భద్రతకు సుస్తీ | - | Sakshi
Sakshi News home page

భద్రతకు సుస్తీ

Mar 21 2026 5:19 AM | Updated on Mar 21 2026 5:19 AM

కంబాలచెరువు (రాజమహేంద్రవరం): జిల్లాకే తలమానికంగా విరాజిల్లుతూ పేద రోగులకు ఎన్నో వైద్య సేవలు అందిస్తున్న రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆస్పత్రిలో భద్రత దయనీయంగా మారింది. దీని వల్ల ఆస్పత్రి సిబ్బందితో పాటూ రోగులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల జరుగుతున్న ఘటనలు దీనికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఓ వ్యక్తి మద్యం మత్తులో సెక్యూరిటీ గార్డు చెయ్యి నరికేశాడు. రూ.4 లక్షల విలువైన ఏసీ కాపర్‌ గొట్టాలను పట్ట పగలే దొంగలు దోచుకెళ్లారు. అక్కడ పని చేస్తున్న స్టాఫ్‌ నర్సు మెడలో బంగారు గొలుసును ఓ వ్యక్తి లాక్కుని పరారయ్యాడు. బాత్రూంలో కుళాయిలు, ఇనుప పైపులను విప్పుకుని మరీ ఎత్తుకెళ్లారు. పట్ట పగలే భవన నిర్మాణ సామగ్రిని దర్జాగా ఆటోలో తరలించేశారు. రోగుల సెల్‌ఫోన్లు మాయమైపోతున్నాయి. అంబులెన్సు బ్యాటరీలు కూడా దొంగిలించారు. ఆస్పత్రిలో సెక్యూరిటీ కార్యకలాపాలపై పర్యవేక్షణ కొరవడడమే దీనికి కారణమని తెలుస్తోంది.

అనేక ఆరోపణలు

ఆస్పత్రిలో సెక్యూరిటీ కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్న ఓ వ్యక్తిపై అనేక ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అతడు నిబంధనలకు విరుద్ధంగా అనర్హులను సెక్యూరిటీ గార్డుల ఉద్యోగాలకు నియమిస్తున్నాడని సమాచారం. అర్హత, అనుభవాల ఆధారంగా జరగాల్సిన ఎంపిక ప్రక్రియ కేవలం ఆర్థిక ప్రయోజనాలే పరమావధిగా సాగుతోందని, డబ్బులు ఇస్తే చాలు ఉద్యోగం ఇస్తున్నాడనే విమర్శలు వస్తున్నాయి. దీంతో అర్హత, అనుభవం, ఫిట్‌నెస్‌ లేనివారు సెక్యూరిటీ గార్డులుగా ఉండడంతో ఆస్పత్రిలో దొంగతనాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయని చెబుతున్నారు. ఇటీవల ఆటోలో వచ్చి సామగ్రిని ఎత్తుకెళుతున్న దొంగలను నూతన భవనాలు కడుతున్న సంస్థ సెక్యూరిటీ గుర్తించింది. కానీ జీజీహెచ్‌ సెక్యూరిటీ అస్సలు కనిపెట్టలేకపోయింది. వార్డుల్లో రోగుల సహాయకుల సెల్‌ఫోన్లు పట్టపగలే మాయమైపోతున్నాయి. విధుల్లో ఉన్న ఓ నర్సు మెడలోని బంగారు గొలుసు లాక్కెళ్లిపోయారు. సీఎంవోపై వాటర్‌ బాటిల్‌తో దాడి చేయగా సెక్యూరిటీ ఈ ఘటనను నిలువరించలేకపోయింది.

ఇష్టారాజ్యం

సెక్యూరిటీ గార్డులుగా నియమితులైన కొందరు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. జీతాలు తీసుకుని విధులకు డుమ్మా కొడుతూ సొంత పనుల్లో మునిగి తేలుతున్నారని తెలుస్తోంది. ఈ గార్డుల్లో ఒకరు మ్యాట్రీమోనీ ప్రతినిధిగా పని చేస్తున్నాడు. ఇంకో వ్యక్తి ఆసుపత్రి ఆవరణలో ఫేస్‌ అటెండెన్స్‌ వేసుకుని ఆటో డ్రైవర్‌గా కిరాయిలకు వెళుతున్నాడు. ఓ మహిళ హాజరు వేయించుకుని భర్త బట్టల దుకాణానికి వెళ్లి వ్యాపారం చేస్తోంది. ఓ వ్యక్తి హాజరు వేసుకుని వెళ్లిపోయి తన సొంత పాల కేంద్రం నడుపుకొంటున్నాడు. వీరి వ్యవహారంపై ఆసుపత్రి అధికారుల పర్యవేక్షణ కొరవడింది. సెక్యూరిటీని పర్యవేక్షిస్తున్న సదరు వ్యక్తి కనుసన్నల్లోనే ఈ అవకతవకలు జరుగుతున్నాయని, అతడు అడిగిన సొమ్ము ఇస్తే సరిపోతోందని సమాచారం. అలాగే 60 మంది సెక్యూరిటీ గార్డుల్లో 11 మందిపై పలు నేరాల్లో కేసులు ఉన్నట్టు తెలుస్తోంది.

ఫిర్యాదుల వెల్లువ

సెక్యూరిటీని పర్యవేక్షిస్తున్న సదరు వ్యక్తి తనను వేధిస్తున్నాడంటూ ఓ మహిళ రాజానగరం పోలీ స్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఆ కేసు నుంచి బయటకు పడేందుకు భారీగా డబ్బులు ముట్టజెప్పినట్టు సమాచారం. అలాగే గత ఏడాది సెప్టెంబర్‌ 25న ఇద్దరు సెక్యూరిటీ గార్డులపై కేసులు ఉన్నాయని విశాఖపట్టణం నుంచి జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌కు ఫిర్యాదులు అందా యి. అదే నెల 9న ఓ మహిళ సెక్యూరిటీ పర్యవేక్షకుడు తన వద్ద లంచం తీసుకుని ఉద్యోగం ఇప్పిస్తానని మోసం చేశాడని ఫిర్యాదు చేసింది. ఇవన్నీ పెండింగ్‌ దశలోనే ఉన్నాయి. నెలలు గడిచినా ఎటువంటి విచారణ లేదు. మార్చురీలో శవానికి పోస్టుమార్టం జరుగుతుండగా ఓ సెక్యూరిటీ గార్డు.. కుటుంబ సభ్యుల వద్దకు వెళ్లి డబ్బులు డిమాండ్‌ చేసి వసూలు చేశాడు. బాధితుల ఫిర్యాదుతో విషయం బయటకు వచ్చింది. కలెక్టర్‌ కీర్తి చేకూరి ఈ విషయంపై విచారణకు ఆదేశించి నిజాలు నిగ్గు తేలడంతో డబ్బులు వసూలు చేసిన సెక్యూరిటీ గార్డును తొలగించాలని ఆదేశాలిచ్చారు. అయినా ఆ సెక్యూరిటీ గార్డును కొనసాగుతుండడం విశేషం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement