పవన్ సభ కోసం.. పచ్చని చెట్లపై వేటు
పెరవలి: ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిందన్న చందంగా ఉంది జనసేన నేతల తీరు. ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర అటవీ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ శనివారం పెరవలిలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ఆ పార్టీ నేతలు జాతీయ రహదారి పక్కన ఉన్న పలు చెట్లను నరికివేశారు. విషయం తెలియడంతో హైవే అధికారులు వెంటనే అక్కడకు చేరుకున్నారు. చెట్లు ఎందుకు, ఎవరిని అడిగి నరుకుతున్నారని ప్రశ్నించారు. దీంతో, జనసేన కార్యకర్తలు వెనక్కు తగ్గారు. అయితే, అప్పటికే పచ్చగా ఉన్న సుమారు 10 చెట్లపై వేటు వేసేశారు. గతంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎక్కడైనా సభ నిర్వహిస్తే చెట్లు నరికివేస్తున్నారంటూ ఏమీ జరగకపోయినా కూటమి నేతలు రచ్చ చేసేవారు. అటువంటిది ఇప్పుడు జనసేన శ్రేణులు చెట్లు నరికివేయడంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి.
టీడీపీ, బీజేపీ దూరం!
మరోవైపు పవన్ సభకు కూటమి నేతల నుంచి పెద్దగా సహకారం అందడం లేదని తెలుస్తోంది. జాతీయ రహదారి పైన, సభా ప్రాంగణం వద్ద జనసేన జెండాలు, ఫ్లెక్సీలే కనిపిస్తున్నాయి. టీడీపీ, బీజేపీ జెండాలు, ప్లెక్సీలు మచ్చుకు కూడా కానరావడం లేదు.
కొంత కాలంగా నిడదవోలు నియోజకవర్గంలో కూటమి నేతల మధ్య విభేదాలు నెలకొన్నాయి. మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు, కందుల దుర్గేష్ కలసి మాట్లాడుకుంటున్నా మండల, నియోజకవర్గ నాయకుల్లో మాత్రం అంతర్గత విభేదాలు, వారి మధ్య దూరాలు బలంగానే ఉన్నాయి. అందువల్లనే జనసేన నేతలు తప్ప, కూటమిలోని మిగిలిన పార్టీల నాయకులెవ్వరూ సభా ప్రాంగణానికి రావడం లేదని పలువురు చెబుతున్నారు.


