రావులపాలెం: అంతరించి పోతున్న కళలను, కళాకారులను ప్రోత్సహించేందుకు కాస్మోపాలిటన్ రిక్రియేషన్ క్లబ్(సీఆర్‌సీ) కాటన్ కళాపరిషత్ చేస్తున్న కృషి అభినందనీయం అని సినీనటులు గౌతంరాజు, గుండు సుదర్శన్, ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. రావులపాలెంలోని సీఆర్‌సీ కాటన్ కళాపరిషత్ ఆధ్వర్యంలో 26వ ఉగాది ఆహ్వాన నాటికల పోటీలు, సిల్వర్ జూబ్లి వేడుకలు గురువారం వారు జ్యోతి వెలిగించి ప్రారంభించారు. 26 వసంతాలుగా సీఆర్‌సీ సేవలు ప్రసంశనీయం అని కొనియాడారు. సీఆర్‌సీ ఉగాది పురస్కారాన్ని కాకినాడకు చెందిన సప్తగిరి హేచరీస్ అధినేత సత్తి సూర్యనారాయణరెడ్డికి అందజేశారు. ఏర్పాట్లను సీఆర్‌సీ అధ్యక్షుడు తాడి నాగమోహనరెడ్డి, కార్యదర్శి నల్లమిల్లి వీర్రాఘవరెడ్డి, సీఆర్‌సీ రూపశిల్పి విక్టరీ వెంకటరెడ్డి, నాటక కళాపరిషత్ డైరెక్టర్ కె.సూర్య, ఉపాధ్యక్షుడు చిన్నం తేజారెడ్డి, సీఆర్‌సీ డైరెక్టర్లు సత్తి సూర్యభాస్కరరెడ్డి(చిన్నబుజ్జి) మల్లిడి విజయభాస్కరరెడ్డి, మల్లిడి అంజనీకుమార్‌రెడ్డి, పడాల సత్యనారాయణరెడ్డి, పరిషత్ పర్యవేక్షణ డైరెక్టర్ పలివెల త్రిమూర్తులు పర్యవేక్షించారు.
ఆలోచింపజేసిన నాటికలు
మొదటిరోజు రెండు నాటికలను ప్రదర్శించారు. గోవాడ క్రియేషన్స్, హైదరాబాద్ వారి అమ్మ చెక్కిన బొమ్మ (నాటిక) జ్యోతిరాజ్ భీశెట్టి రచన, డాక్టర్ వెంకట్ గోవాడ దర్శకత్వంలో ఆలోచనాత్మకంగా సాగింది.
సృష్టిలో ఉత్తమమైనది మానవ జన్మ, మానవ చరిత్రలో సీ్త్ర, పురుషుల గురించే మనం మాట్లాడుకుంటాం, పురాణకాలం నుంచి నేటి వరకూ, ఆదిమానవ యుగం నుంచి ఇప్పటివరకూ సీ్త్ర,పురుషులే కాకుండా మానవజాతిలో దాదాపు 20 రకాల శరీరతత్వాలు కలిగిన మనుషులు ఉన్నారని ఎంతమందికి తెలుసు?! సీ్త్రలను, పురుషులను మాత్రమే గౌరవించే ఈ బూటకపు నాగరికతలో వాళ్ళు ఎలా మనగలుగుతున్నారు?! అలాంటి వాళ్ళకు ఎలాంటి గుర్తింపు, గౌరవం ఉంది? అసలు ఈ ఆలోచన మనకు ఎప్పుడైనా కలిగిందా?
విభిన్న శరీరతత్వ స్వభావం కలిగినవారి గురించి మన పురాణాలు, చరిత్రలు పరిచయం చేస్తూనే వచ్చాయి. సాంకేతికత గల నేటి ఆధునిక సమాజంలో అలాంటి వారికి సముచిత స్థానాన్ని కలగ చేయకపోవడం మన నాగరికతలో మనం ఒప్పుకోవడానికి సిద్దపడని డొల్లతనం కాదా?! సీ్త్ర, పురుషుడు కానివారిని అవమానించడం, గౌరవించకపోవడం, అసహ్యించుకోవడం అనేది మానవజాతి దిగజారుడు స్థితికి ఓ ప్రతీక. అవునంటారా ? కాదంటారా? అలాంటి వివక్షలను కనీసం తరచి చూసే బాధ్యత మనకి ఉందంటారా? లేదంటారా? అలాంటి ఎన్నో నిజ జీవితాల నుంచి ఆవిష్కరించిన ఒక విభిన్న శరీరతత్వపు మనిషి జీవితంలోకి తొంగి చూద్దాం వాళ్ళు మనసున్న మనుషులేనని గుర్తించి, గౌరవిద్దాం అంటూ ఆలోచనాత్మకంగా సాగిన అమ్మ చెక్కిన బొమ్మ నాటిక ఆకట్టుకుంది.
కాకినాడ బీవీకే క్రియేషన్స్ కన్నీటికి విలువెంత? నాటిక మూల కథ: డి కామేశ్వరి, నాటకీకరణ: డి ఉమా శంకర్, దర్శకత్వం: డి వినయ్ ఈ నాటికను సందేశాత్మకంగా ప్రదర్శించారు.
డాక్టర్ సరోజినీ దేవి మానవసేవయే మాధవసేవ అని భావిస్తూ వైద్య సేవ కొనసాగిస్తున్న రోజుల నుంచి ధర్మం అధర్మంగా మారి డబ్బుకి విలువిస్తున్న డాక్టర్‌గా మారింది. నర్సు నందిని డాక్టర్ సరోజినీదేవి స్థితిగతులను పరిశీలిస్తుంది. సరోజినీ దేవి కారు డ్రైవర్ భార్య సితాలు తన అత్త పార్వతిని వెంటబెట్టుకుని హాస్పిటల్‌కి వస్తుంది. సమాజంలో పేరు ప్రఖ్యాతులు కలిగిన మహాలక్ష్మి, గర్భవతి అయిన తన కూతురు మాధవిని హాస్పిటల్‌కి తీసుకొస్తుంది. సితాలు, మాధవి ఇద్దరికి పురిటి నొప్పుల ప్రసవ వేదన ఒకేసారి మొదలవుతుంది. సరోజినీ దేవి డబ్బు ఆశ వల్ల నిర్లక్ష్యం వల్ల మాధవి కూతురు చనిపోతుంది. సరోజినీ దేవి సూక్ష్మ ఆలోచనతో సితాలు బిడ్డను మాధవి దగ్గర మాధవి బిడ్డను సితాలు దగ్గర పడుకోబెడుతుంది. ఈ విషయం గమనించిన నర్సు నందిని డాక్టర్‌న్ని నిలదీస్తుంది సరోజినీ దేవి నర్సు నందిని నీ భయభ్రాంతులకు గురిచేస్తుంది. సితాలు ఏడుస్తూ హాస్పిటల్ నుంచి వెళ్ళిపోతుంది. మహాలక్ష్మి మాధవికి పుట్టిన బిడ్డను వద్దు అని చెప్పి డాక్టర్‌కి ఇచ్చేసి వెళ్లిపోతుంది. నర్సు నందిని ద్వారా సితాలు, మాధవి నిజానిజాలు తెలుసుకుని డాక్టర్ సరోజినీదేవిని న్యాయస్థానానికి అప్పగిస్తారు. ఈ కథాంశం ఆసక్తిగా సాగింది.


