దేవరపల్లి: ఉదయం నుంచీ ఎండ తీవ్రతతో ఉక్కిరిబిక్కిరయిన ప్రజలు సాయంత్రం చల్లని గాలులతో కురిసిన వర్షంతో ఉపశమనం పొందారు. సాయంత్రం 4 గంటలకు ఆకాశంలో ఒక్కసారిగా కారు మబ్బులు కమ్ముకుని, చిరు జల్లులు కురిశాయి. చల్లని గాలులు వీచాయి. దీంతో, ప్రజలు, ముఖ్యంగా చిన్నారులు రోడ్ల పైకి వచ్చి కేరింతలు కొట్టారు. అయితే, పొగాకు, మిర్చి రైతులు ఆందోళనకు గురయ్యారు. కళ్లాలపై ఎండబోసిన మిరప కాయలను రైతులు రాశులు వేసి, బరకాలు కప్పి ఒబ్బిడి చేశారు. పొగాకు రెలుపులు చివరి దశలో ఉండటంతో వర్షం కురిస్తే నాణ్యత దెబ్బ తింటుందని చెప్పారు. మూడు రోజులు వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ ప్రకటనతో పొగాకు, మిర్చి రైతులు ఆందోళన చెందుతున్నారు.
అంతటా సుభిక్షం,
సౌభాగ్యం నిండాలి
సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): రాష్ట్రంతో పా టు దేశమంతటా సుభిక్షం, సౌభాగ్యం నిండాలని జాయింట్ కలెక్టర్ మేఘస్వరూప్ ఆకాంక్షించారు. కలెక్టరేట్‌లో శ్రీ పరాభవ నామ సంవత్సర జిల్లా స్థాయి ఉగాది వేడుకలు గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ, జిల్లా అభివృద్ధికి అందరూ కలసికట్టుగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ యంత్రాంగం కుటుంబంలా కలిసి ప్రజా సేవ చేయాలని కోరారు. ఈ సందర్భంగా ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. నగర పాలక సంస్థ కమిషనర్ రాహుల్ మీనా, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, రాజమహేంద్రవరం నగరాభివృద్ధి సంస్థ చైర్మన్ బొడ్డు వెంకట రమణ చౌదరి తదితరులు పాల్గొన్నారు.
గేట్‌లో 84వ ర్యాంక్
సామర్లకోట: పట్టణానికి చెందిన తెలగరెడ్డి సాయి ప్రసన్న కుమార్ గేట్ 2026లో ఆలిండియా 84వ ర్యాంక్ సాధించాడు. ప్రస్తుతం ఈ విద్యార్థి దుర్గపూర్‌లో బీటెక్ చదువుతున్నాడు. గతంలో కేఎస్‌ఎన్ జూనియర్ కళాశాలలో ఇంటర్ పూర్తి చేశాడు. సామాన్య కుటుంబంలో పుట్టిన ప్రసన్న కుమార్ గేట్‌లో 84వ ర్యాంక్ సాధించడం పట్ల పలువురు ఫోన్‌లో అభినందనలు తెలిపారు. ప్రసన్న కుమార్ తండ్రి వీరభద్రరావు రోజు కూలీగా పని చేస్తూ కుమారుడిని చదివిస్తున్నాడు. తల్లి భూచక్రవేణు గృహిణి. తమ కుమారుడు మంచి ర్యాంకు సాధించడంపై తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు.


