తాళ్లపూడి: మలకపల్లి గ్రామంలో చర్మకారుడు సనమండ్ర పోశియ్య ఇంటి పనులు పూర్తయ్యాయి. ఆ ఇంటిని శుక్రవారం జిల్లా హౌసింగ్ పీడీ నాతి బుజ్జి, ఇతర శాఖల అధికారులు పరిశీలించారు. హౌసింగ్ పీడీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హమీలు అమలు చేయడానికి కలెక్టర్ ఆదేశాల మేరకు హౌసింగ్, డీఆర్‌డీఏ డ్వామా, రెవెన్యూ అధికారులందరూ కలిసి పనిచేయడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా వారందరికీ పోశియ్య కృతజ్ఞతలు తెలిపారు.
కాగా.. ముఖ్యమంత్రి చంద్రబాబు గతంలో మలకపల్లికి వచ్చిన సమయంలో పీపీపీపీ విధానంలో పోశియ్య ఇంటిని బాగు చేయించడంతో పాటు, చెప్పుల దుకాణం పెట్టుకోవడానికి స్థలం చూపిస్తానని హామీ ఇచ్చారు. కానీ అది నెరవేర్చక పోవడంతో పీపీ.. పీపీ.. ఢాంఢాం అనే శీర్షికతో గత నెల 26న ‘సాక్షి’ పత్రికలో కథనం ప్రచురితమైంది. దానికి జిల్లా అధికారులు తక్షణం స్పందించారు. మలకపల్లిలో పోశియ్య ఇంటిని పరిశీలించి, ఉగాది నాటికి పనులు పూర్తి చేసి అప్పగిస్తామని హమీ ఇచ్చారు. ఆ ప్రకారమే ఇంటి పనులు పూర్తి చేసి అప్పగించారు. కార్యక్రమంలో ఇన్‌చార్జి ఏఈ దాదాసాహెబ్, వర్క్ ఇన్‌స్పెక్టర్ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.


