సెక్యూరిటీ గార్డుపై అర్ధరాత్రి కత్తితో దాడి
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): స్థానిక ప్రభుత్వాసుపత్రిలో ఓ తాగుబోతు కత్తితో సెక్యూరిటీ గార్డుపై దాడి చేసిన సంఘటన కలకలం రేపింది. పోలీసుల సమక్షంలోనే అతడు దాడి చేస్తూంటే బాధితుడు చేయి అడ్డు పెట్టాడు. దీంతో, అతడి చేయి, తలపై కత్తి వేట్లు పడ్డాయి. నిందుతుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. సీటీఆర్‌ఐకి చెందిన కడగల సూర్యప్రకాశరావు ప్రభుత్వాసుపత్రిలో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నాడు. అతడు బుధవారం రాత్రి డ్యూటీలో ఉండగా.. దేశాబత్తుల చిన్నారావు అనే వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తన బంధువును చూసేందుకు అక్కడకు వచ్చాడు. అతను పదేపదే రోగి వద్దకు వెళ్లి, వస్తూండటంతో అక్కడ తిరగవద్దని సెక్యురిటీ గార్డు సూర్యప్రకాశరావు చెప్పారు. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య వాగ్వావాదం చోటు చేసుకుంది. ఇదిలా ఉండగా ఆ రోగి బంధువులు ఆసుపత్రిలో ఫుల్‌గా మద్యం తాగారు. ఈ క్రమంలో గురువారం తెల్లవారుజామున సెక్యూరిటీ గార్డుకు, రోగి బంధువు చిన్నారావుకు మళ్లీ వాగ్వాదం జరిగింది. విషయం పోలీసుల దృష్టికి వెళ్లడంతో ఆసుపత్రి గేటు బయట ఉన్న చిన్నారావును పిలుచుకు రావాలని వారు సెక్యూరిటీ గార్డుకు చెప్పారు. అతడు వెళ్లి పిలుస్తూండగానే.. ముందుగానే వెంట తెచ్చుకున్న కొబ్బరి బొండాల కత్తితో అతడిపై చిన్నారావు దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన సెక్యూరిటీ గార్డును వెంటనే ఆసుపత్రిలో చేర్చి వైద్య చికిత్సలు అందించారు. నిందితులపై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు.


