94.2 శాతం ఆల్బెండజోల్ మాత్రల పంపిణీ
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): జిల్లాలో జాతీయ నులిపురుగుల నివారణ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించామని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ కె.వెంకటేశ్వరరావు తెలిపారు. స్థానిక కంటిపూడి రామారావు మున్సిపల్ కార్పొరేషన్ హైస్కూల్‌లో మంగళవారం పిల్లలకు ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ ప్రారంభించారు. దీనికి రాష్ట్ర పరిశీలకులు డాక్టర్ గీతపద్మజ, డాక్టర్ యంవీ.పద్మజ హాజరయ్యారు. డీఎంహెచ్‌వో మాట్లాడుతూ జిల్లాలో ఉన్న అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలలో ఆల్బండజోల్ మాత్రలను పంపిణీ చేశామన్నారు. జిల్లాలో మొత్తం 4,06,342 మంది పిల్లలకు ఉన్నారని, వారిలో 3,82,774 మందికి మాత్రలను పంపిణీ చేశామన్నారు. 94.2 శాతం పంపిణీ పూర్తయిందన్నారు. మాత్రలు వేసుకోని పిల్లలకు ఈ నెల 24న మూడో రౌండ్‌లో వేస్తామన్నారు. జిల్లా సీ్త్ర శిశు సంక్షేమశాఖాధికారి టి.శ్రీదేవి, జిల్లా ఆర్‌బీఎస్‌కే ప్రోగ్రాం అధికారి డాక్టర్ జి.హరిచంద్రప్రసాద్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్, ప్రోగ్రాం అధికారులు డాక్టర్ షమ్మి కుమార్, చిన్న పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ ఇంద్రజ పాల్గొన్నారు. ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవాన్ని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రామచంద్ర ప్రారంభించారు.


