● చంద్రదర్శనంతో శుక్రవారం
ముగిసిన రంజాన్ మాసం
● శనివారం ఈద్ నమాజ్
చేయనున్న ముస్లింలు
● ప్రార్థనలకు ముస్తాబైన మసీదులు
సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): పవిత్ర రంజాన్ మాసం శుక్రవారంతో ముగిసింది. చంద్ర దర్శనంతో ముస్లింలు ఈద్ నమాజ్‌కు సిద్ధమయ్యారు. శనివారం ఈద్ ఉల్ ఫితర్ పండగ చేసుకునేందుకు ఏర్పాట్లు చేశారు. నెల రోజుల పాటు కఠోర రోజాలు, నమాజ్, సహెర్, ఇఫ్తార్లు, ఖురాన్ పఠనం, ధాన ధర్మాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలతో గడిపారు. ఎండ తీవ్రత పెరిగినా దీక్షలు సడలించకుండా పాటించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు (14 గంటలకు పైగా) చుక్క మంచినీరు కూడా తాగకుండా నిష్టతో దీక్షలు పాటించారు. చివరకు చంద్రదర్శనంతో పండగ చేసుకోనున్నారు.
ఈద్ నమాజ్‌కు సిద్ధం
ఈద్ ఉల్ ఫితర్ నమాజ్ కోసం ఈద్గాలతో పాటు మసీదుల్లో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. పండగ రోజు ముస్లింలు ఈద్గాలకు వెళ్లి నమాజ్ చేస్తారు. నెల రోజుల తాము చేసిన ప్రార్థనలు ఫలించాలని, సర్వమానవాళి సంతోషంగా ఉండాలని కోరుతూ దువా చేస్తారు. రాజమహేంద్రవరంలో పాటు జిల్లాలోని అన్ని ఈద్గాలు, మసీదుల్లోనూ ఈద్ నమాజ్ జరుగుతుంది.
దాన ధర్మాలకు ప్రాధాన్యం
రంజాన్‌లో దాన ధర్మాలకు అధిక ప్రాధాన్యత ఉంది. ధనికులతో పాటూ పేదలు సైతం పండగ చేసుకోవాలన్నదే ముఖ్య నిర్వచనం. మనిషి ఆరోగ్యం, సంపాదించిన ధనంపై అల్లా సూచించిన బీమాయే జకాత్, ఫిత్రా దానాలు అని చెప్పవచ్చు. 52.5 గ్రాముల వెండి, 75 గ్రాముల బంగారం, అంతకు మించి విలువైన ధనం, ఆస్తులు కలిగిన వారు జకాత్‌కు అర్హులు. వాటిని వెల లెక్కకట్టి 2.5 శాతం పేదలకు పంచాలి. ఇది రంజాన్‌లో ఇస్తే 70 శాతం అధికంగా పుణ్యం లభిస్తుందని విశ్వాసం.
పేదలకు దానం
రంజాన్ సందర్భంగా 1,750 గ్రాముల గోధుమలు, దానికి సమానమైన డబ్బును పేదలకు దానం చేయడమే ఫిత్రా. దీనిని ఆరోగ్య బీమాగా మతపెద్దలు చెబుతారు. పేదరికంతో పండగకు నోచుకోని అభాగ్యులకు ఫిత్రా దానం ఇవ్వాలి. ఈ ఏడాది మత పెద్దలు రూ.150 ఫిత్రా ఇవ్వాలని ఖరారు చేశారు. దీని కంటే ఎక్కువ ఇవ్వవచ్చు కానీ తగ్గించరాదు. అప్పడే పుట్టిన బిడ్డ నుంచి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరి పేరు మీదా ఫిత్రా దానం చేయాలి.
ఈద్ శుభాకాంక్షలు
రంజాన్ పండగ రోజు ముస్లింలు సామూహిక ఈద్ నమాజ్ జరుపుకొని అనంతరం ఒకరికి ఒకరు ఈద్ ముబారక్ చెప్పకుంటారు. ప్రార్థనా స్థలానికి అల్లా నామం స్మరిస్తూ ఒక మార్గం నుంచి వెళ్లి, వేరే మార్గంలో ఇంటికి వచ్చి సేమ్యా సేవిస్తారు. బంధుమిత్రులకు, ఇరుగుపొరుగు వారికి సేమ్యాను పంచి, తమ ఆత్మీయతను తెలియజేస్తారు. చిన్న పిల్లలకు ఈద్ కానుకలు బహూకరిస్తారు.


