‘భారత్ బాగుంటే ప్రపంచం బాగుంటుంది’
ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం రూరల్):
‘కలి ప్రభావం వలన మనలో విద్వేషాలు పెరుగుతున్నాయి. నలదమయంతుల చరిత్రను వినడం వలన కలి ప్రభావం నశించి, విద్వేషాలు అంతరించిపోతాయి. భారతదేశం బాగుంటే ప్రపంచం బాగుంటుంది’ అని సమన్వయ సరస్వతి సామవేదం షణ్ముఖశర్మ అన్నారు. స్థానిక హిందూ సమాజంలో వ్యాస భారతంపై 24వ రోజు ప్రవచనాన్ని ఆయన శనివారం కొనసాగించారు. ‘నాకన్నా భాగ్యహీనుడెవరైనా ఉన్నారా అని ధర్మరాజు అడిగినప్పుడు బృహదశ్వుడు అనే మహర్షి నలదమయంతుల చరిత్రను వివరిస్తాడు. నిన్ను నీ తమ్ములు సేవిస్తూనే ఉన్నారు. భార్య చెంతనే ఉంది. అన్నపానాలకు లోటు లేకుండా సూర్య భగవానుడు ఇచ్చిన అక్షయ పాత్ర ఉంది. మహర్షులందరూ నీ చెంతకు వస్తూనే ఉన్నారు. ఇక నీ కష్టం ఏపాటిదని ధర్మరాజుతో మహర్షి సాంత్వన వచనాలు పలుకుతాడు. కష్టాలకు మనం కుంగిపోరాదు. ధర్మ మార్గం తప్పరాదు. ఇదే మనకు నలదమయంతుల చరిత్ర అందించే నీతి’ అని సామవేదం వివరించారు. కర్కోటకుడు అనే సర్పరాజు, దమయంతి, నలుడు, రాజర్షి అయిన ఋతుపర్ణుడు అనే వారిని కీర్తిస్తే, కలి దోషం మనల్ని బాధించదని అన్నారు. ‘దివ్య వృత్తాంతాలను తరచూ వినాలని, సాధనా పథంలో శ్రవణ భాగ్యాన్ని మించిన మార్గం లేదని చెప్పారు. ‘బృహదశ్వుడు అస్త్రవిద్యను ధర్మరాజుకు బోధించాడు. ఆ విద్యతో ధర్మరాజు.. శకునితో ద్యూతమాడి తన రాజ్యాన్ని తిరిగి పొందగలడు. కానీ ధర్మరాజు ఆ పని చేయలేదు. అలా చేస్తే యుద్ధం రాదు. రాకపోతే కృష్ణుని అవతార లక్ష్యం నెరవేరదు’ అని చెప్పారు. వనవాస సమయంలో సైతం పాండవులు నిత్యనైమిత్తికాలను విస్మరించలేదని, పితృ కార్యాలు మానలేదని సామవేదం అన్నారు.
రేపు జిల్లా స్థాయి
విద్యా వైజ్ఞానిక ప్రదర్శన
రాజమహేంద్రవరం రూరల్: బొమ్మూరులోని శ్రీ సత్యసాయి గురుకులంలో సోమవారం జిల్లా స్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు డీఈఓ కంది వాసుదేవరావు తెలిపారు. గురుకులంలో కమిటీ సభ్యులతో శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ఈ వివరాలు వెల్లడించారు. ముందుగా ఇచ్చిన ఏడు అంశాల నుంచి మండలంలో ప్రథమ స్థానం పొందిన ప్రదర్శనను మాత్రమే జిల్లా స్థాయికి తీసుకుని రావాలని సూచించారు. విద్యార్థి వ్యక్తిగత ప్రదర్శనలో మొదటి, ద్వితీయ స్థానం ఇద్దరినీ జిల్లా స్థాయికి పంపాలన్నారు. ఉపాధ్యాయ ప్రదర్శనలో ప్రథమ, ద్వితీయ స్థానం పొందిన వారు కూడా హాజరవ్వాలన్నారు. ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుంచి సత్యసాయి గురుకులంలో ప్రాజెక్ట్ రిజిస్ట్రేషన్ చేయించి, తమకు కేటాయించిన ప్రదేశంలో ఉంచి వెళ్లాలన్నారు. మండల స్థాయి విజేతలందరూ తప్పకుండా జిల్లా స్థాయి ప్రదర్శనకు హాజరు కావాలన్నారు. జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి గ్రూపు విభాగంలో 7, విద్యార్థి వ్యక్తిగత విభాగం నుంచి 2, ఉపాధ్యాయ వ్యక్తిగత విభాగం నుంచి 2 చొప్పున ప్రాజెక్టులను ఎంపిక చేస్తామని వాసుదేవరావు తెలిపారు.
నేడు పల్స్‌పోలియో
రాజమహేంద్రవరం రూరల్: జిల్లావ్యాప్తంగా ఆదివారం పల్స్‌పోలియో చుక్కల మందు కార్యక్రమం నిర్వహించనున్నట్లు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి కె.వెంకటేశ్వరరావు తెలిపారు. జిల్లావ్యాప్తంగా ఐదేళ్ల లోపు చిన్నారులు 1,89,550 మంది ఉన్నారు. వీరిలో 3,274 మందికి వారు నివసించే ప్రాంతం, అనారోగ్య పరిస్థితులను బట్టి పోలియో సోకే అవకాశాలున్నాయని గుర్తించారు. మొత్తం చిన్నారులకు వ్యాక్సిన్ వేసేందుకు 1,084 పల్స్ పోలియో కేంద్రాలు, 62 ట్రాన్సిట్ టీములు, 62 మొబైల్ టీములు ఏర్పాటు చేశారు. పారా మెడికల్ సిబ్బందితో పాటు అంగన్‌వాడీ, స్వచ్ఛంద సంస్థలు, ఎన్‌ఎస్‌ఎస్ వలంటీర్ల సహకారంతో వంద శాతం పిల్లలకు చుక్కలు మందు వేయనున్నారు. గోదావరి లంకలు, ఇటుక బట్టీలు, ఊరికి దూరంగా కాలువ గట్లు, వలస కార్మికులు, సంచార జాతుల వంటి వారు ఉంటున్న 472 హైరిస్క్ ప్రాంతాలను గుర్తించారు. వీరితో పాటు ఆర్టీసీ బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, విమానాశ్రయం తదితర ప్రాంతాల్లో 62 మొబైల్ టీమ్‌ల ద్వారా ప్రతి చిన్నారికి పల్స్‌పోలియో వ్యాక్సిన్ వేస్తారు. దీనికోసం అన్ని శాఖలతో కలిపి 4,782 మంది సిబ్బందిని నియమించారు. జిల్లాకు 2,31,250 డోసుల వ్యాక్సిన్ వచ్చింది. ఆదివారం పోలియో బూత్‌ల ద్వారా వ్యాక్సిన్ వేసిన చిన్నారుల గోళ్లపై సిబ్బంది సిరా గుర్తు పెడతారు. ఇంకా ఎవరైనా మిగిలిపోయి ఉంటే సోమ, మంగళవారాల్లో ఇంటింటికీ తిరుగుతూ గుర్తించి, వ్యాక్సిన్ వేస్తారు.


