అనుమతిపోయేలా.. | - | Sakshi
Sakshi News home page

అనుమతిపోయేలా..

Dec 20 2025 7:11 AM | Updated on Dec 20 2025 7:11 AM

అనుమత

అనుమతిపోయేలా..

ఓపెన్‌ రీచ్‌లలో అధికారుల లీలలు

సెమీ మెకనైజ్డ్‌ పద్ధతిలో అనుమతులు

గోదావరి నదీగర్భంలోకి

నిషేధిత యంత్రాలు

అవసరానికి మించి ఇసుక

తవ్వేందుకు ‘పచ్చ’జెండా

కూటమి నేతలకు లబ్ధి

చేకూర్చేందుకేనని విమర్శలు

సాక్షి, రాజమహేంద్రవరం: కూటమి నేతలకు లబ్ధి చేకూర్చేందుకు అధికార యంత్రాంగం అర్రులు చాస్తోందా.. అందులో భాగంగానే గోదావరి నదిలో ఇసుక ఓపెన్‌ రీచ్‌లకు ఇష్టానుసారం అనుమతులు ఇచ్చేస్తోందా.. అవసరానికి మించి ఇసుక తోడేసేందుకు మార్గం సుగమం చేస్తోందా.. ఒక రీచ్‌ పరిధిలో మరిన్న రీచ్‌లకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిందా.. నిబంధనలు సైతం లెక్క చేయకుండా ముందుకెళ్తోందా.. అంటే జరుగుతున్న పరిణామాలు అవుననే అంటున్నట్లు కనిపిస్తోంది.

అడ్డగోలుగా అనుమతులు

● ఓపెన్‌ రీచ్‌ల అనుమతుల్లో అడ్డగోలు వ్యవహారానికి తెర తీస్తున్నారు. ఒక రీచ్‌ను పలు భాగాలుగా విభజించి మరీ కూటమి నేతలకు కట్టబెడుతున్నారు. కొవ్వూరు మండలం కుమారదేవంలోని ఒక ఓపెన్‌ రీచ్‌ను మూడు రీచ్‌లుగా మార్చారు.

● కుమారదేవం మెయిన్‌ రీచ్‌లో 72 వేల మెట్రిక్‌ టన్నుల ఇసుక తవ్వకానికి విస్సీ ఇంజినీరింగ్‌ సంస్థకు ఈ ఏడాది మార్చి 13 నుంచి అక్టోబర్‌ 18 వరకూ అనుమతులు ఇచ్చారు. ఆ గడువు ప్రస్తుతం ముగిసింది. ఇప్పుడు ఇదే రీచ్‌లో మరో మూడు రీచ్‌లు పుట్టుకొచ్చాయి.

● శ్రీ పవన్‌ ట్రాన్స్‌పోర్ట్‌ సంస్థకు 69,300 మెట్రిక్‌ టన్నుల ఇసుక తవ్వేందుకు కుమారదేవం–2 పేరుతో గత అక్టోబర్‌ వరకూ అనుమతులిచ్చారు. ఇదే రీచ్‌లో 63 వేల మెట్రిక్‌ టన్నుల ఇసుక తవ్వేందుకు ఈవీ వెంకటరావు అనే కాంట్రాక్టర్‌కు గత అక్టోబర్‌ 23వ తేదీ వరకూ అనుమతులివ్వడం గమనార్హం.

● ఇవి చాలవన్నట్లు గత ఏప్రిల్‌ 16న మరో 8,85,000 మెట్రిక్‌ టన్నుల ఇసుక తవ్వుకునేందుకు నాగేంద్ర ఇన్‌ఫ్రాకు అనుమతులు ఇచ్చారు. దీని గడువు వచ్చే ఏడాది ఏప్రిల్‌ వరకూ ఉన్నట్లు ప్రకటన విడుదల చేశారు.

● కూటమి నేతలకు ఇష్టానుసారం దోచి పెట్టేందుకే ఈ అడ్డగోలు వ్యవహారానికి పాల్పడుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఒకే రీచ్‌లో మరిన్ని రీచ్‌లో ఎందుకు, ఎవరికి కేటాయిస్తున్నారో అర్థం కాని పరిస్థితి నెలకొంది.

అనుమతి ముగిసినా..

కుమారదేవం రీచ్‌కు అనుమతులు ముగిసినా ఇసుక తవ్వకాలు మాత్రం ఆగడం లేదు. అధికార పార్టీ నేతల అండదండలతో ఇసుక మాఫియా యథేచ్ఛగా తవ్వకాలు సాగిస్తూ రూ.లక్షలు గడిస్తోంది. రాత్రిళ్లు గుట్టు చప్పుడు కాకుండా తవ్వేస్తున్నారు. ప్రతి రోజూ 200కు పైగా లారీలతో ఇసుకను అక్రమంగా తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. రాత్రిళ్లు రహదారిపై ఇసుక లారీలు క్యూ కడుతున్నాయి. సాయంత్రమైతే చాలు ఈ ప్రాంతం జాతరను తలపిస్తోంది. రీచ్‌లకు అనుమతులున్నా రాత్రి వేళల్లో ఇసుక తవ్వకాలు నిషేధం. అయినా అదేమీ పట్టనట్లు ఇసుక కొల్లగొడుతున్నారు. ఇంత జరుగుతున్నా మైనింగ్‌, రెవెన్యూ అధికారులు అటువైపు కన్నెత్తి కూడా చూడకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.

‘వాల్టా’కు తూట్లు

ఇసుకాసురులు ఏపీ నీరు, భూమి, చెట్ల చట్టానికి (వాల్టా) సైతం తూట్లు పొడుస్తున్నారు. నదీ గర్భంలో యంత్రాలతో తవ్వకాలు (సెమీ మెకనైజ్డ్‌) చేపట్టడం నిషేధం. అయినప్పటికీ, చట్టానికి తూట్లు పొడుస్తూ.. మైనింగ్‌ అధికారులే ఓపెన్‌ రీచ్‌లలో ఇసుక తవ్వకాలకు సెమీ మెకనైజ్డ్‌ పద్ధతిలో అనుమతులు ఇస్తున్నారు. అలా ఎలా ఇస్తున్నారనే ప్రశ్న బలంగా వినిపిస్తోంది. అన్ని అనుమతులతో రీచ్‌ను దక్కించుకుని.. సెమీ మెకనైజ్డ్‌ పద్ధతిలో చేపట్టాలన్నా.. నదిలోని ఇసుకను కూలీలతో మాత్రమే తవ్వించి ఒడ్డుకు తీసుకురావాలి. మూడు ఘనపు మీటర్ల ఇసుక మేట ఉంటే ఒక ఘనపు మీటర్‌ మాత్రమే తవ్వాలి. ఒడ్డుకు తెచ్చిన ఇసుకను యంత్రాలతో లారీల్లోకి లోడ్‌ చేసుకోవచ్చు. అదే సెమీ మెకనైజ్డ్‌ కాకపోతే ఇసుక తవ్వకాలు, లోడింగ్‌ కూడా కూలీలతోనే చేపట్టాలి. గోదావరి నదిలోకి యంత్రాలు, లారీలను తీసుకెళ్లరాదు. కానీ, కుమారదేవంతో పాటు కొవ్వూరు నియోజకవర్గంలోని పలు ర్యాంపుల్లో ఇష్టానుసారం యంత్రాలతో లోడింగ్‌ చేసేస్తున్నారు. వందలాదిగా లారీలను నదీ గర్భంలోకి తీసుకెళ్లి ఇసుక లోడింగ్‌ చేస్తున్నారు.

అంత ఇసుక దేనికో?

జిల్లావ్యాప్తంగా ప్రజలకు అవసరమైన దానికంటే ఎక్కువ ఇసుక తవ్వుకునేందుకు అధికారులు అనుమతులు ఇస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న ఓపెన్‌ రీచ్‌ల ద్వారా 20 లక్షల మెట్రిక్‌ టన్నుల ఇసుక అందుబాటులోకి వస్తుంది. బోట్‌ ర్యాంపుల ద్వారా మరో 10 లక్షల మెట్రిక్‌ టన్నులు సమకూరే అవకాశం ఉంది. ఇది చాలదన్నట్లు కొత్త ర్యాంపులకు అడ్డగోలుగా అనుమతులు ఇచ్చేస్తున్నారు. ఇన్ని ర్యాంపుల ద్వారా తవ్వేస్తున్న లక్షల టన్నుల ఇసుకను ఎక్కడికి తరలిస్తున్నారు.. జిల్లా ప్రజల అవసరం ఎంత అనే ప్రశ్నలకు జవాబు దొరకడం లేదు. గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రవ్యాప్తంగా 2 కోట్ల మెట్రిక్‌ టన్నుల ఇసుక తవ్వకాలు అనుమతులు ఇచ్చారు. ఆ ఇసుకే ప్రభుత్వ పనులకు, ప్రజలు, ప్రైవేటు అవసరాలకు సరిపోయింది. కానీ, చంద్రబాబు ప్రభుత్వంలో ఒక్క మన జిల్లాలోనే కోటి మెట్రిక్‌ టన్నుల తవ్వేందుకు గ్రీన్‌సిగ్నల్‌ ఇస్తున్నారు. ఇతర జిల్లాల అవసరాలకని అధికారులు చెబుతున్నా అంత స్టాక్‌ ఎందుకనే ప్రశ్న తలెత్తుతోంది. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రియల్‌ ఎస్టేట్‌ రంగం సైతం కుదేలైంది. భవన నిర్మాణాలు కూడా అనుకున్న రీతిలో సాగడం లేదు. ప్రభుత్వ అభివృద్ధి పనులు, వ్యక్తిగత భవన నిర్మాణాలు సైతం అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇంత పరిమాణంలో ఇసుక దేనికనే మీమాంస నెలకొంది. రీచ్‌లలో సింహభాగం కూటమి నేతలకే కట్టబెట్టారు. తద్వారా అదనపు తవ్వకాలు, రీచ్‌లకు అనుమతులిచ్చి రూ.కోట్ల దోపిడీకి దారి చూపుతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

అనుమతిపోయేలా..1
1/1

అనుమతిపోయేలా..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement