాపలతోనే సరిపెడుతున్నారు. కానీ అమ్మవారి ఆలయంలో ఒక మూల పరుపులు గు ట్టగా ఉంటున్నాయి. ఎవరైనా దేవస్థానం సిబ్బంది కానీ, వీఐపీలు కానీ పూజకు వస్తే ఆ పరుపులను వారికి వేస్తున్నారు. సామాన్య భక్తులు రూ.1,116 టికెట్టు తీసుకున్నా సరే వారికి చాపలే గతి.
పూజ చేయించుకునే భక్తులకు రెండు పళ్లాలు ఇస్తున్నారు. ఒక పళ్లెంలో యంత్రంపై కుంకుమ పూజ, ఇంకో పళ్లెంలో పూజాద్రవ్యాలు ఉంచుతున్నారు. చివరిలో పులిహోర ప్రసాదం తెస్తే దానిని నేల మీద ఉంచుతున్నారు. దీనికి బదులు భక్తులకు ఇంకో పళ్లెం ఇచ్చి, అందులో ఉంచే ఏర్పాటు చేయాలని భక్తులు సూచిస్తున్నారు. ప్రస్తుతానికి ఈ పూజలో పది మందికి మించి పాల్గొనే అవకాశం లేదు. అందువలన మరో పది పళ్లాలుసమకూరిస్తే సరిపోతుంది.
ఖడ్గమాల పూజతో పాటు శుక్రవారం వనదుర్గ అమ్మవారికి చండీహోమం కూడా నిర్వహిస్తారు. అయినప్పటికీ అమ్మవారికి పెద్దగా అలంకరణ ఏమీ చేయడం లేదు. రోజూ ఇచ్చే పూలదండల కన్నా మరో రెండు దండలు మాత్రమే ఇస్తారు. మండపంలో అయితే మామిడి తోరణాలు తప్ప పెద్దగా అలంకరణ చేయడం లేదు.
పూజ ఉదయం 7.30 గంటలకే ప్రారంభిస్తున్నారు. స్థానికంగా ఉన్నవారు తప్ప దూర ప్రాంతాల వారు ఆ సమయానికి హాజరయ్యే అవకాశం ఉండటం లేదు. అలాగని రెండో బ్యాచ్‌కు అవకాశం కూడా లేదు. పూజ సమయాన్ని మార్చడమో లేదా ఉదయం 9 గంటలకు రెండో బ్యాచ్ పూజ ప్రారంభించడమో చేస్తే బాగుంటుంది.
ఖడ్గమాల పూజను ఇద్దరు వ్రత పురోహితులు మాత్రమే చేస్తున్నారు. వేద పండితుడు కూడా ఒక్కరు మాత్రమే ఉంటున్నారు. కనీసం ఇద్దరు వేద పండితులు, సత్యదేవుని ఆలయ ప్రధానార్చకుడు లేదా అర్చకులు పూజ పూర్తయ్యేంత వరకూ ఉండేలా చూడాలి. అలాగే, పూజ సమయంలో ఆలయ సిబ్బంది ఎవరూ ఉండడం లేదు. కనీసం సూపరింటెండెంట్ లేదా గుమస్తా అయినా ఆ సమయంలో ఉండాలి.
గతంలో వనదుర్గ అమ్మవారి చండీ, ప్రత్యంగిర హోమాలకు పెద్దగా భక్తులుండేవారు కాదు. కానీ, 2014 నుంచి ఆ హోమాల పూర్ణాహుతి సమయంలో అప్పటి ఈఓలు కాకర్ల నాగేశ్వరరావు, జితేంద్ర తదితరులు వస్తూండటంతో వారితో పాటు సిబ్బంది కూడా వచ్చేవారు. క్రమంగా ఇది సంప్రదాయంగా మారింది. ఇప్పుడు ఆ హోమాల్లో భక్తులు కూడా విశేష సంఖ్యలో పాల్గొంటున్నారు. ఖడ్గమాల పూజకు కూడా అటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి.
ఖడ్గమాల పూజ విషయంలో ఈ జాగ్రత్తలన్నీ తీసుకుని, మరింత ప్రచారం చేస్తే ఎక్కువ మంది భక్తులు పాల్గొనే అవకాశం ఉంటుంది. దీనిపై దేవస్థానం వైదిక కమిటీతో ఈఓ సమావేశమై చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.
ఖడ్గమాల పూజ నిర్వహణ
తీరుపై విమర్శలు
టికెట్టు వెయ్యి నూట పదహార్లు
చింకిచాపలు, చాలీచాలని
పూజా సామగ్రితో సరి
ఒకరి వెనుక ఇంకొకరిని
కూర్చోబెట్టి పూజలు
ఇది సంప్రదాయ
విరుద్ధమంటున్న భక్తులు
ఉదయం 7.30 గంటలకే ప్రారంభం
ఆ సమయానికి హాజరు
కాలేకపోతున్న స్థానికేతరులు


