● పరాభవ నామ సంవత్సర ఫలితం భేష్
● ఈ ఏడాది భక్తుల సౌకర్యాలకు
భారీగా వెచ్చించే అవకాశం
అన్నవరం: రత్నగిరి వాసుడైన సత్యదేవునికి శ్రీ పరాభవ నామ సంవత్సరంలో సర్వత్రా జయం చేకూరుతుందని ప్రముఖ పంచాంగకర్త, అన్నవరం దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి తంగిరాల వేంకట కృష్ణ పూర్ణ ప్రసాద్ తెలిపారు. ఆదాయ, వ్యయాలతో నిమిత్తం లేకుండా స్వామివారి ఖ్యాతి విశ్వవ్యాప్తమవుతుందన్నారు. రత్నగిరిపై సత్యదేవుని అనివేటి మండపంలో గురువారం నిర్వహించిన ఉగాది వేడుకల్లో ఆయన పంచాంగ పఠనం చేశారు. ఉదయం 8.30 గంటలకు సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఊరేగింపుగా అనివేటి మండపం వద్దకు తీసుకువచ్చి, సర్వాంగ సుందరంగా అలంకరించిన మండపంలో వేంచేయించారు. నూతన సంవత్సర పంచాంగ ప్రతులను స్వామి, అమ్మవార్ల చెంతన ఉంచి పండితులు ప్రత్యేక పూజలు చేశారు. దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, ఈఓ వి.త్రినాథరావు దంపతులు స్వామి, అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించారు. శ్రీ పరాభవ నామ పంచాంగ ప్రతులను ఆవిష్కరించారు. అనంతరం, పూర్ణప్రసాద్ సిద్ధాంతి నూతన సంవత్సర పంచాంగ ఫలితాలను చదివి వివరించారు. సత్యదేవునిది మఖ నక్షత్రం, సింహరాశి కావడంతో ఈ ఏడాది ఆదాయం 5, వ్యయం 5గా ఉన్నాయన్నారు. ఈ రెండూ సమానమని అంటే ఈ ఏడాది దేవస్థానంలో అనేక సత్రాలు, నూతన నిర్మాణాలు, వివిధ అభివృద్ధి పథకాలు చేపట్టేందుకు వ్యయం చేస్తారని అర్థమన్నారు. భక్తుల సౌకర్యాలు కల్పనకు కూడా నిధులు వెచ్చిస్తారన్నారు. సింహరాశి వారికి రాజపూజ్యం, అవమానం 7 చొప్పున సమానంగా ఉన్నాయని, అయితే, ఇవి దేవతలకు వర్తించవని చెప్పారు. వైశాఖ మాసంలో సత్యదేవుని దివ్య కల్యాణోత్సవాలతో పాటు ఇతర ఉత్సవాలు కూడా నిర్విఘ్నంగా జరుగుతాయని వివరించారు. ఈ సంవత్సరం కొన్ని రాశుల వారికి ఆదాయం తక్కువ, వ్యయం ఎక్కువ ఉన్నప్పటికీ ప్రతికూల ఫలితాలుగా భావించరాదన్నారు. ఆస్తులు, వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేసినా వ్యయంగానే భావించాలని తెలిపారు. దైవ ప్రార్థనలు, పూజలు, దానాల వలన ఆయా రాశుల వారికి అవి సానుకూల ఫలితాలుగా మారుతాయని ఆయన వివరించారు.
పలువురికి సత్కారం
పంచాంగ శ్రవణానంతరం భక్తులకు ఉగాది పచ్చడి, స్వామివారి ప్రసాదాలను పంపిణీ చేశారు. ఉగాది వేడుకల్లో భాగంగా ప్రముఖ వేద పండితులు వెంపరాల సీతారామ అవధాని (అమలాపురం), సుందరరామ శ్రోతి(విజయవాడ)లను రూ.5,116 నగదు పారితోషికంతో చైర్మన్, ఈఓలు ఘనంగా సత్కరించారు. పంచాంగ ఫలితాలను వివరించిన పూర్ణప్రసాద్ సిద్ధాంతిని కూడా సత్కరించారు. దేవస్థానం సీనియర్ వేద పండితుడు గంగాధరభట్ల గంగబాబు, సత్యదేవుని ఆలయ ప్రధానార్చకుడు ఇంద్రగంటి నరసింహమూర్తి, సీనియర్ అర్చకుడు బులుసు సుబ్రహ్మణ్యేశ్వరశర్మలు రాష్ట్ర ప్రభుత్వ ఉగాది పురస్కారాలకు ఎంపికయ్యారు. వీరిలో గంగబాబు, ఇంద్రగంటిలను చైర్మన్, ఈఓలు ఘనంగా సత్కరించి, ప్రశంసాపత్రాలు అందజేశారు. అర్చకుడు బులుసు తరఫున ప్రధానార్చకుడు కోట సుబ్రహ్మణ్యశర్మ వీటిని స్వీకరించారు. ఉగాది వేడుకల్లో భాగంగా ఆలయ ప్రాకారంలో స్వామివారి రథోత్సవం.. భక్తుల కోలాహలం, చిన్నారుల నృత్యాల నడుమ ఉదయం ఘనంగా నిర్వహించారు. ఉగాది వేడుకల సందర్భంగా సత్యదేవుని ఆలయం, అనివేటి మండపాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు.


