రాత్రిళ్లు గాండ్రిస్తూ.. | - | Sakshi
Sakshi News home page

రాత్రిళ్లు గాండ్రిస్తూ..

Mar 9 2026 7:27 AM | Updated on Mar 9 2026 7:27 AM

ముప్పుతిప్పలు పెడుతున్న పెద్ద పులి

డి.కృష్ణవరం సమీపానే మకాం

పాదముద్రల ఆధారంగా నిర్ధారణ

అడ్డతీగల: పులి తన ఉనికిని చాటుతోంది.. రాత్రిళ్లు మూగజీవాలపై విరుచుకుపడుతోంది.. అటవీ సిబ్బందిని ముప్పుతిప్పలు పెడుతోంది. దాని సంచారంతో ఏలేరు పరీవాహక ప్రాంత ప్రజలకు కంటి మీద కునుకు ఉండడం లేదు. అటవీ ప్రాంతానికి చేరువలోనే ఏలేరు వాగు, జలాశయం ఉండడం పులి సంచారానికి అనువుగా ఉందని అధికారులు చెబుతున్నారు. శుక్రవారం రాత్రి అడ్డతీగల మండలం డి.కృష్ణవరంలో ఆవు, దూడను పులి హతమార్చింది. శనివారం అర్ధరాత్రి వచ్చిన పులి దూడ మాంసాన్ని కొద్ది దూరం తీసుకువెళ్లి ఒక కాలిని తిని, మిగతా భాగాన్ని అలాగే వదిలేసింది. అటవీ అధికారులు ఆదివారం ఉదయాన్నే దూడను తీసుకుపోయిన ప్రాంతంలో గాలించి పులి పాదముద్రలను గుర్తించారు. రాజమహేంద్రవరం గత సీఎఫ్‌ బీఎన్‌ఎన్‌ మూర్తి, ప్రస్తుత సీఎఫ్‌ శ్రీకంఠనాథరెడ్డి, కాకినాడ డీఎఫ్‌ఓ రామచంద్రరావు, రంపచోడవరం డీఎఫ్‌ఓ శివకుమార్‌ గంగల్‌, అడ్డతీగల సబ్‌ డీఎఫ్‌ఓ సుబ్బారెడ్డి నాగార్జునాసాగర్‌, శ్రీశైలం ప్రాంతాల నుంచి వచ్చిన రెస్క్యూ టీంతో కలసి ఆయా రేంజ్‌ల అధికారులు తిమ్మాపురం పరిసర ప్రాంతాల్లో మకాం వేసిన పులి పట్టివేతకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా డి.కృష్ణవరం సమీపాన తిష్టవేసిన పెద్ద పులిని బంధించడానికి అధికారులు మూడు బోన్లను ఏర్పాటు చేశారు. ఆయా బోన్లలో రెస్క్యూ టీంకు చెందిన షూటర్లు ఆదివారం ఒక్కో బోనులో ఒక్కొక్కరు చొప్పున కాపు కాసి ఉన్నారు. అయితే పులి అధికారులు భావించినట్లు కాకుండా మరో దారి నుంచి వచ్చి తిమ్మాపురం – బొంగరాలపాడు మధ్య ఏలేరు వాగును దాటుకుని వీరభద్రపురం రక్షిత అటవీ ప్రాంతంలోకి వెళ్లిపోయినట్లు అటవీ అధికారులు తేల్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement