గంగ– రుషుల నది.. యుమున– ప్రేమికుల నది.. కృష్ణ– శిల్పుల నది.. కావేరి– సంగీతకారుల నది అని చెబుతూ.. ప్రముఖ రచయిత, బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన అడవి బాపిరాజు గోదావరిని ‘కవుల నది’గా అభివర్ణిస్తారు. వేదంలా ఘోషించే గోదావరి తీరాన.. ఆదికవి నన్నయ నడయాడిన ఈ నేలన.. శతాబ్దాలుగా కవితా ఝరులు పొంగి పొరలుతూనే ఉన్నాయి. పావన గోదారి నీరు తాగి పెరిగిన ఎంతోమంది అక్షర శిల్పులు.. అద్భుతమైన కవిత్వాన్ని సృజించారు. రేపు ప్రపంచ కవితా దినోత్సవం సందర్భంగా కొంత మంది గోదావరి కవులను చూసొద్దాం రండి..
● ఉమ్మడి ‘తూర్పు’న వికసించిన
కవితా సుమాలెన్నో..
● సుప్రసిద్ధ కవులకు ఈ నేల పుట్టినిల్లు
● రేపు ప్రపంచ కవితా దినోత్సవం
కపిలేశ్వరపురం: మానవ జీవితంలోని వెలుగునీడల్ని ప్రతిబింబించే కథ, కవిత్వం, నవల, నాటకం.. ఇలా ఏ ప్రక్రియ అయినా సమాజ అభ్యున్నతికి దోహదపడినవే. ప్రకృతి వర్ణనలు, భావావేశపు వెల్లువలు, దేశభక్తి, మానవ సంబంధాలు, ఎవ్వరూ పట్టించుకోని చీకటి కోణాల గురించి ఎంతో మంది కవులు తమ కవితల ద్వారా సమాజంలో చైతన్యాన్ని నింపారు. అణువణువునా పావన గోదావరి జలాలతో పునీతమవుతున్న ఈ నేల.. అటువంటి ఎంతో మంది కవులకు జన్మనిచ్చింది.
1885 ఫిబ్రవరి 28న పిఠాపురంలో జన్మించిన శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా, ఆధ్యాత్మిక పీఠం ఆరో పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా పదహారేళ్ల చిరుత ప్రాయంలోనే తత్త్వవేత్తగా, కవిగా గుర్తింపు పొందార. ఆయన కవితలు అంతర్జాతీయ స్థాయిలో వ్యాప్తి చెందాయి.
ఐ.పోలవరంలో పుట్టి.. 1947 నుంచి 1974 వరకూ రాజమహేంద్రవరం వీరేశలింగం ఆస్తికోన్నత పాఠశాలలో తెలుగు పండితుడిగా పని చేశారు మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి. ఆయన ఒక్క అక్షరం ఎక్కువ, తక్కువ కాకుండా సమపాళ్లలో అక్షరాల పొందికతో కవిత్వాన్ని సృజియించడం ఆయన ప్రత్యేకత.
పిఠాపురం ప్రాంతంలోని చంద్రపాలెంలో జన్మించిన దేవులపల్లి వేంకట కృష్ణశాస్త్రి ‘ధనిక సమాజం మారాలనుకోవడమే అభ్యుదయం’ అంటూ సాహిత్య కృషి చేశారు. ఆయన కలం నుంచి ‘మనసున మల్లెల మాలలు, కన్నులలో వెన్నెల డోలలూ’గేటట్లు భావ కవిత్వం అద్భుతంగా జాలువారింది. ‘మావి చిగురు తినగానే కోయిల పలికేనా’, ‘గోరింట పూచింది కొమ్మా లేకుండా’, ‘ఆరనీకుమా ఈ దీపం’, ‘ఆకులో ఆకునై పూవులో పూవునై’ వంటి ఎన్నో గొప్ప సినిమా పాటలను ఆయన రాశారు.
మామిడికుదురులో 1911 సెప్టెంబర్ 19న జన్మించిన బోయి భీమన్న ‘కుల, మత, వర్గ విభేద రహితమైన భారతజాతి ఆవిర్భవించాలన్నదే నా ధ్యేయం’ అంటూ సాహిత్య కృషి చేశారు.
1865 ఫిబ్రవరి 11న సీతానగరంలో జన్మించిన కవిశేఖరుడు పానుగంటి లక్ష్మీ నరసింహారావు ‘సాక్షి’ పేరిట రాసిన వ్యాసాల ద్వారా నాటి సామాజిక పరిస్థితులను ఎండగట్టారు.
పిఠాపురానికి చెందిన ఆవంత్స సోమసుందర్– నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా సాగిన తెలంగాణ సాయుధ పోరాటానికి మద్దతుగా ‘వజ్రాయుధం’ పేరిట వెలువరించిన కవితా సంకలనం.. ఓ సంచలనం. ఈ పుస్తకాన్ని నాటి బ్రిటిష్ ప్రభుత్వం నిషేధించిందంటే.. ఆయన ఎంతటి పదునైన పదాలతో ఈ కవిత్వాన్ని వెలువరించారో చెప్పనవసరం లేదు.
రామచంద్రపురానికి చెందిన అదృష్ట దీపక్– ‘మానవత్వం పరిమళించే మంచి మనసుకు స్వాగతం’ వంటి సినిమా పాటలతో పాటు, అనేక అభ్యుదయ కవితలను రాశారు.
కాకినాడకు చెందిన అద్దేపల్లి రామమోహనరావు విప్లవ కవుల ప్రభావంతో అభ్యుదయ కవిత్వానికి పెద్ద పీట వేశారు. సంఘం శరణం గచ్ఛామి, పొగచూరిన ఆకాశం వంటి కవితా సంపుటాలు వెలువరించారు. ‘శ్రీశ్రీ కవితా ప్రస్థానం’ వంటి సమీక్షా పుస్తకాలు రాశారు.
ఈ కోవలోనే ర్యాలి ప్రసాద్ వంటి అనేక మంది కవులు అనేక సమస్యలను అక్షరీకరిస్తూ తమ కవితల ద్వారా సమాజంలో చైతన్యాన్ని నింపుతున్నారు.
‘అమ్మకు స్వరనీరాజనం’
మండపేటలోని సంగమం సాంస్కృతిక వేదిక నిర్వాహకులు చల్లా రవికుమార్ తన తల్లి లక్ష్మి మరణించిన వేళ దశదిన కర్మకాండలకు దూరంగా ఉంటూ ‘అమ్మకు స్వర నీరాజనం’ పేరిట కవితలు, పాటల కార్యక్రమం ద్వారా నివాళులర్పించారు. ‘భూమిని చీల్చుకునే పుట్టే చెట్టుకు విత్తే కదరా అమ్మ, పురిటి చావుతో యుద్ధం చేసి అమ్మ ఇచ్చును మరుజన్మ’ అంటూ రవికుమార్ స్వయంగా అమ్మపై రాసిన పాటను గాయకుడు సురేష్ నిఖిలం స్వరపరిచారు.
అలాగే, యుద్ధం ప్రభావాలపై ‘పుడమి గాయం, శోకసంద్రం దీనవదనం దిగులు గగనం! యుద్ధమా! ఇది యుద్ధమా?’ అంటూ నల్లి ధర్మారావు రాసిన గేయానికి రాజమహేంద్రవరానికి చెందిన గాయకుడు సురేష్ స్వరకల్పన చేయగా విశేషంగా ఆదరణ పొందింది.
సాహితీ కృషీవలులెందరో..
సాహిత్యాన్ని సృజియించడమే కాదు.. ఆ ప్రవాహం తరువాతి తరానికి కూడా అందించేలా.. ఆ స్ఫూర్తిని కొనసాగించేలా అనేక సంస్థలు నిరంతర కృషి చేస్తున్నాయి. కవి సమ్మేళనాలు, కవుల జయంతులు, వర్ధంతులు, గ్రంథ సమీక్షల వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పల్లిపాలెంలోని ఆంధ్రీ కుటీరం, కాకినాడ కేంద్రంగా సాహితీ స్రవంతి, రామచంద్రపురంలో డాక్టర్ చెలికాని రామారావు స్మారక సమితి, మండపేటలో సంగమం సాంస్కృతిక వేదిక, అ.ర.సం వంటి సంస్థలు ఈ కృషిని కొనసాగిస్తున్నాయి. యుద్ధం, కరోనా, మహిళా వేధింపులు, వాణిజ్య, వ్యాపారాల ప్రభావం, మానవ వికాసం, విలాపం వంటి అనేక సామాజిక అంశాలపై కవితా గోష్టులు నిర్వహిస్తున్నాయి. కవులు కూడా తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ఆలమూరు మండలం సంధిపూడికి చెందిన అంగర గోపాలకృష్ణాచార్యులు (కృష్ణశ్రీ) అంగర లక్ష్మీకాంతం ఎడ్యుకేషనల్ సొసైటీ పేరిట సాహిత్య పుస్తకాలు ముద్రిస్తున్నారు. సామర్లకోటకు చెందిన బసా బలరామకృష్ణ (శ్రమేరా) ‘సాహిత్య సహచరుల వేదిక’, కాకినాడకు చెందిన పెద్దింశెట్టి రామకృష్ణారావు ‘పుస్తకం’ పేరుతోనూ వాట్సాప్ గ్రూపులు నిర్వహిస్తున్నారు. పీడీఎఫ్ రూపంలోని కవితలు, సాహిత్య పుస్తకాలను పంచుకుంటున్నారు.


