రూపురేఖలు మారబడి
దేవరపల్లి: దాదాపు 56 ఏళ్ల కిందట దేవరపల్లి మండలం కృష్ణంపాలెంలో దాతల సహకారంతో ఏర్పాటు చేసిన పాఠశాలను ఎన్నో ఏళ్లుగా పట్టించుకున్న వారే లేరు. ప్రహరీ లేక అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా ఉండేది. పాడుబడిన తరగతి గదులు, శిథిలావస్థకు చేరుకున్న భవనాల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులు బిక్కుబిక్కుమంటూ ఉండేవారు. గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అమలు చేసిన నాడు–నేడు కార్యక్రమం ద్వారా ఈ పాఠశాల రూపురేఖలు మారాయి. దీని అభివృద్ధికి 2022–23లో నాటి వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఏకంగా రూ.19 లక్షలు మంజూరు చేసింది. ఈ నిధులతో శిథిల భవనాల మరమ్మతులు, ప్రాంగణం లెవెలింగ్, ప్రహరీ నిర్మాణం, ప్రధాన ద్వారం ఏర్పాటు, విద్యార్థులకు అవసరమైన బెంచీలు, తరగతి గదుల్లో డిజిటల్ బోర్డుల వంటివి ఏర్పాటు చేశారు. అంతకు ముందు పాఠశాలలోని విద్యార్థులందరికీ ఒకే వాష్ రూమ్ ఉండేది. అటువంటిది నాడు–నేడు కార్యక్రమంలో బాలికలకు 7, బాలురకు 6 చొప్పున వాష్ రూములు టైల్స్‌తో నిర్మించి, రన్నింగ్ వాటర్ సౌకర్యం కల్పించారు. అప్పటి వరకూ యూపీ స్కూల్‌గా ఉండగా.. దీనిని జెడ్పీ హైస్కూల్‌గా అప్‌గ్రేడ్ చేశారు. వచ్చే ఏడాది నుంచి ఈ పాఠశాలలో పదో తరగతి అడ్మిషన్లు జరగనున్నాయి.
పాఠశాల బాగుంది
నాడు–నేడు కార్యక్రమానికి ముందు పాఠశాల అధ్వానంగా ఉండేది. శిథిలమై, పెచ్చులూడిన భవనాలతో, మరుగుదొడ్లు లేకపోవడంతో ఇబ్బందులు పడేవాళ్లం. ఇప్పుడు పాఠశాల ఎంతో బాగుంది. ఆటలకు అనువుగా ఉంది.
– మల్లుల ఈశ్వర్ సత్య, 9వ తరగతి,
జెడ్పీ హైస్కూల్, కృష్ణంపాలెం, దేవరపల్లి మండలం
రూపురేఖలు మారబడి


