ఆర్ట్స్ కళాశాల కామర్స్ బ్లాక్ ప్రారంభం
ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం రూరల్): స్థానిక ఆర్ట్స్ కళాశాల పూర్వ విద్యార్థి తిరుమల విద్యాసంస్థల చైర్మన్ నున్న తిరుమలరావు ఆ కళాశాలలో స్కూల్ ఆఫ్ కామర్స్ అండ్ మేనేజ్‌మెంట్ బ్లాక్ నిర్మాణానికి రూ.42 లక్షలు విరాళంగా ఇచ్చారు. శుక్రవారం ఐటీ, విద్యాశాఖా మంత్రి నారా లోకేష్ ఆర్ట్స్ కాలేజీలోని స్కూల్ ఆఫ్ కామర్స్ అండ్ మేనేజ్‌మెంట్ బ్లాక్ భవనాన్ని తిరుమలరావుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.
లోకేష్ మాట్లాడుతూ మనం చదివిన విద్యా సంస్థలకు తోడ్పడడం ఎంతో గొప్ప విషయమన్నారు. ఈ విషయంలో తిరుమల విద్యాసంస్థల అధినేత తిరుమలరావు ఎప్పుడూ ముందుంటారన్నారు. ఈ సందర్భంగా తిరుమలరావును సన్మానించి జ్ఞాపికను బహూకరించారు. తిరుమలరావు కుమార్తె, విద్యా సంస్థల వైస్ చైర్మన్ డా.శ్రీరష్మిని మంత్రి లోకేష్ అభినందించారు. కార్యక్రమంలో గవర్నమెంటు కాలేజీ (అటానమస్) ప్రిన్సిపాల్ డాక్టర్ కె.రామచంద్రరావు, ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణచౌదరి, కళాశాల విద్యా కమిషనర్ నారాయణ భరత్ గుప్తా, జేసీ వై.మేఘా స్వరూప్, ఆర్‌టీఐహెచ్ నోడల్ ఆఫీసర్ సూర్యప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.


