లస్కర్లను చూసి పుష్కరం
● ఏళ్ల తరబడి భర్తీ కాని పోస్టులు
● జిల్లావ్యాప్తంగా ఉండాల్సిన
లస్కర్లు 1,500 మంది
● ఉన్నవారు 600 మంది
● వీరిలో అవుట్ సోర్సింగ్ 550 మంది
● ఏడాదిగా అందని జీతాలు
● సిబ్బంది కొరతతో లాకులు,
కాలువలపై పర్యవేక్షణ లోపం
పెరవలి: ఆంధ్రప్రదేశ్‌కు అన్నపూర్ణగా ఖ్యాతికెక్కిన గోదావరి డెల్టాలో కీలకమైన లస్కర్ల వ్యవస్థ తగినంత మంది సిబ్బంది లేక నానాటికీ నీరసించిపోతోంది. ఏయే కాలువల కింద ఏయే పంటలు సాగవుతున్నాయి.. నీటి అవసరం ఎంత.. లాకుల పరిస్థితి ఏమిటి.. నీటి సరఫరా క్రమబద్ధీకరణ వంటి అంశాలను నిరంతరం పర్యవేక్షించే బాధ్యత లస్కర్లది. అటువంటి లస్కర్ల నియామకాలు ఏళ్ల తరబడి జరగకపోవడంతో కాలువలు, లాకుల స్థితిగతులను పట్టించుకుంటున్న వారే కరువవుతున్నారు.
పూర్తి స్థాయిలో లస్కర్లు ఏరీ!
జిల్లాలో అన్ని పంటలూ కలిపి మొత్తం సాగు భూమి 3,53,692 ఎకరాలు. ఇందులో 11 మండలాల్లో కాలువల కింద 1,63,000 ఎకరాల ఆయకట్టు ఉంది. ఈ కాలువలపై ఉన్న లాకుల వద్ద సాగునీటి ప్రవాహాన్ని క్రమబద్ధీకరించే లస్కర్ల నియామకాలు 12 సంవత్సరాలుగా జరగడం లేదు. జిల్లావ్యాప్తంగా గోదావరి డెల్టా కాలువలపై 22 ప్రధాన లాకులున్నాయి. వీటిపై ఒక్కోచోట 30 మంది చొప్పున మొత్తం 660 మంది లస్కర్లు ఉండాలి. అలాగే, మరో చిన్న లాకులు 172 ఉన్నాయి. ఒక్కో లాకు నుంచి సుమారు 30 వేల నుంచి 50 వేల ఎకరాలకు సాగునీరు అందించాల్సి ఉంటుంది. ఇరిగేషన్ వ్యవస్థలో ప్రధాన కాలువ, డెల్టా, ఎవెన్యూ అనే మూడు కేటగిరీలుగా లస్కర్లు ఉంటారు. ప్రధాన కాలువ లస్కర్లు డెల్టాలోని ప్రధాన కాలువలను పర్యవేక్షిస్తూంటారు. ఈ ప్రధాన కాలువలకు అనుసంధానమైన చిన్న కాలువలపై డెల్టా లస్కర్లు విధులు నిర్వహిస్తారు. ఎవెన్యూ లస్కర్లు కాలువ గట్లు, లాకుల వద్ద పిచ్చి మొక్కలు పెరగకుండా.. గట్లు దెబ్బ తినకుండా పర్యవేక్షిస్తారు. ఈ మూడు రకాలూ కలిపి మొత్తం 1,500 మంది లస్కర్లు ఉండాలి. కానీ, అన్ని రకాలూ కలిపి జిల్లావ్యాప్తంగా ప్రస్తుతం 600 మంది మాత్రమే పని చేస్తున్నారు. వీరిలో 50 మంది మాత్రమే శాశ్వత ఉద్యోగులు కాగా, మిగిలిన 550 మందీ అవుట్ సోర్సింగ్ విధానంలోనే పని చేస్తున్నారు. ప్రస్తుతం 900 మంది లస్కర్లకు కొరత ఉంది. మరోవైపు ఏఈల కొరత కూడా ఇరిగేషన్ వ్యవస్థను వేధిస్తోంది. రెండు మూడు లాకుల బాధ్యతను ఒక్కరే చూడాల్సి వస్తోంది. సిబ్బంది కొరత కారణంగా కాలువలు, లాకులపై పర్యవేక్షణ పూర్తి స్థాయిలో జరగడం లేదు. ముఖ్యంగా లస్కర్లు లేకపోవటంతో ఏలూరు, బ్యాంక్ కెనాల్, కాకరపర్రు, నరసాపురం, అమలాపురం, కాకినాడ, జొన్నాడ తదితర కాలువల నుంచి నీటి ప్రవాహం సక్రమంగా జరగక రైతులు కిబ్బందులు పడుతున్నారు. పలుచోట్ల ఆక్రమణలతో పెద్ద కాలువలు పంట కాలువల్లా.. పంట కాలువలు పంట బోదెల్లా మారిపోతున్నాయి. గట్లు కుచించుకుపోతున్నాయి. ఒక్కో లాకు వద్ద 20 నుంచి 30 మంది వరకూ లస్కర్లు పని చేయాల్సి ఉండగా చాలాచోట్ల కనీసం 10 మంది కూడా లేని దుస్థితి నెలకొంది.
ఇచ్చేదే తక్కువ.. ఏడాదిగా అదీ లేదు
అవుట్ సోర్సింగ్ విధానంలో పని చేస్తున్న లస్కర్లకు నెలకు రూ.5,500 మాత్రమే చెల్లిస్తారు. అది కూడా ఏడాది నుంచి జీతాలు చెల్లించకపోవడంతో వారు నానా ఇబ్బందులూ పడుతున్నారు.
వేతనాలు వెంటనే చెల్లించాలి
డెల్టాలోని రబీ ఆయకట్టుకు పూర్తి స్థాయిలో సాగునీరు అందిస్తామని అధికారులు చెబుతున్నారు. ఆయకట్టు చివరి వరకూ నీరు చేరాలంటే లస్కర్ల వ్యవస్థ కీలకం. ఇంతటి ప్రాధాన్యం ఉన్న వ్యవస్థలోని లస్కర్లకు వేతనాలు పెండింగ్‌లో ఉంచటం సరి కాదు. వారికి వెంటనే వేతనాలు విడుదల చేసి, లస్కర్ల పర్యవేక్షణలో రైతులకు సాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలి.
– విప్పరి్‌త్ వేణుగోపాలరావు, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిషత్ చైర్మన్, రిటైర్డ్ ఇరిగేషన్ ఎస్‌ఈ, ధవళేశ్వరం
లస్కర్లను చూసి పుష్కరం
లస్కర్లను చూసి పుష్కరం


