వచ్చే నెల 12న బాడీ బిల్డింగ్ పోటీలు
అమలాపురం టౌన్: జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా క్రీడాకారుడు, విశ్రాంత ఫిజికల్ డైరెక్టర్ దివంగత రంకిరెడ్డి కాశీ విశ్వనాథం (అంతర్జాతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు సాయిరాజ్ సాత్విక్ తండ్రి) పేరుతో వచ్చే జనవరి 12న అమలాపురం ఆఫీసర్స్ రిక్రియేషన్ క్లబ్‌లో ఉభయ గోదావరి జిల్లాల స్థాయి బాడీ బిల్డింగ్, ఫిజిక్ స్పోర్ట్స్ చాంపియన్ షిప్ పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ విషయాన్ని జిల్లా బాడీ బిల్డింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు వంటెద్దు వెంకన్నాయుడు వెల్లడించారు. అమలాపురంలోని వంటెద్దువారి వీధిలో ఈ చాంపియన్ షిప్ పోటీలకు సంబంధించిన పోస్టర్లను జిల్లా అసోసియేషన్ ప్రతినిధులు ఆదివారం ఉదయం విడుదల చేశారు. ఈ పోటీల వివరాలను అసోసియేషన్ కార్యదర్శి, కోచ్ డాక్టర్ కంకిపాటి వెంకటేశ్వరరావు తెలిపారు. పోటీలకు ఉభయ గోదావరి జిల్లాల నుంచి దాదాపు 200 మంది క్రీడాకారులు హాజరవుతారని అన్నారు. మొత్తం 12 కేటగిరీల్లో పోటీలను నిర్వహిస్తున్నామని వివరించారు. విజేతలకు నేషనల్ షీల్డ్‌లు, మెడల్స్, మెరిట్ సర్టిఫికెట్లు, క్యాష్ అవార్డులు ప్రదానం చేయనున్నామన్నారు. పోస్టర్ల విడుదల కార్యక్రమంలో జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు యెనుముల కృష్ణ పద్మరాజు, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ కార్యనిర్వాహక కార్యదర్శి పప్పుల శ్రీరామచంద్రమూర్తి, కోనసీమ బాడీ బిల్డింగ్ అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు నగభేరి కృష్ణమూర్తి, ఉపాధ్యక్షుడు గారపాటి చంద్రశేఖర్, వైస్ ఎంపీపీ అడపా వెంకట సుబ్రహ్మణ్యం, బాడీ బిల్డింగ్ అసోసియేషన్ సభ్యులు మట్టపర్తి వెంకట సముద్రం, నార్ని శ్రీను, చిక్కం రాజబాబు తదితరులు పాల్గొన్నారు.


