పరిశ్రమల స్థాపనకు విస్తృత ప్రోత
రాజమహేంద్రవరం సిటీ: జిల్లాలో ప్రాథమిక రంగంలో పరిశ్రమలను నెలకొల్పేలా ఔత్సాహికులకు అవగాహన కల్పించి ప్రోత్సహించాలని ఇన్‌చార్జి కలెక్టర్ వై. మేఘస్వరూప్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో జిల్లా పరిశ్రమలు ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వ్యవసాయం, ఉద్యానవన శాఖల పోస్ట్ హార్వెస్టింగ్ యూనిట్లు, పశుసంవర్ధక శాఖ అధికారులు డైరీ, పాల ఉత్పత్తులకు సంబంధించిన పారిశ్రామిక యూనిట్లు, మత్స్య శాఖ అధికారులు చేపల సీడ్స్‌కు సంబంధించిన యూనిట్లు తమ పరిధిలోని ఔత్సాహికులు స్థాపించేలా ప్రోత్సహించాలన్నారు. క్లస్టర్ అభివృద్ధి కార్యక్రమం కింద రంగంపేట మండలం వడిశలేరు గ్రామంలో రూ.15 కోట్ల అంచనాతో ఏర్పాటు చేస్తున్న ఫర్నీచర్ క్లస్టర్‌ను త్వరితగతిన ప్రారంభించేలా చర్యలు చేపట్టాలన్నారు. రాజానగరం మండలం కలవచర్లలోని ఎంఎస్‌ఎమ్‌ఈ పార్కులో గ్రాఫైట్, బంక మట్టితో క్రూసిబుల్స్ తయారీ పరిశ్రమ, సిరామిక్ క్లస్టర్ ఏర్పాటుకు సంబంధించి ఏపీఐఐసీ నుంచి భూమి కేటాయింపునకు అధికారులు చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం కింద 2024–25 సంవత్సరంలో రూ.15 కోట్ల 67 లక్షల మార్జిన్ మనీతో తయారీ, సేవల రంగాల్లో 372 యూనిట్లు, 2025–26 సంవత్సరంలో రూ.16 కోట్ల 31 లక్షల మార్జిన్ మనీతో 353 యూనిట్లు గ్రౌండ్ అయ్యాయని తెలిపారు. నూతన పరిశ్రమల స్థాపనకు సింగిల్ డెస్క్ పోర్టల్‌లో వచ్చే దరఖాస్తులను ఎస్‌ఎల్‌ఏ పీరియడ్‌లోపు డిస్పోజ్ చేయాలన్నారు. జిల్లా పరిశ్రమల అధికారి శ్రీవనిధర్ రామన్, ఉద్యానవన అధికారి ఎన్. మల్లికార్జునరావు, జిల్లా పరిశ్రమల ప్రోత్సాహక అధికారి టి.వి.సూర్యప్రకాశ్, పొల్యూషన్‌శాఖ ఈఈ సూర్యకళ, పరిశ్రమల ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్, అగ్నిమాపక అధికారి ఎం.మార్టిన్ లూథర్ కింగ్ పాల్గొన్నారు.


