ఊరు మారింది
చాగల్లు: మండలంలోని ఊనగట్ల గ్రామం మూడు గ్రామాలకు వ్యాపార కేంద్రం. జనాభా 7,500. ఓటర్లు 5,300 మంది. గత టీడీపీ ప్రభుత్వంలో ఈ గ్రామం అధ్వానంగా, అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండేది. శిథిలావస్థలో ఉన్న పంచాయతీ భవనం, జెడ్పీ స్కూల్లో తరగతి గదుల కొరత, ఆరోగ్య ఉపకేంద్రం లేకపోవడం వంటి సమస్యలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారు. వైద్యానికి ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన దుస్థితి ఉండేది. 2019లో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఊనగట్ల గ్రామం పూర్తిగా కొత్త రూపు సంతరించుకుంది. అభివృద్ధి, సంక్షేమ ఫలాలు ప్రజల చెంతకు చేరాయి. ప్రభుత్వ కార్యాలయాలకు శాశ్వత భవనాలు సమకూర్చారు. ప్రభుత్వ సేవలను ప్రజల చెంతకే చేర్చారు. నాడు–నేడు ద్వారా పాఠశాలల అభివృద్ధి చేపట్టారు. ఇంటి స్థలాలు ఇచ్చి ఇళ్లు నిర్మించారు. 33 పథకాల ద్వారా ఏకంగా రూ.51.07 కోట్ల మేర లబ్ధి చేకూర్చారు. ప్రతి ఏటా ఏదో ఒక పథకం కింద మహిళల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ చేసేవారు. దీంతో, ప్రజల వద్ద పుష్కలంగా డబ్బులుండేవి. వేడినీళ్లకు చన్నీళ్లు తోడన్నట్టు.. జనం కష్టపడి సంపాదించుకున్న దానికి ప్రభుత్వం అందించే సొమ్ము తోడయ్యేది. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదని గ్రామస్తులు వాపోతున్నారు.


