కండక్లర్లకు 439 పవర్ బ్యాంక్‌ల అందజేత
రాజమహేంద్రవరం సిటీ: ఆర్టీసీ బస్సు ప్రయాణ సమయంలో టికెట్స్ జారీ సేవల్లో అంతరాయం నివారించేందుకు కండక్టర్లకు పవర్ బ్యాంకులు అందజేస్తున్నామని జిల్లా ప్రజా రవాణా అధికారి వై.ఎస్.ఎన్. మూర్తి తెలిపారు. నగరంలో మంగళవారం ఆర్టీసీ కార్యాలయంలో కండక్టర్లకు పవర్ బ్యాంకులు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సీ్త్ర శక్తి పథకం అమలుతో మహిళా ప్రయాణికుల రద్దీ గణనీయంగా పెరగడంతో టికెట్ల జారీ సంఖ్య కూడా అధికమై, ఈ–పాస్ యంత్రాల వినియోగం పెరిగిందనీ, సేవల్లో ఎటువంటి అంతరాయం లేకుండా పవర్ బ్యాంకులు అందజేస్తున్నామన్నారు. రాజమహేంద్రవరం డిపోకు 189, కొవ్వూరు డిపో 84, నిడదవోలు డిపో 54, గోకవరం డిపో 112 మొత్తం 439 పవర్ బ్యాంకులు అందజేశామన్నారు.
ఉత్సాహంగా చెస్
జిల్లా స్థాయి ఎంపికలు
ప్రకాశం నగర్ (రాజమహేంద్రవరం): శాప్ ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక ఎస్‌కేవీటీ డీగ్రీ కళాశాలలో చెస్ జిల్లా స్థాయి ఎంపికలు ఉత్సాహంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి శాప్ డైరెక్టర్ పి.రవీంద్రనాథ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాలుగు విభాగాల్లో జరిగిన చెస్ జిల్లా స్థాయి ఎంపికల్లో మొత్తం వంద మంది క్రీడాకారులు తలపడగా వారిలో 16 మంది రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారని తెలిపారు. ఎంపికై న క్రీడాకారులు ఈ నెల 21, 22న తిరుపతిలో జరిగే రాష్ట్ర స్థాయి చదరంగం పోటీలకు జిల్లా తరఫున ప్రాతినిధ్యం వహించనున్నారని చెప్పారు. ఎస్‌కేవీటీ కళాశాల ప్రిన్సిపాల్ తిరుపాణ్యం, డీఎస్‌డీవో శేషగిరిరావు, ఎస్‌జీఎఫ్ కార్యదర్శి ఏవీడీ ప్రసాద్ పాల్గొన్నారు.
హోరాహోరీగా జాతీయ
స్థాయి వాలీబాల్ పోటీలు
ఉప్పలగుప్తం: మండలంలోని గొల్లవిల్లి భీమేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలో, జెడ్పీ ఉన్నత పాఠశాలలో శివరాత్రి నేపథ్యంలో జరుగుతున్న అరిగెల శ్రీ రంగయ్య (ఏఎస్‌ఆర్) మెమోరియల్ జాతీయస్థాయి వాలీబాల్ పోటీలు మంగళవారం మూడవ రోజుకు చేరుకున్నాయి. ఈ పోటీల్లో ఆయా రాష్ట్రాల నుంచి పాల్గొన్న జాతీయ స్థాయి క్రీడాకారులు గెలుపే లక్ష్యంగా తమ ప్రతిభను కనబరుస్తున్నారు. హోరాహోరీగా జరుగుతున్న ఈ పోటీల్లో ఫైనల్స్‌లో విజేతలుగా ఏ టీమ్‌లు నిలుస్తాయన్న ఉత్కంఠతో క్రీడాభిమానులు ఎదురుచూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ జట్టు జీఎస్టీ ముంబై జట్టుకు జరిగిన పోరులో ఒకటవ సెట్లో 27–25తో ఆంధ్రప్రదేశ్ గెలుచుకోగా రెండవ సెట్టు 25–23, మూడవ సెట్టు 25–20, నాలుగవ సెట్లో 25–19, ఐదవ సెట్‌లో 15 19 స్కోర్ చేసి ఆంధ్రప్రదేశ్ జట్టుపై జీఎస్టీ ముంబై జట్టు గెలుపొందింది. ఎస్‌ఏఐ కేరళ, కర్ణాటక జట్ల మధ్య జరిగిన పోరులో 25–22, 25–23, 25–17 స్కోర్ చేసి వరుసగా మూడు సెట్లు ఎస్‌ఏఐ కేరళ జట్టుపై కర్ణాటక జట్టు విజయం సాధించింది. ఆంధ్రప్రదేశ్, ఐఓబీ చైన్నె జట్లకు జరిగిన పోరులో ఆంధ్రప్రదేశ్ జట్టుపై 25–18, 25–22, 25–19 స్కోర్ చేసి వరుసగా మూడు సెట్లు ఐఓబీ చైన్నె గెలుచుకుంది. ఐఓబీ చైన్నె, ఎస్‌ఏఐ కేరళ మధ్య జరిగిన పోరులో ఒకటవ సెట్‌ను 26–24 స్కోర్‌తో ఎస్‌ఏఐ కేరళ గెలుచుకోగా, మిగతా వరుస మూడు సెట్లను 25–20, 26–24, 25–19 స్కోరుతో ఐఓబీ చైన్నె గెలుచుకుంది. ఆంధ్రప్రదేశ్ కర్ణాటక మధ్య జరిగిన ఆటలో 25–22, 25–19, 25–17 వరస 3 సెట్లను గెలిచి కర్ణాటక జట్టు విజయం సాధించింది. అల్ఫోన్సా కేరళ , చైన్నె సౌత్ సెంట్రల్ రైల్వే టీం మధ్య జరిగిన ఆటలో 25–15, 25–15, 25–15 స్కోరుతో వరస మూడు సెట్లు చైన్నె గెలుచుకుని కేరళ టీం పై విజయం సాధించింది.
వీరేశ్వరస్వామి
జల విహారానికి ఏర్పాట్లు
ఐ.పోలవరం : మురమళ్ల వీరేశ్వరస్వామివారి ఆలయంలో ఈ నెల 15న ప్రారంభమైన మహా శివరాత్రి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఐదు రోజుల పాటు ఈ ఉత్సవాలు జరుగనున్నాయి. ఇందులో భాగంగా ఆఖరి రోజు 19వ తేదీన జరగబోయే స్వామివారి జల విహారానికి ఏర్పాట్లను చైర్మన్ దాట్ల రామకృష్ణంరాజు, అసిస్టెంట్ కమిషనర్, కార్య నిర్వాహణాధికారి వి.సత్యనారాయణ మంగళవారం పరిశీలించారు. వృద్ధ గౌతమీ నదీ పాయ వద్ద తెప్పోత్సవం జరిగే ప్రాంతాన్ని వారు పరిశీలించి, తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.


