సదాచారమున్నచోట కలి ప్రవేశించలేడు
ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం రూరల్): సదాచారమున్న చోట కలి ప్రవేశించలేడని సమన్వయ సరస్వతి సామవేదం షణ్ముఖశర్మ అన్నారు. హిందూ సమాజంలో వ్యాస భారత ప్రవచనాన్ని ఆయన శుక్రవారం కొనసాగించారు. ‘స్వయంవరంలో నలుడిని దమయంతి వరించిందని తెలుసుకున్న కలి పురుషుడు వారిద్దరినీ కష్టాలపాలు చేయాలనుకున్నాడు. నలుడిలో ప్రవేశించడానికి కలి పురుషునికి 12 సంవత్సరాలు పట్టింది. మూత్రవిసర్జనానంతరం ఒకనాడు పాద ప్రక్షాళన చేసుకోకుండా సంధ్యోపాసన చేయడంతో నలుడిలోకి కలి ప్రవేశించగలిగాడు. ఎంత ఉపాసన, పాండిత్యం ఉన్నా సదాచారాన్ని వదిలిపెట్టరాదు. ఆచారాలు చాదస్తాలు కావు. అంటూసొంటూ, ఎంగిలీ అన్నిటినీ వదలి లలితా, విష్ణు సహస్రనామాలు చదివితే ప్రయోజనం ఉండదు’ అని చెప్పారు. ‘‘ద్యూతానికి నలుడిని పుష్కరుడు ఆహ్వానించగా, కలి ప్రభావంతో అతడు అంగీకరిస్తాడు. తన నేస్తమైన ద్వాపరుడి పాచికల్లో కలి ప్రవేశిస్తాడు. పరాజితుడైన నలుడు దమయంతీ సమేతంగా వనాలకు వెళ్తాడు. పిల్లలను పుట్టింటికి పంపించి భర్తను దమయంతి అనుసరిస్తుంది. ద్యూతమాడటం తన భర్త దోషం కాదని, అతనిలో ఏదో మోహం ప్రవేశించిందని గుర్తిస్తుంది. కష్టకాలంలో భర్తను అనుసరించాలి. దుఃఖ సమయంలో భర్తను ఓదార్చగల భార్యతో సమానమైన ఔషధం లేదని నలునితో అంటుంది. ‘నాస్తి భార్యా సమం మిత్రమ్’ అని ఆమె మాటను అంగీకరిస్తూనే, తనతో ఆమె కష్టాలు పడరాదని, పుట్టింటికి వెళ్లిపోవాలని నలుడు అంటాడు. అందుకు దమయంతి అంగీకరించదు. భార్యాభర్తల మాట తీరు ఎలా ఉండాలో తెలుసుకోవాలంటే– రామాయణంలో సీతారాముల సంభాషణ, భారతంలో యుధిష్ఠిర ద్రౌపదీ సంవాదాలు, నల దమయంతుల మాట తీరును పరిశీలించాలి. ఎంతటి విపత్కర పరిస్థితుల్లో సైతం నోరు మూసుకుని పడి ఉండాలంటూ వారు ఒకరినొకరు గద్దించుకోలేదు. పటిష్టమైన వివాహ వ్యవస్థ ఉన్న మన దేశంలో భార్యాభర్తలు స్పర్థలతో విడిపోవడాలు, విడాకుల తగాదాలు బాధాకరం. అంతరించిపోతున్న మహాసంస్కృతి చివరి దశలో ఉన్నామేమో’’ అని సామవేదం ఆందోళన వ్యక్తం చేశారు. జీవితంలో ఎదురయ్యే సుఖదుఃఖాలను బట్టి భార్యాభర్తలు నిర్ణయాలు తీసుకోరాదని, అవి శాశ్వతం కావని, ధర్మమొక్కటే శాశ్వతమని అన్నారు. శకుంతల, దమయంతి, ద్రౌపది, కుంతి వంటి పాత్రలు భారత సీ్త్ర ఔన్నత్యాన్ని తెలియజేస్తాయని వివరించారు.


