షాడో ఎమ్మెల్యే! | - | Sakshi
Sakshi News home page

షాడో ఎమ్మెల్యే!

Mar 20 2026 8:07 AM | Updated on Mar 20 2026 8:07 AM

తరగతి గదులు ప్రారంభిస్తున్న వెంకటలక్ష్మి. చిత్రంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు బొడ్డు

వెంకట రమణ చౌదరి

సాక్షి, రాజమహేంద్రవరం: ఆ నియోజకవర్గంలో కొబ్బరికాయ కొట్టాలన్నా.. రిబ్బన్‌ కత్తిరించాలన్నా.. ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్‌ఎఫ్‌) చెక్కులు పంపిణీ చేయాలన్నా.. అన్నిటా ఆమె హవానే కనిపిస్తోంది. ఎమ్మెల్యే చేయాల్సిన పనులన్నీ ఆయన భార్యే చక్కబెట్టేస్తున్నారు. అధికారిక కార్యక్రమాల్లో సైతం ఆమెకే పెద్దపీట. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆమె బరిలోకి దిగేందుకు రంగం సిద్ధం చేస్తున్నారా.. ఎమ్మెల్యే ఇటీవల చేసిన వ్యాఖ్యలు దీనికి బలాన్ని చేకూరుస్తున్నాయా.. అంటే అవుననే సమాధానం వస్తోంది రాజకీయ విశ్లేషకుల నుంచి.

ఇదీ సంగతి

రాజానగరం నియోజకవర్గంలో ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ భార్య వెంకటలక్ష్మి షాడో ఎమ్మెల్యే అవతారం ఎత్తారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కూటమి నేతలను కలవడం, అసెంబ్లీ తదితర వ్యవహారాలను ఎమ్మెల్యే చక్కబెడుతూంటే.. నియోజకవర్గంలో జరుగుతున్న శుభకార్యాలు, పరామర్శల వంటి వాటికి ఆయన భార్య స్వయంగా హాజరవుతున్నారు. ఇందులో తప్పు పట్టడానికేమీ లేదు. అయితే, కొద్ది నెలలుగా ఆమె మరో అడుగు ముందుకేసి అధికారిక కార్యక్రమాల్లో సైతం అన్నీ తానై వ్యవహరిస్తున్నారన్నారనే విమర్శలు వస్తున్నాయి. రహదారుల శంకుస్థాపనల నుంచి, భవనాల ప్రారంభోత్సవం, చెక్కుల పంపిణీ వరకూ అన్నీ ఆమె చేతుల మీదుగానే జరుగుతున్నాయి. ఎమ్మెల్యే భార్య అయినంత మాత్రాన ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వహించడమేమిటనే ప్రశ్న కూటమి నేతల నుంచే వస్తోంది. అధికారం ఉంది కదా అని ఇష్టానుసారం వ్యవహరిస్తే ఎలాగని పలువురు టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు.

● రఘుదేవపురం ప్రభుత్వ పాఠశాలలో అదనపు తరగతి గదుల నిర్మాణం పూర్తయింది. వీటి ప్రారంభోత్సవం ఎమ్మెల్యే బలరామకృష్ణ నిర్వహించారంటే ఫర్వాలేదు. కానీ, ఆయన భార్య వెంకటలక్ష్మి ప్రారంభించారు.

● ఇటీవల సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను సైతం బాధితులకు ఆమే పంపిణీ చేశారు. నేరుగా గ్రామాల్లో లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి మరీ చెక్కులు అందజేస్తున్నారు. దీనినిబట్టి అధికారిక కార్యక్రమాల్లో ఆమె ఏ స్థాయిలో పెత్తనం చేస్తున్నారో అర్థమవుతోందని కూటమిలోని టీడీపీ నుంచే విమర్శలు వస్తున్నాయి. ఎమ్మెల్యే భార్య కావడంతో అధికార యంత్రంగం సైతం ఎదురు చెప్పలేక జీ హుజూర్‌ అంటోంది. ఇదిలా ఉండగా పలు అధికారిక కార్యక్రమాలకు కూటమిలో భాగస్వామి అయిన టీడీపీ జిల్లా అధ్యక్షుడు, రాజానగరం ఇన్‌చార్జ్‌ బొడ్డు వెంకట రమణ చౌదరిని ఆహ్వానించకపోవడం విమర్శలకు తావిస్తోంది. తమకు ఎలాంటి ప్రాధాన్యం దక్కడం లేదని, ఎక్కడా లేని విధంగా ఇక్కడ షాడో ఎమ్మెల్యే పెత్తనమేమిటంటూ టీడీపీ నేతలు, కార్యకర్తలు ఎమ్మెల్యే బత్తులపై కారాలు మిరియాలూ నూరుతున్నారు. ఈ విషయం నియోజకవర్గంలో ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారింది.

2029 ఎన్నికలే లక్ష్యమా?

ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ బహిరంగ రాజకీయాలకే పరిమితం కావడం.. ఆయన భార్య మాత్రం ప్రజల్లో విస్తృతంగా తిరుగుతూండటం వెనుక వేరే వ్యూహం దాగుందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. 2029 ఎన్నికల్లో జనసేన అభ్యర్థిగా టికెట్టు ఇస్తే సిట్టింగ్‌ ఎమ్మెల్యే బలరామకృష్ణ తన భార్య వెంకటలక్ష్మిని పోటీకి దింపేందుకే ఇదంతా చేస్తున్నారని అంటున్నారు. దీనికి బలాన్ని చేకూర్చేలా ఆయన ఇటీవల పలు సమావేశాల్లో మహిళలు రాజకీయాల్లోకి రావాలి, రాణించాలని అంటున్నారు.

ప్రజా వ్యతిరేకత భయంతో..!

చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సుమారు రెండేళ్లు కావస్తోంది. ఇంత తక్కువ వ్యవధిలోనే కూటమి ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకున్నారు. 2024 ఎన్నికలకు ముందు గత ప్రభుత్వం అవినీతికి పాల్పడిందంటూ తప్పుడు ప్రచారం చేసి బలరామకృష్ణ గద్దెనెక్కారు. గత సార్వత్రిక ఎన్నికల అనంతరం నియోజకవర్గంలో ఇసుక, మట్టి, మద్యం మాఫియాకు అడ్డూ అదుపూ ఉండటం లేదనే విమర్శలున్నాయి. అధికారంలోకి వచ్చిన 16 నెలల వ్యవధిలోనే పది కొండలను కొల్లగొట్టేస్తే.. మిగిలిన మూడేళ్లల్లో నియోజకవర్గంలో కొండల పరిస్థితేమిటంటూ సొంత కూటమి నేతలే విమర్శలు గుప్పిస్తున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. రాజానగరం మండలం కొత్త తుంగపాడు, కొండగుంటూరు, కానవరం, జి.యర్రంపాలెం; సీతానగరం మండలం నల్లగొండ తదితర గ్రామాల సమీపాన ఇప్పటికీ అక్రమ మైనింగ్‌ కొనసాగుతోంది. వీటిల్లో ఒకటి రెండుచోట్ల మాత్రమే అనుమతులున్నాయి. అది కూడా రెండు నుంచి ఐదెకరాల వరకూ అనుమతి తీసుకుని, పదెకరాల విస్తీర్ణంలో మైనింగ్‌ చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. నిత్యం వందలాది లారీలతో గ్రావెల్‌ ఈ ప్రాంతం నుంచి రాజమహేంద్రవరం, కడియం, కాకినాడ, రావులపాలెం, మండపేట తదితర ప్రాంతాలకు తరలిపోతోంది. వే బిల్లులు, ఇతర రసీదులూ లేకపోయినా అడ్డుకునే పరిస్థితి కూడా ఎక్కడా ఉండటం లేదు. ఈ అవినీతి, అక్రమాలపై ప్రజల్లో పెద్ద ఎత్తున వ్యతిరేకత నెలకొంది. ఈ పరిస్థితుల్లో 2029 ఎన్నికల్లో పోటీ చేస్తే ఓటమి ఎదురవుతుందేమోనని బలరామకృష్ణ భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే తన భార్య వెంకటలక్ష్మిని జనసేన అభ్యర్థిగా నిలబెట్టేందుకు ఇప్పటి నుంచే వ్యూహరచనలు చేస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే నియోజకవర్గంలో ఆమె షాడో ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

శంకుస్థాపన చేస్తూ..

రాజానగరంలో ఎమ్మెల్యే భార్య హవా

ఆయన చేయాల్సిన పనులన్నీ

ఆమె కనుసన్నల్లోనే..

వచ్చే ఎన్నికల్లో బరిలోకి ఆమె!

అందుకే ఈ హడావుడి

అంటున్న విశ్లేషకులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement