కుదిరిన క్రషర్ కార్మికుల వేతన ఒప్పందం
దేవరపల్లి: గౌరీపట్నం, దేచర్ల ప్రాంతాల్లోని స్టోన్ క్రషర్ల వద్ద పనిచేస్తున్న కార్మికుల వేతనాల పెంపుదలపై యజమానుల అసోసియేషన్, కార్మిక సంఘాల నాయకుల మధ్య మంగళవారం గౌరీపట్నంలో నిర్వహించిన సమావేశంలో నూతన వేతన ఒప్పందం జరిగింది. మూడేళ్ల కాలపరిమితికి వేతన ఒప్పందం జరిగింది. యజమానులు, కార్మిక సంఘాల మధ్య జరిగిన చర్చల్లో పలు డిమాండ్లను యజమానులు అంగీకరించారు. ప్రస్తుతం ఇస్తున్న రోజు వేతనంపై రూ.200 అదనంగా ఇవ్వడానికి, సంక్రాంతి పండగకు ప్రతి కార్మికుడికి రూ. 5 వేలు బోనస్ ఇవ్వడానికి, ఒక జత దుస్తులు ఇవ్వడానికి, ఏడాది పాటు పనిచేసిన కార్మికులకు ఒక నెల వేతనం బోనస్‌గా ఇవ్వడానికి, పనిలో గాయపడితే కార్మికుడికి భత్యం ఇచ్చి వైద్యం చేయించడానికి అంగీకారం కుదిరింది. క్రషర్ ఆడే కార్మికులకు నోస్ మాస్క్, రోజుకు 150 గ్రాముల బెల్లం, రెండు అరటి పండ్లు ఇవ్వడానికి, ప్రతి కార్మికుడికి రూ.5 లక్షలు ఇన్సూరెన్స్ పాలసీ చేయించడానికి, యజమానులు అంగీకరించారు. మరో కొన్ని డిమాండ్లను యజమానులు అంగీకరించినట్టు కార్మిక సంఘాల నేతలు తెలిపారు. యజమానుల అసోసియేషన్ అధ్యక్షుడు ఆండ్రు అనీల్, కార్యదర్శి దోనెల్లి మధుబాబు, ముదునూరి సూర్యనారాయణరాజు, సత్తి అనంతరెడ్డి, కొండపాముల సత్తిబాబు, జ్యేష్ఠ సతీష్, తాటి భాస్కర్, కార్మిక సంఘాల నేతలు ఎస్‌కే మస్తాన్, కస్సే సత్యనారాయణ, గంటా కృష్ణ, ప్రగడ సత్యనారాయణ, కాసింశెట్టి నరసింహరావు, గరగా వెంకటేశ్వరరావు, సత్యవాడ శ్రీనివాసరావు, పలువురు కార్మికులు పాల్గొన్నారు.


