రైతు సేవలకు సెలవు
● ఆర్‌బీకేలపై చంద్రబాబు ప్రభుత్వం అక్కసు
● మొదటగా వాటి పేరు
ఆర్‌ఎస్‌కేలుగా మార్పు
● జిల్లావ్యాప్తంగా ఉన్నవి 367
● ప్రస్తుతం 318కి తగ్గింపు
● 49 రైతు సేవా కేంద్రాలకు మంగళం
● రేషనలైజేషన్ పేరిట సిబ్బంది సర్దుబాటు
సాక్షి, రాజమహేంద్రవరం: రైతులకు వ్యవసాయ సలహాలు, సూచనలు, ఎరువులు, పురుగు మందులు, విత్తనాలు అందించేందుకు గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా, దేశంలో ఎక్కడా లేని విధంగా తీసుకొచ్చిన రైతు భరోసా కేంద్రాల (ప్రస్తుతం రైతుసేవా కేంద్రాలు)కు మంగళం పాడేదిశగా చంద్రబాబు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రైతులకు ఎన్నో రకాల సేవలందించి గత ప్రభుత్వానికి పేరు తెచ్చిన ఆర్‌బీకేల పేరును ఆర్‌ఎస్‌కేలుగా మార్చడమే కాకుండా రేషనలైజేషన్ పేరుతో వాటిని కుదించే ప్రక్రియకు నాంది పలికింది. అనుకున్నదే తడవుగా అమలు చేస్తోంది. ఫలితంగా జిల్లా వ్యాప్తంగా 49 రైతు సేవాకేంద్రాలు కనుమరుగవుతున్నాయి. అందులో విధులు నిర్వర్తించే సిబ్బందిని సైతం కుదించేసి మూసివేసేందుకు రంగం సిద్ధం చేసింది. జిల్లాలో ఇప్పటికే ముసివేత ప్రక్రియ ప్రారంభమైంది. కొన్నిచోట్ల రైతు సేవాకేంద్రాల భవనాలను మండల వ్యవసాయ కార్యాలయాలుగా మార్చేశారు. ఫలితంగా ఆయా కేంద్రాల పరిధిలోని రైతులకు వ్యవసాయ సలహాలు, సేవలు దూరం కానున్నాయి.
జిల్లాలో ఇలా..
జిల్లా వ్యాప్తంగా 367 రైతుసేవా కేంద్రాలు ఉన్నాయి. హేతుబద్ధీకరణ పేరుతో వాటి సంఖ్య 318కు తీసుకొచ్చారు. అంటే 49 కేంద్రాలు మూసేశారు. రెండు, మూడు ఆర్‌ఎస్‌కేలను(రైతు సేవాకేంద్రాలు) ఒకటిగా సర్దుబాటు చేశారు. విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్లు, విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్లతో పాటు విలేజ్ సెరి కల్చర్ సిబ్బంది పనిచేస్తూ రైతులకు సేవలందిస్తున్నారు. ఇందులో కొందరు పదోన్నతులపై వెళ్లగా మరికొంతమంది ఉద్యోగాలను వదిలి వెళ్లిపోయారు. ప్రస్తుతం వీఏఏలు 186, ఏహెచ్‌ఏలు 134 మంది సేవలందిస్తున్నారు.
సరికొత్త నిబంధనలు
చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సరికొత్త నిబంధనలు తీసుకొచ్చింది. రైతు సేవాకేంద్రం పరిధిలోకి 1,400 హెక్టార్ల భూమిని కేటాయించింది. ఇందులో వీఏఏ, వీహెచ్‌ఏలు ఉండాల్సి ఉంది. కానీ కొన్ని ప్రాంతాల్లో రైతు సేవా కేంద్రంలో సిబ్బంది కొరత వేధిస్తోంది. ప్రస్తుతం రైతు సేవాకేంద్రంలో ఒకరు మాత్రమే పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఆ గ్రామాల్లోని ఆర్‌ఎస్‌కేలను ఎత్తివేస్తే.. ప్రస్తుతం అందుతున్న సేవలు మొత్తం అందకుండా పోయే ప్రమాదం ఉందని రైతులు ఆవేదన చెందుతున్నారు.
ఎక్కడా లేని విధంగా..
రైతు భరోసా కేంద్రాల పేరుతో గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని బృహత్తర వ్యవస్థను తీసుకొచ్చింది. రైతులు తమ స్వగ్రామంలోనే వ్యవసాయ సలహాలు, సూచనలు, ఎరువులు, పురుగుమందులు, విత్తనాలు పొందేలా ఏర్పాట్లు చేసింది. భరోసా కేంద్రాల్లో ఆధునాతన కియోస్క్ యంత్రాలు అందుబాటులో ఉంచింది. అని వసతులు కల్పించింది. జిల్లాలో 367 సొంత భవన నిర్మాణాలకు రూ.81.02 కోట్లు వెచ్చించింది. వీటిలో సింహభాగం భవన పనులు గత ప్రభుత్వంలోనే పూర్తవగా.. కూటమి ప్రభుత్వం వచ్చాక నిర్మాణాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. వైఎస్సార్ సీపీ హయాంలో దళారుల ప్రమేయం లేకుండా ఆర్‌బీకేల ద్వారా నేరుగా రైతులకు నాణ్యమైనవ సేవలు అందేవి. అంతటి ప్రాధాన్యం కలిగిన ఆర్బీకేలపై కూటమి ప్రభుత్వం కక్ష గట్టింది. ఫలితంగా పలు ప్రాంతాల్లో ఆర్బీకేలు అలంకార ప్రాయంగా మారాయి. గత ప్రభుత్వంలో ఆర్బీకేల ద్వారా రైతులకు అందే నాణ్యమైన ఎరువులు, పురుగు మందులు, విత్తనాల సరఫరాను చంద్రబాబు సర్కారు ఎత్తేసింది. ఆ బాధ్యత ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల(పీఏసీఎస్)కు కట్టబెట్టింది. ఈ పరిణామం రైతుల్లో ఆందోళన నింపుతోంది. రైతులకు అన్ని వేళల్లో అండగా ఉంటామని ప్రకటించిన చంద్రబాబు ప్రభుత్వం పంట సాగుకు కీలకమైన దశలో ఎరువుల పంపిణీలో చేతులెత్తేయడంతో తమ పరిస్థితేంటన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది.
రైతుల్లో ఆందోళన
తూర్పుగోదావరి వ్యవసాయ ఆధారిత జిల్లా. రైతులకు వ్యవసాయ సలహాలు, సూచనలకు ఎంతో ప్రాధాన్యం ఉంది. అలాంటి తరుణంలో చంద్రబాబు ప్రభుత్వం రైతు సేవాకేంద్రాలను ఎత్తివేసే నిర్ణయం తీసుకోవడం ఎంతవరకు సమంజసమని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఇంతకుముందు తమ గ్రామంలోనే అన్ని రకాల సలహాలు, సూచనలు, పురుగు మందులు, విత్తనాలు ఆర్బీకేల్లో పొందే వాళ్లమని.. కేంద్రాలు ఎత్తేస్తే.. ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి తలెత్తుతుందని ఆవేదన చెందుతున్నారు.
ఇప్పటికే సచివాలయ వ్యవస్థ నిర్వీర్యం
ప్రభుత్వ సంక్షేమ ఫలాలు గుమ్మం వద్దకే అందించేందుకు మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకువచ్చిన వ్యవస్థలపై చంద్రబాబు ప్రభుత్వం అక్కసు ప్రదర్శిస్తోంది. వాటిని నిర్వీర్యం చేసే దిశగా అడుగులు వేస్తోంది. అందులో భాగంగా ఇప్పటికే దేశంలోనే ప్రత్యేక గుర్తింపు పొందిన గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను నాశనం చేసింది. సచివాలయాల ఉద్యోగులను వేధింపులకు గురి చేసేందుకు జాబ్‌చార్జ్‌లో లేని పనులు చేయిస్తూ ఒత్తిడికి గురిచేస్తోంది. జిల్లా వ్యాప్తంగా 512 గ్రామ, వార్డు సచివాలయాలు ఉన్నాయి. వీటిలో 119 వార్డు సచివాయాలు, 393 గ్రామ సచివాలయాలు ఉన్నాయి. వీటిలో 5,513 మంది ఉద్యోగులు ఉండాల్సి ఉండగా.. 4,323 మంది విధులు నిర్వర్తిస్తున్నారు. 1,190 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇప్పటి వరకు ఒక్కో సచివాలయంలో 10 నుంచి 11 మంది ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తున్నారు. ఇటీవల చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో వారి సంఖ్య తగ్గింది. 2,500 కంటే జనాభా తక్కువగా ఉన్న గ్రామ, వార్డు సచివాలయాల్లో ఆరుగురు, 2.500–3,500 మధ్య జనాభా ఉండే సచివాలయాల్లో ఏడుగురు, 3,500 పైబడి జనాభా ఉండే సచివాలయాల్లో ఎనిమది మంది చొప్పున మాత్రమే ఉద్యోగులను కొనసాగించాలని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఒక్కో సచివాలయం నుంచి ఇద్దరి నుంచి ముగ్గురి ఉద్యోగాలకు ఎసరు పెట్టింది. సగటున ఒక్కో సచివాలయంలో ఎనిమిది మంది ఉద్యోగులను లెక్కగట్టినా.. సుమారు 1,417 మందికి స్థాన చలనం కలగనుంది. ఇప్పటికే కొంతమందిని టాటా ఇన్నోవేషన్ హబ్‌కు బదిలీ చేశారు. మిగిలిన వారిని ఇతర శాఖలకు బదిలీ చేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
36 రకాల సర్వేలు
గ్రామ, వార్డు వలంటీర్లు చేపట్టే పనులన్నీ సచివాలయ ఉద్యోగులతో చేయించేస్తున్నారు. ప్రతి నెలా ఇంటి వద్దకే పింఛన్లు అందజేస్తున్నామని గొప్పలు చెప్పుకునేందుకు సచివాలయ ఉద్యోగుల ద్వారా పంపిణీ చేస్తున్నారు. జాబ్‌చార్ట్‌కు విరుద్ధంగా పనులు చేయించేస్తున్నారు. 36 రకాల సర్వేలకు సచివాలయ ఉద్యోగులను వినియోగిస్తున్నారు. ప్రతి నెలా ఉదయం 4 గంటల నుంచి ప్రతి ఇంటికీ వెళ్లి పింఛన్ల పంపిణీ చేపట్టాల్సి వస్తోంది. ఓడీఎఫ్ సర్వేలో భాగంగా మురుగుదొడ్ల ఫొటోలు తీసే బాధ్యతలు సైతం సచివాలయ ఉద్యోగులకే అప్పగించారు. ఆర్‌డబ్ల్యూఎస్ పల్స్ సర్వేలో కుళాయిలు ఫొటోలు సైతం తీస్తున్నారు. ఉదయం 6 గంటలకు పారిశుధ్యం తీరును పరిశీలించాల్సి ఉంది. 100 రోజుల హౌస్‌హోల్డ్ సర్వే, ఇంటింటికీ స్టిక్కర్లు అతికించి కరపత్రాలు పంపిణీ చేసే విధులు చేపడుతున్నారు. విజన్ 2047 పేరుతో సర్వే నిర్వహిస్తున్నారు. హౌస్ టు హౌస్ జియో ట్యాగింగ్ చేస్తున్నారు. ఎంఎస్‌ఎంఈ సర్వే, ప్రజా ఫిర్యాదులపై వెరిఫికేషన్(పీఆర్‌ఎస్) సర్వే, ఎన్‌పీసీఐ లింక్(బ్యాంక్ లింక్) వంటి కార్యక్రమాలన్నీ సచివాలయ ఉద్యోగులే చేపడుతున్నారు. అనుకున్న సమయంలో పూర్తవకపోతే మెమోలు జారీ చేస్తున్నారు.
రైతు సేవలకు సెలవు


