థ్యాంక్యూ జగనన్నా..
మాది నిరుపేద కుటుంబం. మా తల్లిదండ్రులు, చెల్లి, నాన్నమ్మ కలిసుంటాం. మా తండ్రి దివ్యాంగుడైనప్పటికీ నిత్యం సైకిల్‌పై అన్ని ఊళ్లూ తిరుగుతూ, ఆకుకూరలు అమ్మి కుటుంబాన్ని పోషించేవారు. మా అమ్మ కూలి పనులు చేస్తూ కుటుంబ భారాన్ని పంచుకునేది. ఐదేళ్ల క్రితం నాన్న వీర్రాజుకు పక్షవాతం రావడంతో మా కుటుంబం పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. చదువు మధ్యలోనే ఆపేస్తానేమో అనుకున్న సమయంలో 2019లో జగనన్న ప్రభుత్వం ఏటా ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వడంతో చదువు సాగించగలిగాను. విద్యా దీవెన రూ.30 వేలు, వసతి దీవెన రూ.15 వేలు రావడంతో 2023లో బీకాం కంప్యూటర్స్ పూర్తి చేశాను. అనంతరం, కొవ్వూరులో జరిగిన సమావేశంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహరెడ్డి సమావేశంలో మాట్లాడే అవకాశం నాకు వచ్చింది. జగనన్న నా కుటుంబ పరిస్థితి విని చలించిపోయి, ఇంటి స్థలం కేటాయించారు. డిగ్రీ పూర్తయిన తరువాత ఉద్యోగం ఇస్తానని మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారం రాజమహేంద్రవరంలోని రాష్ట్ర జీఎస్టీ కార్యాలయంలో డేటా ఎంట్రీ ఆపరేటర్‌గా ఉద్యోగం ఇచ్చారు. జనవరిలో చేరాను. నెలకు రూ.16,400 జీతం వస్తుంది. ఇంటి వద్దే ఉంటున్న మా నాన్నకు రూ.3 వేల పింఛన్ వచ్చేది. ప్రస్తుతం రూ.6 వేలు వస్తోంది. మా అమ్మ సంధ్యకు మాటలు రావు. ఆమెకు కూడా రూ.3 వేలు పింఛన్ వచ్చింది. నాన్నమ్మకు రూ.4 వేల వృద్ధాప్య పింఛన్ వస్తుంది. ఇప్పటి వరకూ మా కుటుంబానికి పింఛన్ రూపంలో రూ.4 లక్షల వరకూ లబ్ధి చేకూరింది. జగన్ ప్రభుత్వం ఇచ్చిన ఇంటి స్థలం విలువ రూ.4 లక్షల వరకూ ఉంటుంది. నాడు జగనన్న ప్రభుత్వం పెద్ద దిక్కుగా మారడంతో మా జీవితాలు పూర్తిగా మారాయి. మా ఆర్ధిక పరిస్థితి కుదుటబడింది. సాధారణ పేద కుటుంబమైన మాకు ఇంత పెద్ద మొత్తంలో లబ్ధి జరుగుతుందని కలలో కూడా అనుకోలేదు. జగనన్నకు జీవితాంతం రుణపడి ఉంటాం. థాంక్యూ జగనన్నా.
– తిగిరిపల్లి దివ్య, పెద్దేవం, తాళ్లపూడి మండలం
– తాళ్లపూడి


