‘వైరాగ్యం అంటే అడవులకు పారిపోవడం కాదు’
ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం రూరల్): వైరాగ్యం అంటే అడవులకు పారిపోవడం కాదు, కర్తవ్యాన్ని విస్మరించడం కాదు, సరిగా నీ విధులను నీవు చేయడమే వైరాగ్యమని సమన్వయ సరస్వతి సామవేదం షణ్ముఖ శర్మ అన్నారు. శుక్రవారం హిందు సమాజంలో ఆయన ఆశ్రమవాసిక పర్వంలోని అనేక అంశాలను వివరించారు. ‘వ్యాసుడు తన తపశ్శక్తితో యుద్ధంలో మరణించిన వీరులను భూమి మీదకు తీసుకురావడంలో అంతరార్థం ధాతరాష్ట్రాదుల శోకమోహాలను దూరం చేయడమే. అవిద్య వల్లనే శోకమోహాలు కలుగుతాయి. వైరాగ్యమంటే స్వస్వరూపం తెలుసుకోవడానికి చేసే తీవ్రమైన ఆలోచన, ఆత్మానాత్మ విచారణ’ అని సామవేదం చెప్పారు. ఈ సందర్భంగా అనుశాసన పర్వంలో భీష్ముడు ధర్మరాజుకు చెప్పిన కీటకోపాఖ్యానాన్ని వివరించారు. వ్యాసుడు ఒక కీటకంతో ‘ఎటువంటి భోగానుభవానికి యోగ్యం కాని దేహంతో ఉన్న నీకు మరణమే మేలని అనిపిస్తున్నద’ని అంటాడు. ‘నేను జీవించాలనే అనుకుంటున్నాను’ అని కీటకం సమాధానం చెబుతుంది. ‘శునకము తన బతుకు ఘనమై తలపోయు’ అని అన్నమాచార్యుడి కీర్తనను సామవేదం ఉదహరించారు. అనేక నీచజన్మలు ఎత్తాక, కీటకం రాజుగా జన్మిస్తుంది. ‘ఎన్ని జపాలు చేసినా, యాగాలు చేసినా, అహంకారంతో చేస్తే, అవన్నీ నిరర్థకమవుతాయ’ని వ్యాసుడు రాజుగా జన్మించిన కీటకంతో చెబుతాడు. ‘ధనం, పాండిత్యం, అధికారం, సౌందర్యం, యౌవనం అహంకారానికి కారణాలు కారాదు. దేహానుభవం మనకున్నంతగా పరమాత్మ అనుభవంలోకి రావడం లేద’ని సామవేదం అన్నారు. ‘మనకు మృత్యుభయం ఉండరాదు, ధర్మలోపం కలగరాదనే భయం ఉండాలి. భయం–భక్తీ అంటే ఇదే అర్థమని’ సామవేదం అన్నారు. భారతంలోని చివరి మూడు అధ్యాయాలలో విస్తృతంగా వ్యాసుని ఉపదేశం కనబడుతుంది. ఇది వాసుదేవుని కథా, వ్యాసదేవుని కథా అన్న సందేహం కలగవచ్చు, వాసుదేవుడు, వ్యాసుడూ ఒకరేనని సామవేదం అన్నారు. స్నేహపాశం తపస్సుకు భంగం కనుక, కుంతీదేవి తమను చూడటానికి వచ్చిన పాండవులను హస్తినకు వెళ్లిపొమ్మని ఆదేశిస్తుంది. ముందుగా భాగవత విరించి డాక్టర్ టీవీ నారాయణరావు మాట్లాడుతూ వసంతపంచమి సందర్భంగా వాగ్దేవికి, వాగ్దేవీ వరపుత్రునికి నమస్కరిస్తున్నానని, సరస్వతికి, సమన్వయ సరస్వతికి నమస్కారం చేస్తున్నానని సభకు శుభారంభం పలికారు. ముందుగా పిల్లలకు పుస్తకాలు, కలాలు వితరణ చేశారు.


