పది పరీక్షలపై ప్రత్యేక దృష్టి
– ఆర్‌జేడీ నాగమణి
ప్రకాశంనగర్ (రాజమహేంద్రవరం): పది పరీక్షలకు ఇంకా 51 రోజులు మాత్రమే ఉన్నాయని, ప్రతి ఒక్కరూ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఉత్తమ ఫలితాల సాధనకు కృషి చేయాలని విద్యాశాఖ ప్రాంతీయ విద్యా సంచాలకులు జోన్ –2, జి. నాగమణి ప్రధానోపాధ్యాయులను, అధికారులను ఆదేశించారు. స్థానిక ఎస్‌కేవీటీ డిగ్రీ కళాశాల సమావేశ మందిరంలో శుక్రవారం ఉదయం జిల్లాలోని మండల విద్యాశాఖ అధికారులు, ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. గత సంవత్సరం తూర్పుగోదావరి జిల్లా పదవ తరగతి ఫలితాల్లో జిల్లాలో 6వ స్థానం, జోన్‌లో ద్వితీయ స్థానంలో ఉందని, ఈ సంవత్సరం మరింత ప్రగతిని సాధించాలన్నారు. పరీక్ష ఫీజు కట్టిన ప్రతి విద్యార్థి ఉత్తీర్ణుడు అవ్వాలన్నారు. ప్రధానోపాధ్యాయులు విద్యార్థుల హాజరు విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. జిల్లా విద్యా శాఖాధికారి కంది వాసుదేవరావు మాట్లాడుతూ..పది విద్యార్థులను ఇప్పటి నుంచే ప్రణాళికా బద్ధంగా చదివిస్తే మంచి ఫలితాలు సాధించవచ్చు అన్నారు. జిల్లా సమగ్ర శిక్ష ఎ.పి.సి.ఎస్. సుభాషిణి, జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయ ఏడీ వెంకట్రాజు, జిల్లా అసిస్టెంట్ ఎగ్జామినేషన్స్ కమిషనర్ అమల పాల్గొన్నారు.
శాంతి భద్రతల పరిరక్షణకు కృషి
విలీన పోలీస్ స్టేషన్ అధికారులకు
సూచించిన ఎస్పీ నరసింహకిశోర్
రాజమహేంద్రవరం రూరల్: శాంతి భద్రతల పరిరక్షణ, నేర నియంత్రణలో నూతన క్రిమినల్ చట్టాల సమర్థంగా అమలు చేయాలని జిల్లా ఎస్పీ డి.నరసింహకిశోర్ జిల్లాలో విలీన పోలీస్‌స్టేషన్ అధికారులకు సూచించారు. శుక్రవారం జిల్లా ఈస్ట్‌జోన్‌లో ఇటీవల విలీనమైన మండపేట టౌన్, మండపేట రూరల్, అంగర, రాయవరం పోలీస్‌స్టేషన్‌లకు చెందిన సీఐలు, ఎస్సైలు జిల్లా ఎస్పీ డి.నరసింహకిశోర్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈస్ట్‌జోన్ డీఎస్పీ బి.విద్య కొత్తగా విలీనమైన పోలీస్ స్టేషన్ల భౌగోళిక స్వరూపం, రాజకీయ స్వరూపం, స్థితిగతులు, నమోదైన కేసులు, లా అండ్ ఆర్డర్ అంశాలపై ఎస్పీ నరసింహకిశోర్‌కు వివరించారు. ఎస్పీ మాట్లాడుతూ రికార్డులన్నింటినీ క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్‌వర్క్ అండ్ సిస్టమ్స్ పోర్టల్‌లో ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలన్నారు. సబ్ డివిజన్ పరిధిలో గుర్తించిన బ్లాక్ స్పాట్లలో డ్రోన్ సర్వైలెన్‌న్స్ విరివిగా ఏర్పాటు చేయాలన్నారు. అనుమానిత ప్రాంతాలలో కార్డన్ ఆపరేషన్స్ నిర్వహించాలన్నారు. రాత్రి పూట గస్తీ ముమ్మరం చెయ్యాలని, అనుమానితుల వేలిముద్రలు ఎంఎస్‌డీ డివైస్ ద్వారా చెక్ చేయాలని విలీన పోలీస్‌స్టేషన్ అధికారులకు సూచించారు.
పది పరీక్షలపై ప్రత్యేక దృష్టి


