నేడు కోటి సంతకాల ర్యాలీ
రాజమహేంద్రవరం రూరల్: ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైఎస్సార్ సీపీ పిలుపు మేరకు ప్రజలు చేసిన కోటి సంతకాల ప్రతులను సోమవారం ఉదయం 10 గంటలకు బొమ్మూరులోని పార్టీ జిల్లా కార్యాలయం నుంచి భారీ ర్యాలీగా కేంద్ర కార్యాలయానికి పంపించనున్నారు. వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ ఆదివారం ఈ విషయం తెలిపారు. ఈ సందర్భంగా నిర్వహించే ర్యాలీపై ప్రజల్లో చర్చ జరగాలని, జిల్లా మొత్తం హోరెత్తేలా ఉండాలని పార్టీ నాయకులకు పిలుపునిచ్చారు. తద్వారా ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వ్యవహారం దేశంలోని ప్రజలందరి దృష్టికీ వెళ్లాలన్నారు. కోటి సంతకాల ప్రతులున్న వాహనాన్ని జెండా ఊపి ప్రారంభిస్తామని, బొమ్మూరు నుంచి కొవ్వూరు వరకూ ర్యాలీ జరుగుతుందని చెప్పారు. పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు కోటి సంతకాల సేకరణ ఉద్యమ స్ఫూర్తితో జరిగిందన్నారు. గ్రామాలు, డివిజన్లు, వార్డుల్లో రచ్చబండ కార్యక్రమాలు ఏర్పాటు చేసి, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వలన జరిగే నష్టాలను వివరిస్తూ ప్రజలు మద్దతు కూడగట్టామని చెప్పారు. దీనికి ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించిందన్నారు. లక్ష్యానికి మించి సంతకాలు సేకరించామన్నారు. జిల్లావ్యాప్తంగా 4.20 లక్షల సంతకాలు సేకరించామని తెలిపారు. ఇప్పటికై నా చంద్రబాబు కళ్లు తెరచి, ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటీకరించే ఆలోచన విరమించుకోవాలని వేణు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమానికి పార్టీ పార్లమెంటరీ పరిశీలకుడు తిప్పల గురుమూర్తిరెడ్డి, పార్లమెంటరీ సమన్వయకర్త డాక్టర్ గూడూరి శ్రీనివాస్, మాజీ మంత్రి తానేటి వనిత, పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, పార్టీ జాతీయ అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ మార్గాని భరత్‌రామ్, మాజీ ఎమ్మెల్యేలు డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి, తలారి వెంకట్రావు, జి.శ్రీనివాస్‌నాయుడు హాజరవుతారని వివరించారు. పార్టీ, వివిధ అనుబంధ విభాగాల నేతలు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు తప్పనిసరిగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా వేణు కోరారు.
బొమ్మూరు నుంచి
కొవ్వూరు వరకూ నిర్వహణ
పార్టీ కేంద్ర కార్యాలయానికి
సంతకాల ప్రతుల తరలింపు
శ్రేణులు రాజమహేంద్రవరానికి
భారీగా తరలి రావాలి
దీనిపై ప్రజల్లో చర్చ జరగాలి
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన వేణు
నేడు కోటి సంతకాల ర్యాలీ


