సొమ్ము వారిది.. సోకు వీరిది
● ఆర్ట్స్ కళాశాలలో దాతల సహకారంతో పలు భవనాల నిర్మాణం
● వాటిని ప్రారంభించిన మంత్రి లోకేష్
● చంద్రబాబు హయాంలో విద్యారంగం పరుగులు పెడుతోందని గొప్పలు
సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): సొమ్ము ఒకరిది.. సోకు ఒకరిది అన్న చందంగా రాజమహేంద్రవరంలో మంత్రి నారా లోకేష్ పర్యటన సాగింది. స్థానిక ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో దాతల సహకారంతో నిర్మించిన భవనాలను ప్రారంభించిన ఆయన.. చంద్రబాబు హయాంలో విద్యారంగం పరుగులు పెడుతోందని, కళాశాల అభివృద్ధికి ప్రభుత్వం విశేష కృషి చేస్తోందని గొప్పలు చెప్పుకోవడంపై పలు విమర్శలు వస్తున్నాయి.
ఏం జరిగిందంటే..
రాజమహేంద్రవరం నగరాభివృద్ధి సంస్థ (రుడా) ఆధ్వర్యాన రూ.32 లక్షలతో కళాశాల మెయిన్ అవుట్ గేట్ ఎలివేషన్ నిర్మించారు. పూర్వ విద్యార్థి, తిరుమల విద్యా సంస్థల చైర్మన్ నున్న తిరుమలరావు, రూసా సహకారంతో రూ.70 లక్షలతో ఇండిపెండెంట్ కామర్స్ బ్లాక్ నిర్మించారు. అలాగే, పూర్వ విద్యార్థి డాక్టర్ ఏవీఎస్ రాజు (యూఎస్‌ఏ), సీపీడీసీ సహకారంతో రూ.11 లక్షలు వెచ్చించి సెంటర్ ఫర్ ఇంటర్నేషనల్ స్టడీస్ అండ్ రీసెర్చ్ సెంటర్ నెలకొల్పారు. హన్స సొల్యూషన్స్ రూ.1.2 కోట్ల సీఎస్‌ఆర్ నిధులతో ఇన్నోవేషన్ అండ్ ఇంక్యుబేషన్ హబ్ నిర్మించింది. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యాన రూ.55 లక్షలతో ఏఐ – డ్రివెన్ డిజిటల్ క్లాస్ రూములు, రూ.కోటితో రీసెర్చ్ అడ్వాన్సెస్ ఇన్ మెటీరియల్ సైన్స్ సెంటర్ అప్‌గ్రెడేషన్, కాలేజీ ఇంటర్నల్ ఫండింగ్ కింద రూ.2.2 కోట్లతో బుద్ధ భవన్ బ్లాక్ విస్తరణ, రూ.1.2 కోట్లతో టెక్నోస్పియర్ కంప్యూటర్ ల్యాబ్, రూ.27 లక్షలతో యాంఫీ థియేటర్, రూ.12 లక్షలతో ఇన్నర్ గేట్, సెంట్రల్ ఆర్చ్ నిర్మించారు. వీటిలో రుడా ఇచ్చిన రూ.32 లక్షలు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన రూ.55 లక్షలు మినహా మిగిలినవన్నీ దాతల సహకారంతో నిర్మించినవే కావడం విశేషం. వీటినే లోకేష్ ప్రారంభించి, వాటిని తమ ప్రభుత్వమే నిర్మించినట్లు చెప్పుకోవడం విమర్శలకు తావిచ్చింది.
స్వోత్కర్ష.. సానుభూతికి యత్నం
తన పర్యటనలో ‘హలో లోకేష్’ పేరిట మంత్రి లోకేష్ విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు. ఈ కార్యక్రమం ఆద్యంతం ఆయన స్వోత్కర్షకే సరిపోయింది. స్టాన్‌ఫర్డ్‌లో తాను ఎలా చదివారో.. రాజకీయాల్లోకి ఎందుకు వచ్చారో.. తన శరీర ఆకృతిపై వచ్చిన విమర్శలు.. తనను ఏవిధంగా ట్రోల్ చేశారు.. తన తల్లిని వైఎస్సార్ సీపీ నాయకులు ఎన్నో మాటలని అవమానించారనే సమాధానాలు తనను అడిగే ప్రశ్నలో ఉండేలా చూసుకున్నారు. తద్వారా సానుభూతి కోసం ప్రయత్నించారు.
అవే ప్రశ్నలు.. అవే జవాబులు
ఇదివరకు యువగళం పాదయాత్రలో లోకేష్ చాలాచోట్ల విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించి, వారు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. అవన్నీ సోషల్ మీడియాలో వచ్చాయి. ఇప్పుడు ఆర్ట్స్ కళాశాలలో విద్యార్థులు అడిగిన ప్రశ్నలు సైతం అవే కావడం విశేషం. వాటికి ఇదివరకు చెప్పిన సమాధానాలనే లోకేష్ చెప్పడం గమనార్హం.
‘నన్నయ’లో నూతన భవనాలు ప్రారంభం
రాజానగరం: ఆదికవి నన్నయ యూనివర్సిటీలో రూ.33.80 కోట్లతో నిర్మించిన వివిధ భవనాలను రాష్ట్ర హెచ్‌ఆర్‌డీ, ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ శాఖల మంత్రి నారా లోకేష్ శుక్రవారం ప్రారంభించారు. రూ.20.05 కోట్లతో యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్, రూ.8.25 కోట్లతో ఎగ్జామినేషన్స్, రూ.5.50 కోట్లతో స్కూల్ ఆఫ్ కామర్స్ అండ్ మేనేజ్‌మెంట్ స్టడీస్ భవనాలను నిర్మించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ఉన్నత విద్యను అందించాలనే లక్ష్యంతో తమ ప్రభుత్వం పని చేస్తుందని అన్నారు. కార్యక్రమంలో వైస్ చాన్సలర్ ఎస్.ప్రసన్నశ్రీ, రిజిస్ట్రార్ కేవీ స్వామి, ఎమ్మెల్యేలు బత్తుల బలరామకృష్ణ, ఆదిరెడ్డి శ్రీనివాస్, ఎమ్మెల్సీలు సోము వీర్రాజు, పేరాబత్తుల రాజశేఖరం, రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి, కళాశాల విద్య కమిషనర్ నారాయణ భరత్‌గుప్తా, జాయింట్ కలెక్టర్ వై.మేఘాస్వరూప్, ఆర్‌డీఓ కృష్ణనాయక్ తదితరులు పాల్గొన్నారు.
ఫ్లెక్సీ వివాదం
రాజానగరం: మంత్రి లోకేష్ పర్యటన సందర్భంగా ఆదికవి నన్నయ యూనివర్సిటీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు వివాదానికి దారి తీశాయి. ఉభయ గోదావరి జిల్లాల్లోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలందరి పేరుతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి, స్థానికుడైన తమ ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ పేరుతో ఫ్లెక్సీ ఎందుకు పెట్టలేదంటూ జనసేన కార్యకర్తలు ఆందోళనకు దిగారు. దీనిపై వైస్ చాన్సలర్ ప్రసన్నశ్రీని ప్రశ్నించేందుకు లోపలకు వెళ్లబోయిన ఎమ్మెల్యే సతీమణి బత్తుల వెంకటలక్ష్మిని వీసీ సిబ్బంది నెట్టివేశారంటూ వర్సిటీ పరిపాలన భవనం ముంగిట ఆందోళన చేశారు. ఎమ్మెల్యేను, ఆయన భార్యను అవమానించారంటూ వీరంగం సృష్టించారు. దీంతో, వర్సిటీలో కొంతసేపు ఉద్రిక్తత నెలకొంది. అక్కడే ఉన్న ఎమ్మెల్యే బలరామకృష్ణ కొద్దిసేపటికి కలగజేసుకుని, ఆందోళనకారులను శాంతింపజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, వైస్ చాన్సలర్ తీరుపై అసహనం వ్యక్తం చేశారు. ఆమె కావాలనే ఇలా చేశారని ఆరోపించారు. తనను, తన భార్యను అవమానించినప్పటికీ దీనిని వివాదం చేయదలచుకోలేదని, తమ నాయకుల పట్ల వర్సిటీ సిబ్బంది వ్యవహరించి తీరుకు నొచ్చుకున్న కార్యకర్తలు కోపోద్రిక్తులయ్యారని అన్నారు. వీసీ వైఎస్సార్ సీపీ తొత్తుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
వివాదానికి కారణం అదేనా?
ఇదిలా ఉండగా కొన్ని నెలల క్రితం వర్సిటీ ప్రాంగణంలో విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణం భూమి పూజకు వచ్చిన ఎమ్మెల్యే బత్తులనుద్దేశించి వైస్ చాన్సలర్ ప్రసన్నశ్రీ అన్న మాటలే ఈ వివాదానికి ప్రధాన కారణంగా కొంతమంది వర్సిటీ అధికారులు చెబుతున్నారు. వర్సిటీ వ్యవహారంలో ఎమ్మెల్యే జోక్యం తగదని, ఆయన పేరు చెప్పి ఆయన అనుయాయులు తరచూ వర్సిటీ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నారని ఆ సందర్భంగా ఎమ్మెల్యేతో వైస్ చాన్సలర్ అన్నారని అంటున్నారు. దానిని దృష్టిలో పెట్టుకునే ఈ గొడవ జరిగిందని చెబుతున్నారు. ఈ విషయమై వైస్ చాన్సలర్ ప్రసన్నశ్రీని వివరణ కోరగా.. ఈ రోజు ఎటువంటి వివాదమూ జరగలేదని, ఇంతకు మించి చెప్పేది లేదని అన్నారు.


