రేపు పల్స్‌పోలియో
రాజమహేంద్రవరం రూరల్: పల్స్‌పోలియో చుక్కల మందు పంపిణీ కార్యక్రమం జిల్లావ్యాప్తంగా ఆదివారం నిర్వహించనున్నట్లు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి కె.వెంకటేశ్వరరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో మొత్తం 1,89,550 మంది ఐదేళ్ల లోపు పిల్లలకు పోలియో చుక్కలు వేయాలన్నది లక్ష్యమన్నారు. దీనికోసం 2,31,250 డోసుల పోలియో వ్యాక్సిన్లు సిద్ధం చేశామన్నారు. వ్యాక్సిన్ వేసేందుకు 1,084 పల్స్‌పోలియో కేంద్రాలు, 62 ట్రాన్సిట్ టీములు, 62 మొబైల్ టీములను ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రయాణంలో ఉన్న పిల్లల కోసం బస్, రైల్వే స్టేషన్లు, విమానాశ్రయంలో ట్రాన్సిట్ టీముల ద్వారా పోలియో చుక్కలు వేస్తామని వివరించారు. ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకూ ఈ కార్యక్రమం జరుగుతుందని, దీనికోసం 4,782 మంది సిబ్బందిని నియోగిస్తున్నామని తెలిపారు. తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులందరూ తమ ఇంట్లోని ఐదేళ్లలోపు పిల్లలను సమీప పల్స్‌పోలియో కేంద్రానికి తీసుకువచ్చి తప్పనిసరిగా పోలియో చుక్కల మందు వేయించాలని కోరారు. ఆ రోజు పోలియో చుక్కలు వేయించుకోని పిల్లలను గుర్తించి, వ్యాక్సిన్ వేసేందుకు సిబ్బంది ఈ నెల 22, 23 తేదీల్లో ఇంటింటికీ వెళ్తారని డాక్టర్ వెంకటేశ్వరరావు తెలిపారు.
జిల్లా పోలీసు విభాగానికి
ఏబీసీడీ అవార్డు
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): రాష్ట్రవ్యాప్తంగా కీలక కేసుల దర్యాప్తులో అత్యుత్తమ ప్రతిభ కనబరిచే వారికి ప్రతి మూడు నెలలకోసారి ప్రకటించే అవార్డ్ ఫర్ బెస్ట్ ఇన్ క్రైమ్ డిటెక్షన్ (ఏబీసీడీ) అవార్డు జిల్లా పోలీసు విభాగం సాధించింది. ఎస్పీ డి.నరసింహకిశోర్ శుక్రవారం ఈ విషయం తెలిపారు. ఏప్రిల్ నుంచి జూన్ వరకూ మూడు నెలలకు గాను కొవ్వూరు టౌన్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన హత్య కేసును ఛేదించినందుకు గాను ఈ అవార్డుకు ఎంపిక చేశారు. అవార్డును డీజీపీ హరీష్ కుమార్ గుప్తా చేతుల మీదుగా ఎస్పీ అందుకున్నారు. జిల్లాకు ఈ ప్రతిష్టాత్మక అవార్డు దక్కేందుకు, ఆ కేసును ఛేదించేందుకు కృషి చేసిన అధికారులను, సిబ్బందిని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. ఈ స్ఫూర్తితో జిల్లావ్యాప్తంగా మరిన్ని కేసులను సమర్థవంతంగా ఛేదించేందుకు కృషి చేయాలని కోరారు.
‘అన్నవరం, వాడపల్లి’
నిర్వహణలో గోదావరి హారతి
అన్నవరం: రాజమహేంద్రవరంలో నిత్యం నిర్వహిస్తున్న గోదావరి హారతి కార్యక్రమాన్ని ఇకపై అన్నవరం వీర వేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం, కోనసీమ జిల్లా వాడపల్లి శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దేవస్థానం సంయుక్తంగా నిర్వహించనున్నాయి. ఈ మేరకు దేవదాయ, ధర్మాదాయ శాఖ కమిషనర్ కె.రామచంద్ర మోహన్ శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటి వరకూ అన్నవరం దేవస్థానం మాత్రమే ఈ కార్యక్రమం నిర్వహిస్తోంది. రాజమహేంద్రవరం పుష్కర ఘాట్‌లో ప్రతి రోజూ సాయంత్రం 6.30 నుంచి 7 గంటల వరకూ జరిగే గోదావరి హారతి కార్యక్రమానికి అన్నవరం దేవస్థానం ప్రతి నెలా రూ.2.50 లక్షలు ఖర్చు చేస్తోంది. ఇకపై అన్నవరం దేవస్థానం రూ.1.5 లక్షలు (60 శాతం), వాడపల్లి దేవస్థానం రూ.లక్ష (40 శాతం) ఖర్చు చేయాలని కమిషనర్ ఆదేశించారు.
తలుపులమ్మ తల్లికి రూ.49.58 లక్షల ఆదాయం
తుని రూరల్: తలుపులమ్మ అమ్మవారికి హుండీల ద్వారా రూ.49.58 లక్షల ఆదాయం సమకూరింది. లోవ దేవస్థానంలో హుండీలను శుక్రవారం తెరచి నగదు లెక్కించారు. మొత్తం 71 రోజులకు గాను రూ.45,76,941 నగదు, రూ.3,81,514 నాణేలు కలిపి రూ.49,58,455 ఆదాయం సమకూరిందని ఈఓ పెన్మెత్స విశ్వనాథరాజు తెలిపారు. బంగారం 59.20 గ్రాములు, వెండి 1,156 గ్రాములు లభించిందన్నారు. ఆదాయం లెక్కింపులో దేవస్థానం సిబ్బంది, శ్రీవారి సేవకులు, బ్యాంకు అధికారులు పాల్గొన్నారు.
రేపు పల్స్‌పోలియో
రేపు పల్స్‌పోలియో


