దిగుబడిన కష్టాలు
ఫ జిల్లాలో మిర్చి తోటలపై ‘నల్లి’ తెగులు
ఫ దిగుబడులపై తీవ్ర ప్రభావం
ఫ నష్టాల ఊబిలో రైతన్నలు
ఫ క్వింటా రూ.21 వేలు దాటినా దిగాలే
ఫ ఏటా తగ్గుతున్న సాగు విస్తీర్ణం
ఎటపాక: ఎర్ర బంగారమైన మిర్చికి ‘ధర’హారం వచ్చింది.. అంచనాలకు మించి రేటు పెరిగింది.. ప్రస్తుతం ఈ సాగులో నల్లి తెగులు దిగుబడులపై ప్రభావం చూపుతోంది.. ఫలితంగా ధర బాగున్నా రైతులకు కష్టమే మిగులుతోంది.. ఐదేళ్ల నుంచి అనేక ఒడుదొడుకులు ఎదుర్కొంటూ మిర్చి తోటలు సాగు చేస్తున్నా ఫలితం లేకుండా పోతుంది. ఎంతో ఆశతో సాగు చేస్తున్న వాణిజ్య పంట మిర్చి ఈ ఏడాదీ కంటనీరు పెట్టించింది. జిల్లాలో ప్రధానంగా చింతూరు, వీఆర్‌పురం, కూనవరం, ఎటపాక మండలాలు, పోలవరం ముంపు భూములతో సహా సుమారు 6 వేల ఎకరాల్లో మిర్చి పంట సాగు చేస్తున్నారు. అయితే ఉద్యాన శాఖ లెక్కల ప్రకారం 2,300 ఎకరాల్లో మిర్చి సాగు చేస్తున్నట్లు గుర్తించారు. ఐదేళ్ల కిందట సుమారు 10 వేల ఎకరాల్లో సాగు చేసేవారు. రాను రాను సగం వరకూ విస్తీర్ణం తగ్గిపోయింది. నల్లి ప్రభావంతో ఈ ఏడాది కూడా మిర్చి సాగులో దిగుబడులు తగ్గుతున్నాయి. ఎకరా మిర్చి సాగుకు సుమారు రూ.1.20 లక్షల వరకూ పెట్టుబడి పెట్టారు. అయితే ప్రస్తుతం ఎర్ర, నల్ల నల్లి తెగుళ్లు మిర్చి తోటలను ఆశించాయి. వీటి ప్రభావం నుంచి పంటను కాపాడుకునేందుకు ఎన్ని పురుగు మందులు పిచికారీ చేసినా ఫలితం లేదని రైతులు అంటున్నారు. ఈ తెగులు కారణంగా మిర్చి పూత, పిందె, ఆకుల్లోని రసాన్ని పీల్చివేయడంతో తోటలు నల్లగా మాడిపోతున్నాయి. ఈ ఏడాది సుమారు నెల రోజులు ఆలస్యంగా నల్లి ప్రభావం కనపడడంతో ముందుగా వచ్చిన పంటే కొందరు రైతులకు చేతికి అందింది. ఎకరాకు 25 నుంచి 30 క్వింటాళ్ల దిగుబడి రావాల్సి ఉండగా, ఈ తెగులు కారణంగా కేవలం పది క్వింటాళ్ల లోపు మాత్రమే దిగుబడి వస్తుందని రైతులు అంటున్నారు. గోదావరికి జూలై, ఆగస్టు, సెప్టెంబర్ మాసాల్లో వరదల ఉధృతి అధికంగా ఉండడంతో మిర్చి సాగు ఆలస్యమైంది.


